మున్సిపల్ తీర్పుతో విపక్షాలనోళ్లు మూత

Mallu Bhatti Vikramarka
  • అభివృద్ధి, సంక్షేమంపై ప్రజల నమ్మకమే మున్సిపల్ విజయం
  • 2047 నాటికి గ్లోబల్ హబ్ గా తెలంగాణ
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
( తాళ్లూరి అప్పారావు, మధిర )

​రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న పారదర్శక పాలన, చేపడుతున్న అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఉంచిన నమ్మకమే మున్సిపల్ ఎన్నికల విజయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సోమవారం మధిరలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ కేవలం గ్రామీణ పార్టీయేనని బురద చల్లిన వారికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో నోళ్లు మూతపడతాయన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 90 నుంచి 95 మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం చారిత్రాత్మక విజయమన్నారు. అసెంబ్లీ, పార్లమెంటు, పంచాయతీ ఎన్నికల తరహాలోనే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఓటర్లు భారీ మెజారిటీని కట్టబెట్టారని, విజయం అందించిన ప్రతి ఓటరుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం  ప్రజలు ప్రభుత్వంపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమన్నారు. ​గడిచిన రెండు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర మంత్రిమండలి సమిష్టిగా పనిచేస్తూ.. అటు అభివృద్ధిని, ఇటు సంక్షేమాన్ని సమతూకంతో ముందుకు తీసుకెళ్ళి, అర్బన్ సెంటర్లను అభివృద్ధి బాట పట్టించారని భట్టి పేర్కొన్నారు.

​2047 విజన్.. 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ

​తెలంగాణను 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. "మా పోటీ దేశంలోని ఇతర రాష్ట్రాలతో కాదని, ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలతోనేనన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ద్వారా తెలంగాణను గ్లోబల్ హబ్‌గా మారుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పట్టణీకరణకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, పారిశ్రామికీకరణ ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు సృష్టించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విస్తరిస్తున్న పట్టణాలను అభివృద్ధి చేయడానికి​మున్సిపల్ శాఖ బాధ్యతలను స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పట్టణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి కోసం "ప్యూర్ - క్యూర్ - రేర్" (Pure - Cure - Rare)  విధానంతో ముందుకు సాగుతున్నారన్నారు. ​

మున్సిపల్ పరిపాలనలో జవాబుదారీతనం పెంచడానికి మరియు పౌరులకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్యూర్ - క్యూర్ - రేర్" అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పై 
ప్రజలు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తామని అని సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ మీడియా సమావేశంలో గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర్ రావు, మాజీ ఎమ్మెల్యే కొండ బాల కోటేశ్వర్ రావు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ రామనాథం, మున్సిపల్ చైర్మన్ సామినేని సుజాత, వైస్ చైర్మన్ కోన దని కుమార్  మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మిరియాల వెంకటరమణ, నూతనంగా గెల్చిన కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Mallu Bhatti Vikramarka


Comments

Popular Posts

చైర్మన్, వార్డుల రిజర్వేషన్ మార్పుతో మారనున్న ఆశావాహుల తలరాతలు