- ప్రజా పాలనను ప్రజలు దీవించి పట్టం కట్టారు
- భవిష్యత్తులో రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు
- 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్తుకు ప్రణాళికలు సిద్ధం
- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
( తాళ్లూరి అప్పారావు, మధిర )
తెలంగాణ రాష్ట్రంలో రెండు విడతల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభంజనం సృష్టించి 85 శాతం స్థానాలు గెలుచుకుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కమల్లు పేర్కొన్నారు. మంగళవారం మధిర నియోజకవర్గ కేంద్రంలో తాజాగా గెలిచిన సర్పంచుల అభినందన సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రజా పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలు దీవించి పెద్ద ఎత్తున కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించారన్నారు. ఎవరు సర్పంచులుగా గెలిచిన ప్రభుత్వం తరఫున న్యాయం చేస్తాం నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు సమానంగా అభివృద్ధి చేస్తాం అని డిప్యూటీ సీఎం అన్నారు. ఈ విజయ దుందుభి లో కాంగ్రెస్ కార్యకర్తల కృషి పోరాటం అద్భుతమైనదని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ 8,600 కోట్లు ఆర్టీసీకి చెల్లించిందని డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా అందులో 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని ఇందుకు గాను ప్రభుత్వం రూ 13,500 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో 85% మంది 200 యూనిట్ల కింద ఉచిత విద్యుత్ కింద ప్రయోజనం పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు ఇంటింటికి వెళ్లి చీరలు పంపిణీ చేస్తున్నామని వివరించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నాం అన్నారు. రైతు భరోసా కింద తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామని తెలిపారు. దేశంలోనే అతి ఎక్కువ తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందని అభివృద్ధి చెందిన గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా తెలంగాణ లతో పోటీపడే పరిస్థితి లేదని డిప్యూటీ సీఎం అన్నారు. ఎక్కడ నదులకు ఆనకట్టలు కట్టాలి, ఏ ప్రాంతంలో రోడ్లు వేయాలి ఏ ప్రాంతంలో బుల్లెట్ ట్రైన్లు నడపాలి పరిశ్రమలు, విద్యాసంస్థలు, ఫార్మా, ఐటీ పార్కులు ఎక్కడ నెలకొల్పాలు అనేది విజన్ డాక్యుమెంట్ 2047లో వివరించామని డిప్యూటీ సీఎం తెలిపారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీని సాధించేలా ముందుకు సాగుతున్నామన్నారు. 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ఎలా అందించబోతున్నామో విజన్ డాక్యుమెంట్లో తెలిపామన్నారు. విజన్ డాక్యుమెంట్ విడుదల చేసిన గంటల వ్యవధిలోనే రూ 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని, భవిష్యత్తులో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. మధిర నియోజకవర్గంలో 131 సర్పంచ్ స్థానాలకు గాను 90 స్థానాలకు పైగా కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకొని రికార్డు సృష్టించారని 1983 నుంచి చూస్తే ఈ స్థాయిలో కాంగ్రెస్ అభ్యర్థులు ఎన్నడు కూడా ఇంత పెద్ద మొత్తంలో సర్పంచ్ స్థానాలు గెల్చుకోలేదని, తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు అద్భుత విజయాలు సాధించారని డిప్యూటీ సీఎం తెలిపారు.
ప్రతి సర్పంచ్ కూడా రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం పనిచేస్తే నాయకుడు కాలేడని డిప్యూటీ సీఎం వివరించారు. ఈరోజు నుంచే సర్పంచుల బాధ్యత మొదలైంది కేవలం వ్యవసాయమే కాదు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు విద్యా, వైద్య రంగాలపై సర్పంచులు దృష్టి సారించాలని నిత్యం సమీక్షించాలన్నారు. సర్పంచులు పాఠశాలలను సందర్శించి బోధన ఎలా జరుగుతుంది వసతి సౌకర్యాలు ఎలా ఉన్నాయో సమీక్షించి ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని సూచించారు. విద్య, వైద్యం రంగాలపై సర్పంచులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఈ రెండు అంశాలపై 24 గంటలు తాను అందుబాటులో ఉంటానని, ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తనకు నేరుగా ఫోన్ చేయవచ్చు లేదా తన కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉంటారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన డిప్యూటీ సీఎం
మధిర మున్సిపల్ కార్యాలయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో నూతనంగా ఎన్నికైన సర్పంచుల అభినందన కార్యక్రమం అనంతరం ఆయన నేరుగా మధిర మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. మున్సిపల్ కార్యాలయం, ఆవరణ మొత్తం కలియతిరిగిన ఆయన మున్సిపాలిటీలో ప్రభుత్వ సిబ్బంది, కాంట్రాక్ట్ సిబ్బంది ఎంతమంది ఉన్నారని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా పాలన కింద వచ్చిన దరఖాస్తులు వాటిని పరిష్కరిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన డిజైనును మార్చి విశాలమైన గదులతో నిర్మించేలా ప్లానును మార్చాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు.
నాకు న్యాయం చేయండి డిప్యూటీ సీఎం ను వేడుకున్న మహిళ
ఇటీవల మధిర మున్సిపాలిటీ పరిధిలోని ఇల్లందులపాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భర్త మరణించగా పోలీసులు పట్టించుకోవడంలేదని తనకు న్యాయం జరిగేలా చూడాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను తాడికొండ భార్గవి అనే మహిళ వేడుకున్నారు. నవంబర్ 23వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తన భర్త మరణించగా తన మామ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కేసు విషయమై తాను పోలీస్ స్టేషన్ కు వెళితే పట్టించుకోవడంలేదని, భర్త మరణించడంతో తనకు దిక్కు లేకుండా పోయిందని మీరే న్యాయం చేయాలని ఆమె డిప్యూటీ సీఎంని వేడుకుంది. టౌన్ ఎస్ హెచ్ ఓ సంఘటన గురించి భట్టి కి వివరించడంతో బాధిత మహిళలకు న్యాయం జరిగేలా చూడాలని టౌన్ ఎస్ హెచ్ ఓ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు.



Comments
Post a Comment