అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి
- ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టికి డబ్ల్యూజేఐ ప్రతినిధుల వినతి
- కలెక్టర్ సూచన మేరకు సమస్యలపై డీపీఆర్ఓ గౌష్ పాషాతో చర్చలు
ఖమ్మం: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం (ఐ అండ్ పీఆర్) జారీ చేసిన ‘ది తెలంగాణ మీడియా అక్రిడేషన్ రూల్స్ 2025’ లో కొన్ని నిబంధనలు జిల్లాల్లో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ‘అక్రిడేషన్ కార్డులు’ పొందడంలో ఇబ్బందిగా మారాయని, వాటికి వెంటనే సవరణలు చేయాలని కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (WJI)ఖమ్మం జిల్లా ప్రతినిధులు కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టికి వినతి పత్రం సమర్పించారు. ఖమ్మం కలెక్టర్ కార్యాలయంలోని తన చాంబర్లో అనుదీప్ దూరిశెట్టిని కలిసిన యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఎన్. ఎస్ రావు, ఖమ్మం జిల్లా కన్వీనర్ గంటెల ఆనంద్, కోకన్వీనర్లు యెన్నబోయిన శ్రీనివాస రావు, ఎం.ఏ అన్సార్ పాషా, అమరనేని రామకృష్ణ, ఖమ్మం నియోజక వర్గ కన్వీనర్ కె. కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా నాయకులు జాబిశెట్టి కుటుంబరావు, బొడ్డుపల్లి రవీందర్ అక్రిడేషన్లు పొందడంలో చిన్న పత్రికలు, డెస్క్,ఇండిపెండెంట్, వెబ్ సైట్, కేబుల్ టీవీ జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.
ఈ సారి 2,000 నుండి 15, 000 వరకు సర్క్యులేషన్ వున్న పత్రికలకు అసలు జిల్లా కేంద్రంలో అక్రిడేషన్ కార్డులే లేవని తెలిపారు. 15,000 నుండి 25, 000 వరకు సర్క్యులేషన్ వున్న పత్రికలకు ఒక్క జర్నలిస్టుకు మాత్రమే కార్డు(మండలం) ఇస్తున్నారని, ఫోటో గ్రాఫర్ కు కూడా కార్డు లేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే, 25,000 నుండి 75, 000 వరకు సర్క్యులేషన్ వున్న పత్రికలకు సహితం ఒక జర్నలిస్ట్, ఒక ఫోటో గ్రాఫర్ కు మాత్రమే అక్రిడేషన్ కార్డులు ఇస్తున్నారని, ఈ మూడు కేటగిరీల్లో డెస్క్ జర్నలిస్టులకు, జిల్లాలో ప్రచురణ కేంద్రం వుంటే ఒక్కొక్క కార్డు ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇవి ఆయా పత్రికల్లో పని చేస్తున్న ఫీల్డ్, డెస్క్ జర్నలిస్టులకు ఏ మాత్రం సరి పోనందున ప్రతి కేటగిరీలో కార్డులు పెంచాలని, జిల్లా కేంద్రాల్లో పని చేసే క్రైమ్, స్పొర్ట్స్, కల్చరల్, ఎడ్యుకేషన్ జర్నలిస్టులకు కూడా రాష్ట్ర స్థాయిలో ఇచ్చినట్లు ‘అక్రిడేషన్ కార్డులు’ ఇవ్వాలని కోరారు.
డెస్కులో పని చేస్తున్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, ‘మహిళా జర్నలిస్టులు 33 శాతం లేని చోట ఆ కార్డులను మిగిలిన డెష్క్ జర్నలిస్టులకు ఇవ్వాలని, నిబంధనల్లో ‘మాండేట్’ అన్న పదాన్ని తొలగించాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కార్డులు పొందాలంటే, ఇండిపెండెంట్ (ఫ్రీలాన్సర్) జర్నలిస్టులు 5 పాత కార్డులతో పాటు 6 నెలల్లో ప్రచురితమైన 20 బై లైన్ వార్తా క్లిప్పులు పపెట్టాలని విధించిన నిబంధనను సవరించాలని కోరారు. సీనియర్ జర్నలిస్టులు ఎక్కువగా చిన్న పత్రికలు, డిజిటల్ మీడియాలో వార్తలు రాస్తున్నందున, ఇండిపెండెంట్ జర్నలిస్టులు తమ వార్తలకు ఏ వేదికను ఉపయోగించుకున్నా , వార్త ఎక్కడ ప్రచురితమైనా అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని సూచించారు.
న్యూస్ వెబ్ సైట్లకు గడిచిన 6 నెలల్లో ... నెలకు 5 లక్షల యూనిక్ విజిటర్స్ వుండాలన్న నిబంధన కూడా సరైంది కాదని పేర్కొన్నారు. డిజిటల్ మీడియాలో ఒక యూనిక్ విజిటర్ ఒక పేపర్ సబ్ స్క్రైబర్ తో సమానమని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. 2.5 లక్షల సర్క్యులేషన్ వున్న పత్రికలనే పెద్ద పత్రికలుగా గుర్తించినప్పుడు, ఒక వెబ్ సైట్ కు నెలకు 5 లక్షల యూనిక్ విజిటర్స్ వుండాలని నిబంధన పెట్టడం సమంజసం కాదని ఎర్కొన్నారు. ఇది పెద్ద పత్రికల సర్క్యులేషన్ కన్నా (డబుల్) చాలా ఎక్కువగా వున్నంద ఈ సంఖ్యను బాగా తగ్గించాలని కోరారు. అలాగే కేబుల్ టీవీ జర్నలిస్టులకు ప్రసార కేంద్రంలో (జిల్లాలో) 3 అక్రిడేషన్ కార్డులు మాత్రమే ఇస్తున్నారని, వాటిని గతంలో లాగా 4 కార్డులకు పెంచాలని కోరారు.జర్నలిస్టులు ఎదుర్కొంటున్న ఈ ఇబ్బందులను అర్ధం చేసుకొని తన పరిధిలో వున్న వాటిని పరిష్కరించాలని, లేని వాటిని సంబంధిత శాఖాధికారులకు పంపాలని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టికి డబ్ల్యూజేఐ ప్రతినిధులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
అనంతరం కలెక్టర్ సూచన మేరకు జిల్లా పౌర సంబంధాల అధికారి గౌస్ పాషాతో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు.

Comments
Post a Comment