అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పల్లివేట ఉత్సవం
( తాళ్లూరి అప్పారావు, మధిర )
మధిర పట్టణంలోని లడక బజార్ అయ్యప్ప నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం అయ్యప్ప స్వామి పల్లివేట ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. గత నెల 26వ తేదీ నుండి ప్రారంభమైన ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన రథం పై ఉంచి అయ్యప్ప స్వాములు భజనలు చేస్తూ ఘనంగా ఊరేగించారు. స్వామివారి ఆలయాన్ని నిర్మించి 18 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా పల్లి వేట కార్యక్రమంలో కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన వాయిద్య బృందాలు, డీజే వాహనం కోలాట బృందాలు, మహిళలు, మాలదారులు స్వామివారి పాటలతో మధిర పురవీధులలో స్వామి వారి పల్లి వేట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి గ్రామోత్సవం సందర్భంగా స్థానిక లడక్ బజార్ దేశభక్తి యువజన సంఘం వారి ఆధ్వర్యంలో స్వామివారి ఆలయం వద్ద నుండి రైల్వే గేట్ వరకు మామిడి తోరణాలు కొబ్బరి ఆకులు, అరటి బోదేలు, కాషాయ తోరణాలతో అందంగా అలంకరించారు. గ్రామోత్సవం అనంతరం తిరిగి స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్న స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఆలయ మండపంలో ఉంచి పల్లికురుప్ప( శయ్య ) కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వారితో పాటు మాలదారులు, భక్తులు ఆలయ మండపంలో నిద్ర చేశారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక నిర్వాహకులు చలువది ధర్మారావు, చలువాది శ్రీనివాసరావు, దేవిశెట్టి రంగారావు, గురుస్వాములు వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, బత్తుల శ్రీనివాసరావు, చెరుపల్లి శ్రీధర్, పాసికంటి గాంధీ, భాస్కర్ స్వామి తో పాటు పెద్ద ఎత్తున అయ్యప్పలు భక్తులు పాల్గొన్నారు.


Comments
Post a Comment