- కాంగ్రెస్ పార్టీలో గ్రూపులకు తావులేదు
- మున్సిపాలిటీ గెలిచి భట్టి కి కానుకగా ఇవ్వాలి
- మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి మంత్రి కొండా సురేఖ
( తాళ్లూరి అప్పారావు, మధిర )
కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేసిన వారికి మున్సిపల్ ఎన్నికలలో పార్టీ బీఫారం ఇవ్వడం జరుగుతుందని, పార్టీలో గ్రూపులకు తావు లేదని మధిర రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి, మధిర మున్సిపల్ ఎన్నికల జిల్లా ఇంచార్జి కొండా సురేఖ పేర్కొన్నారు. స్థానిక రెడ్డి గార్డెన్ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన వారికి పార్టీ టికెట్లు ఇవ్వడం జరుగుతుందని, మధిర మున్సిపాలిటీలోని 22 వార్డులను గెలిచి ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కు కానుకగా ఇవ్వాలన్నారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ప్రజలకు అభివృద్ధి పనులు జరుగుతాయని స్పష్టం చేశారు. వార్డులో గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థికే కాంగ్రెస్ పార్టీ బీ–ఫారం ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. మున్సిపాలిటీలో గెలిచిన అభ్యర్థులు ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటారని, మరో రెండున్నర ఏళ్లలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన నాయకులు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రతి వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కలిసిమెలిసి పనిచేయాలన్నారు. పార్టీ సిద్ధాంతాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని ఆమె హితవు పలికారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి చైర్మన్ పదవిని దక్కించుకునేలా శ్రేణులు కష్టపడాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో గిడ్డంగుల సంస్థ రాష్ట్ర చైర్మన్ రాయల నాగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ, మధిర మాజీ శాసనసభ్యులు కొండబాల కోటేశ్వరరావు, మండల పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్, మిరియాల రమణ గుప్త, తూమాటి నవీన్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

.jpeg)
Comments
Post a Comment