మునిసిపల్ పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు ... ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
- ప్రజలు స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించుకోవాలి
- సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు
జిల్లాలో ఐదు మున్సిపాలిటీ లలో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు ఎటువంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కోరారు. ఫిబ్రవరి 11న నిర్వహించే మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా సత్తుపల్లి, కల్లూరులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రాలతో పాటు రిసెప్షన్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ కేంద్రాలను కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మంగళవారం తనిఖీ చేశారు. డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలలో బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ లో వినియోగించే ఎన్నికల సామాగ్రిని పరిశీలించి, పోలింగ్ సిబ్బందితో మాట్లాడారు. ఓటర్లకు బ్యాలెట్ పేపర్స్ ఇవ్వడం, పివో డైరీ నింపడం, అన్ని ఫార్మ్స్ ఎలా నింపాలి, ఏజెంట్స్ సిగ్నేచర్ ఎక్కడ తీసుకోవాలి, పోలింగ్ పూర్తి అయిన తర్వాత బ్యాలెట్ బాక్స్ సీలింగ్, స్ట్రాంగ్ రూం కు తరలింపు తదితర అంశాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలని, ఎన్నికల విధులు నిర్వహించే వారికి ఏర్పాటు చేసిన చోటనే బస చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎన్నికలను విజవంతంగా పూర్తి చేసిన అనుభవంతో జిల్లాలో పురపాలక ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా నిర్వహిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 11న జిల్లా పరిధిలోని ఏదులాపురం, వైరా, మధిర, కల్లూరు, సత్తుపల్లి మున్సిపాలిటీలలో వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరుగుతుందని అన్నారు. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమై సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుందని, ఫిబ్రవరి 13న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను వెల్లడిస్తామన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్ గుర్తించి ఆయా కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేశామని, సీసీ కెమెరా ద్వారా నిరంతర పర్యవేక్షిస్తామని, సెన్సిటివ్ కేంద్రాలలో మైక్రో అబ్జర్వర్లను నియమించామని కలెక్టర్ తెలిపారు.
ప్రజలు ఎటువంటి ఒత్తిడులు, భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలని కోరారు. ఓటు వేయడం అందరి భాద్యత అని, ప్రతి ఓటు విలువైనదని, ఓటర్లు అందరూ నిర్ణిత సమయానికి పోలింగ్ కేంద్రాలకు వచ్చి, ఎవరి ప్రభావానికి లోనుకాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలన్నారు. జిల్లాలోని 5 మున్సిపాలిటీలలో 117 వార్డులలో ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఎన్నికల సజావు నిర్వహణకు పూర్తి స్థాయిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాట్లు చేసి, మైక్రో అబ్జర్వార్లను నియమించినట్లు తెలిపారు. ఎన్నికల సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు, తిరిగి పోలింగ్ కేంద్రాల నుండి స్ట్రాంగ్ రూంలకు తరలించేందుకు సరిపడా బస్సులను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్చ, న్యాయ బద్దంగా జరిగేలా అన్ని వర్గాల వారు సహకరించాలని కలెక్టర్ కోరారు. పోలింగ్ సిబ్బంది, అన్ని శాఖల అధికారులు, పోలీస్ శాఖ సమన్వయంతో పని చేసి ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు, తాగు నీరు, కూర్చునే ఏర్పాట్లు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, తహసీల్దారు లక్ష్మి, ఎంపీడీవో చంద్రశేఖర్, మున్సిపల్ కమీషనర్లు నరసింహ, రామదుర్గారెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



Comments
Post a Comment