కడు రమ్యం ... రాములోరి కళ్యాణం
- మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ఘనంగా రాములోరి కళ్యాణం
- భక్త రామదాసు చేయించిన మంగళ సూత్రాలతో సీతమ్మ వారికి మాంగళ్య ధారణ
- పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు
- టీటీడీ తరుపున పట్టు పస్త్రాలు తీసుకొచ్చిన దేవస్థానం చైర్మెన్ బీఆర్ నాయుడు
- తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, దేశం నలు మూలాల నుండి వేలాదిగా తరలి వచ్చిన భక్తులు
దక్షణ అయోద్యగా పేరు గాంచిన భద్రాద్రిలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం కడు
రమ్యంగా జరిగింది. మిథులా స్టేడియంలో ఈ మహాద్భుత ఘట్టాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
మంగళ వాయిద్యాలు, వేద
పండితుల మంత్రోచ్చరణలు,
భక్తుల జయ జయ ద్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వేద పండితులు ఈ కళ్యాణ క్రతువును
పూర్తి చేశారు. కళ్యాణం జరుగుతున్నంత సేపూ ఆలయ పరిసరాలు, మాడ వీధులు రామ నామ స్మరణతో మార్మోగి పోయాయి. తెలంగాణ ప్రభుత్వం తరుపున
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ముందుగా, సతీ సమేతంగా పట్టు వస్త్రాలను తలపై పెట్టుకొని
కళ్యాణ వేదిక వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డి, శాస్త్రోక్తంగా వాటిని అర్చక స్వాములకు అందజేశారు. ఆ తర్వాత, అర్చక స్వాములు వాటిని స్వామి వారికి సమర్పించారు. టీటీడీ
తరుపున దేవస్థానం చైర్మెన్ బీఆర్ నాయుడు దంపతులు
కూడా స్వామి వారికి పట్టు పస్త్రాలు తీసుకొచ్చారు. వీరితో పాటు తెలంగాణ దేవాదాయ
శాఖా మంత్రి కొండా సురేఖ,
రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, తెలంగాణ
ముఖ్య కార్యదర్శి శాంత కుమారి వ్యక్తి గతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు
సమర్పించారు.
తెల్లవారు జామునుండే మొదలైన పెళ్లి సందడి
ఆదివారం తెల్లవారు జామునే, ఆలయ అర్చకులు మర్యాద పురుషోత్తముడు, సకల గుణాభి దేవుడు, రామయ్యకు సుప్రభాత సేవ
చేశారు. ఆ తర్వాత,
తిరువారాధన, ఆరగింపు, మంగళ శాసనం, అభిషేకం నిర్వహించారు.
అనంతరం కళ్యాణ మూర్తులను మంగళ వాయిద్యాల మధ్య పల్లకిలో మిథులా స్టేడియంలోని
మండపానికి తీసుకొచ్చారు. కళ్యాణ వేదిక పైకి స్వామి వారు చేరుకున్న తర్వాత, సాంప్రదాయ బద్దంగా
భక్త రామదాసు చేయించిన పచ్చల పతకం, చింతాకు పతకం, కలికితు రాయి, రామమాడ తదితర ఆభరణాలను శ్రీ రాముడు, సీతమ్మ, లక్ష్మణుడికి ధరింప
జేశారు. కొత్త దంపతులైన శ్రీ సీతారామచంద్ర మూర్తులకు నూతన వస్త్రాలను అలంకరించారు.
ఆ తర్వాత, వేద
పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ వేడుక ప్రారంభమైంది. ముందుగా రామయ్య కళ్యాణంలో
భాగంగా పుణ్యాహ వచనం నిర్వహించారు. అందులో భాగంగా సుందరంగా తీర్చిదిద్దిన కళ్యాణ
వేదికపై జల కలశానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుణ్యాహ వచనం ముగిసిన తర్వాత, విశ్వక్సేనారాధన, యోత్ర ధారణ, కంకణ ధారణ చేశారు. అనంతరం, కళ్యాణం కోసం సీతమ్మ
వారిని,
స్వామి
వారికి అభి ముఖంగా పెళ్లి పీటలపై కూర్చో బెట్టారు. అభిజిత్ లగ్నంలో, అమృత ఘడియలు ముగియక
ముందు,
సరిగ్గా
మధ్యాహ్నం 12.00 గంటలకు వేద పండితుల మంత్రోచ్చారణలు, భక్తుల హర్ష ధ్వానాల మధ్య అర్చకులు
ఉత్సవ మూర్తుల శిరస్సుపై జీలకర్ర, బెల్లం పెట్టారు. ఆ తర్వాత, 12.15 గంటలకు రామదాసు చేయించిన
మంగళ సూత్రాలతో సీతమ్మకు మాంగల్య ధారణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం,12.23 గంటలకు కళ్యాణ ఘట్టంలో
అత్యంత ప్రసిద్ధి గాంచిన తలంబ్రాల
కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ మహాద్భుత కళ్యాణ ఘట్టాన్ని తిలకించేందుకు
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశం నలు మూలల నుండి భక్తులు వేలాదిగా తరలి
వచ్చారు. ఆద్యంతం నయనానందకరంగా సాగిన ఈ కళ్యాణ వేడుక నేటితో ముగియగా, సోమవారం పట్టాభిషేకం మహోత్సవం, రధోత్సవం అత్యంత
వైభవంగా జరగనున్నాయి. ఈ శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలో తెలంగాణ డిప్యూటీ సీఎం
మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, భద్రాద్రి కొత్తగూడెం
జిల్లా పోర్ట్ పోలియో హైకోర్టు జడ్జి సురేపల్లి నంద, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం
నాయక్, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు
రవిచంద్ర,
ఎమ్మేల్యేలు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్
జితేష్ వి పాటిల్,
ఎస్పీ రోహిత్ రాజ్,
ఐటీడీఏ పీఓ బి. రాహుల్, భద్రాచలం ఆలయ ఈఓ రమాదేవి తదితరులు పాల్గొన్నారు.




Comments
Post a Comment