మధిర సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణ
- ఔటర్ రింగ్ రోడ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విద్యుత్
- విద్య టూరిజం హబ్ గా మధిర నియోజకవర్గం
- జీ+2 పద్ధతిలో నిరుపేదలకు ఇండ్ల నిర్మాణం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
( తాళ్లూరి అప్పారావు, మధిర )
స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి వరకు ఘనమైన చరిత్ర కలిగిన మధిర పట్టణ సర్వతోముఖాభివృద్ధికి పటిష్ట కార్యాచరణతో వేగవంతంగా పనులు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మధిర పట్టణంలో రూ 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న మధిర మున్సిపాలిటి నూతన కార్యాలయ భవన నిర్మాణ పనులకు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు అల్లాడుతున్న సమయంలో దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు, ప్రజాస్వామ్య విలువలు నెలకొల్పేందుకు జాతీయ కాంగ్రెస్ పార్టీ 1885 డిసెంబర్ 28న బొంబాయిలో 86 మంది సభ్యులతో ఆవిర్భవించిందన్నారు.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాడు మధిర పట్టణ ప్రజలకు పౌర సేవలు అందించే మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణానికి నేడు భూమిపూజ చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. పట్టణ ప్రజల అవసరాలను తీర్చేందుకు స్థానిక మున్సిపాలిటీ ప్రజా ప్రతినిధులు అధికారులు పని చేయాలని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పోరాడిన అనేక యోధులకు మధిర ప్రాంతం ఆశ్రయం కల్పించిందని అన్నారు. ఆనాడు వందే మాతరం గీతాన్ని బహిష్కరిస్తే సవాల్ విసిరి నిజాం పోలీసులకు ధీటుగా నిలబడి మధిర ప్రాంతంలో మూడు రంగుల జాతీయ జెండాను మహా యోధులు సర్దార్ జమలాపురం కేశవరావు ఎగుర వేశారని డిప్యూటీ సీఎం గుర్తు చేసుకున్నారు.
గ్రంథాలయ ఉద్యమం, ఆంధ్ర మహా సభల ఉద్యమానికి మధిర పట్టణం కేంద్రంగా నిలిచిందన్నారు. హైదరాబాద్ రాష్ట్రానికి జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా, అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్ ఫలితంగా సెప్టెంబర్ 17, 1948న స్వేచ్ఛా వాయువులు లభించాయన్నారు. మధిర నగర విస్తరణ కోసం ఔటర్ రింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు తయారు చేస్తున్నామని, దీని నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ కోసం నిధులు కేటాయించామన్నారు. పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్డిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేసిన తర్వాత తవ్విన రోడ్ల పునరుద్ధరణ చేస్తామని అన్నారు. పట్టణం లో వర్షపు నీరు రోడ్లపై నిల్వకుండా ఉండాలంటే వరద నీటి కాల్వలను ప్రత్యేకంగా డిజైన్ చేసి కట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్తులో పట్టణంలో నూతన ఇండ్లు కాలనీల నిర్మాణానికి అనుమతులు ఇచ్చే సమయంలో టౌన్ ప్లానింగ్ అధికారులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు.
భారీ వర్షాల సమయంలో విద్యుత్ అంతరాయం రాకుండా ఉండేందుకు అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇల్లు లేని పట్టణంలోనీ నిరుపేదల కోసం జీ+2 పద్ధతిలో ఇండ్లు నిర్మించి పేదలకు అందజేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నామని త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. మధిర పట్టణంలో వెటర్నరీ హాస్పిటల్ భవనంలో ప్రస్తుతం కోర్టు నడుస్తుందని తెలిసి, దీనిని పరిశీలించి వెంటనే ప్రత్యేక భవన మంజూరు చేశామని ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని అన్నారు. మధిర మార్కెట్ యార్డులో కూడా అవసరమైన సంస్కరణలు చేపట్టామని, చుట్టుపక్కల గ్రామాల రైతులు పండించే కూరగాయలు, పప్పు దినుసులు, ఇతర పంటలు విక్రయించేందుకు ప్రత్యేకంగా రైతు బజార్పు న:రుద్ధరిస్తున్నామని అన్నారు. పిల్లలకు ఉజ్వలభవిష్యత్తు అందించేందుకు విద్య చాలా కీలకమని మధిర పట్టణంలో డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, హై స్కూల్ భవనాలను ప్రత్యేకంగా మంజూరు చేసామని అన్నారు.
నైపుణ్యతతో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని గమనించి మధిర పట్టణంలో ఐటిఐ, ఏటిసీ సెంటర్ ను మంజూరు చేసినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రభుత్వ నియామకాల కోసం సిద్ధమవుతున్న యువత కోసం ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లను మంజూరు చేస్తున్నామని అన్నారు.
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మధిర ప్రాంతానికి రావాల్సిన అవసరం ఉందని, దీని కోసం మధిర, ఎర్రుపాలెం ప్రాంతాలలో పారిశ్రామిక పార్కులను మంజూరు చేశామన్నారు. పారిశ్రామిక పార్కు లలో విద్యుత్తు, నీరు, అంతర్గత రోడ్లు అవసరమైన స్థలం అందుబాటులో పెట్టామని, ఉత్సాహం కలిగిన యువత ఎవరైనా పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు.
పట్టణంలో ఉన్న మహిళా సంఘాలకు కూడా మెప్మా ద్వారా వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, మహిళలు వ్యాపార రంగంలో ఎదిగేందుకు అవసరమైన శిక్షణ అందించేందుకు ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటు కు కూడా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పెద్ద చెరువు, జమలా పురం టెంపుల్, పర్యాటక సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. మధిర పట్టణం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు అవుతుందని, ఏపీ రాజధాని కూడా మనకు సమీపంలోనే ఉందని, రైల్వే ట్రాక్ కూడా అందుబాటులో ఉండటంతో పరిశ్రమల అభివృద్ధికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, దీనిని రాజకీయాలకు అతీతంగా మధిర అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన సూచించారు. తొలుత స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న మధిర పట్టణంలో ప్రజలకు మరింత మెరుగ్గా పురపాలక సేవలు అందించేందుకు మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మిస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్మన్ చాంబర్, కౌన్సిల్ సమావేశాలకు ఒక హాల్, మున్సిపల్ కమీషనర్, వివిధ విభాగాల సిబ్బందికి అవసరమైన ఏర్పాట్లతో పురపాలక కార్యాలయం డిజైన్ చేసినట్లు తెలిపారు. కార్యాలయ నిర్మాణ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మధిర పట్టణంలో మౌలిక వసతుల కల్పనపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కమల్లు ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఈ కార్యక్రమంలో మధిర మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్, ఎంపీడివో, ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment