ఈ నెల 28న కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు

S. Syam Kumar

  • పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని గిరిజన గురుకుల పాఠశాలను స్థాపించి 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 28న ఘనంగా స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ1975లో గిరిజన విద్యార్థులకు విద్యనందించాలని, ఆదర్శవంతమైన గురుకుల విద్యా విధానంతో, అటవీ ప్రాంతమైన కిన్నెరసానిలో ఈ విద్యా సంస్థను స్థాపించారని చెప్పారు. అప్పటి నుండి ఈ పాఠశాలలో పేద, బడుగు, గిరిజన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుంచి 40 బ్యాచ్‌ల10వ తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులై సమాజంలో అడుగుపెట్టారని తెలిపారు. ఇక్కడ చదువుకున్న గిరిజన విద్యార్థులతో పాటు ఇతర వర్గాల విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు, డాక్టర్లు, ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, పత్రికా రంగ నిపుణులు, వ్యాపార వేత్తలు, రైతులుగా స్థిర పడ్డారని శ్యామ్ కుమార్ వివరించారు. అంతే కాకుండా, ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగి సమాజ అభివృద్ధికి దోహదపడుతున్నారని చెప్పారు. ఈ చారిత్రాత్మకమైన 50 ఏళ్ల ప్రయాణాన్ని స్మరించుకుంటూ ఈ స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పూర్వ విద్యార్థులు, పూర్వ ఉపాధ్యాయులు గత మూడు నెలలుగా విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అనేక సమావేశాలు నిర్వహించి, ఈ నెల 28న జరిగే స్వర్ణోత్సవాల విజయవంతానికి సమగ్రమైన ప్రణాళికతో  ముందుకు పోతున్నట్లు చెప్పారు. ఈ స్వర్ణోత్సవాలకు అధికారులతో సహా సుమారు 2000 మంది పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆహ్వానితులు పాల్గొనే అవకాశం ఉందని తెలిపారు. స్వర్ణోత్సవాల ప్రధాన వేదికను పూర్వ విద్యార్థి జానకి రామ్ గారు స్పాన్సర్ చేస్తున్నారని, అలాగే ఈ కార్యక్రమానికి అవసరమైన నిధులను పూర్వ విద్యార్థులే సమకూర్చుతున్నారని చెప్పారు. పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు, పని చేసిన ఉపాధ్యాయులు, సిబ్బంది అందరూ ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ప్రిన్సిపాల్ ఎస్. శ్యామ్ కుమార్ ఈ సందర్భంగా కోరారు.


Comments

Popular Posts

రిటైర్డ్ ఉద్యోగుల పెన్షనరీ బెనిఫిట్స్ ని వెంటనే విడుదల చేయాలి

అక్రమ కేసులతో ఉద్యమాలను అడ్డుకో లేరు