పారిశుద్ధ్య ఏజన్సీలకు నోటీసులివ్వండి ... ఖమ్మం కలెక్టర్ అనుదీప్ ఆదేశం
- ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పారిశుద్ధ్య నిర్వహణపై అసంతృప్తి
- పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.55 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి
నెలకు 55 లక్షలు ఖర్చు చేస్తున్నప్పటికీ ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో ఆశించిన
స్థాయిలో పారిశుద్ధ్యం నిర్వహణ జరగడం లేదని కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి అసంతృప్తి
వ్యక్తం చేశారు. సంబంధిత పారిశుద్ధ్య నిర్వహణ ఏజెన్సీలకు నోటీసు జారీ చేయాలని
ఆదేశించారు. పని తీరు మెరుగుపడని పక్షంలో సంబంధిత ఏజెన్సీని రద్దు చేయాలని కోరుతూ
డీఎంఈకు లేఖ రాయాలన్నారు. గురువారం ఆయన ఖమ్మం జనరల్ ఆసుపత్రి పని తీరు, ఆసుపత్రిలో ఉన్న
పెండింగ్ పనులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, మునిసిపల్ కార్పొరేషన్
కమీషనర్ అభిషేక్ అగస్త్య లతో కలిసి ఆసుపత్రి వైద్య అధికారులు, మున్సిపల్, మిషన్ భగీరథ
అధికారులతో సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఆసుపత్రిలో ఎఫ్.ఆర్.ఎస్. విధానంలో పారిశుద్ధ్య సిబ్బంది హాజరు నమోదుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎఫ్.ఆర్.ఎస్. హాజరు రిపోర్ట్ ఆధారంగా పారిశుద్ధ్య సిబ్బందికి జీతాలు చెల్లించాలన్నారు. బయో మెడికల్ వేస్ట్ డిస్పోజల్ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 11 నాటికి బయో మెడికల్ ఇంజనీర్ ను తాత్కాలికంగా నియమించాలని, ఆసుపత్రి కోసం అవసరమైన సామాగ్రి కొనుగోలుకు అందించిన ప్రతిపాదనలను ఫాలో అప్ చేస్తూ త్వరగా ఆసుపత్రికి చేరేలా చూడాలని, టిఫ్ఫా స్కానింగ్ ను ప్రభుత్వ ఆసుపత్రిలో చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గత 3 నెలలుగా జనరల్ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. అత్యంత క్లిష్టమైన హై రిస్క్ కేసులను హైదారాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి రిఫర్ చేసిన తర్వాత ఆ కేసులను ఫాలో అప్ చేయాలన్నారు.
ఖమ్మం జనరల్ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తూ, ఆసుపత్రిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా వసతులు మెరుగు పరచాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఈ సందర్భంగా ఆదేశించారు. ఆసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ సిబ్బంది, వైద్యులు అందుబాటులో ఉండటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, సంబంధిత అధికార్లు, సిబ్బంది తమ పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. రెండు వారాలకు ఒక సారి ఆసుపత్రి పని తీరుపై ఖమ్మం మున్సిపల్ కమీషనర్ రివ్యూ నిర్వహించాలని సూచించారు.
ఆసుపత్రిలోని 10 స్పెషల్ రూమ్ మరమ్మత్తు పనులు మున్సిపల్ కార్పోరేషన్
ద్వారా చేపట్టి 15
రోజులలో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఎమర్జెన్సీ సమయంలో వినియోగించేందుకు
జిజిహెచ్ వద్ద 5
లక్షల రూపాయలు నిరంతరం అందుబాటులో వుంచుతామని, ఏ విభాగంలో నైనా వైద్య
పరికరాలు, యంత్రాలు
అవసరం ఉంటే, వెంటనే
కొనుగోలు చేయాలని అన్నారు. ఆసుపత్రిలో కోటి 65 లక్షలతో చేపట్టిన టాయిలెట్స్ ను
నెల రోజుల్లో పూర్తి చేసి, వాటి నిర్వహణకు కూడా
చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలో ఆర్.ఎం.ఓ. లను నియమించి పాలనా వ్యవహారాలు
వారికి అప్పగించాలని కలెక్టర్ సూచించారు.
ఎం.సి.హెచ్ లోని సీవర్ లైన్స్, టాయిలెట్స్ పనులు ఫిబ్రవరి నెలాఖరు వరకు పూర్తి చేయాలని
ఆదేశించారు. ఆసుపత్రి ముందు ఉన్న ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని అన్నారు.
ఓపి రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేక బ్లాక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం
చేయాలన్నారు. ఓపి కోసం ముగ్గురు డేటా ఎంట్రీ ఆపరేటర్లను తాత్కాలిక పద్దతిలో నియమించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆసుపత్రిలో
లిఫ్ట్ మరమ్మత్తు పనులు పూర్తి కాక పోవడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి, 7 రోజుల్లో లిఫ్ట్ పని పూర్తి
చేయాలన్నారు. ఆసుపత్రి అవసరాల కోసం ప్రస్తుత వాటర్ సంప్ సరి పోవడం లేదని, మరో 200 కేఎల్ సామర్థ్యంతో
కూడిన సంప్ నిర్మించాలని అన్నారు. వర్షా
కాలం ముందే ఆసుపత్రి భవనం నుండి ఎక్కడా వాటర్ లీకేజి కాకుండా చర్యలు చేపట్టాలని
అన్నారు. ఎస్.టీ.పి. పెండింగ్ నిర్మాణ
పనులను మరొక కాంట్రాక్టర్ తో చేపట్టి మార్చి 15 నాటికి పూర్తి చేయాలని అన్నారు.
ఆసుపత్రిలో అవసరమైన ఫైర్ సేఫ్టీ పనులు, సిసి కెమెరాల ఏర్పాటు మార్చి 15 నాటికి ఏర్పాటు చేయాలని
కలెక్టర్ మున్సిపల్ కమీషనర్ కు సూచించారు.
ఆసుపత్రి వద్ద రోడ్డు పై స్పీడ్ బ్రేకర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని
సూచించారు. ఆసుపత్రిలో అవసరమైన అంతర్గత రోడ్లు, ఫుట్ పాత్ తో సహా నిర్మాణ
పనులు చేపట్టి నెలాఖరు వరకు పూర్తి చేయాలన్నారు.
ఈ సమావేశంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నరేందర్, వైద్య శాఖ ఇఇ ఉమామహేశ్వర రావు, మునిసిపల్ సహాయ
కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments
Post a Comment