దేశానికి ఆదర్శంగా విద్యారంగం అభివృద్ధి

Mallu Bhatti Vikramarka
  • పోటీ పరీక్షల కోసం అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు 
  • వచ్చే విద్యా సంవత్సరం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభం
  • ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అల్పాహారం
  • ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన సోలార్ రూఫ్ టాప్

( తాళ్లూరి అప్పారావు, మధిర )

తెలంగాణ రాష్ట్రం విద్యా రంగంలో దేశానికే ఆదర్శంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ పై ప్రత్యేక దృష్టి సారించారని, వారి అంచనాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించి ముందుకు పోతామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. మంగళవారం మధిర క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఉన్నత స్థాయి అధికార బృందం క్షేత్ర స్థాయిలో పర్యటించి సమీక్ష నిర్వహించడం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంత యువత పోటీ పరీక్షల కోసం నియోజక వర్గ కేంద్రాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోటీ పరీక్షలకు కావలసిన పూర్తి మెటీరియల్ తో పాటు డిజిటల్ లైబ్రరీ ఈ నాలెడ్జ్ సెంటర్లలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో, దేశంలో నిష్ణాతులైన అధ్యాపకులచే ఆన్ లైన్ లో కోచింగ్ ఇప్పిచ్చే ఏర్పాటు చేస్తున్నామని, ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇవి  ప్రారంభించేందుకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని తెలిపారు.

దేశానికి ఆదర్శంగా రాష్ట్ర విద్యా వ్యవస్థలో గేమ్ చేంజర్ గా నిలిచే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నట్టు  ప్రకటించారు. రాష్ట్రంలోని పిల్లలు పౌష్టిక ఆహారం లోపంతో ఇబ్బంది పడవద్దనే సీఎం  ఆలోచన మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం అందించే ఆలోచనలో ఉన్నామని, ఆ మేరకు ఆర్థిక శాఖ ప్రణాళికలు రూపొందిస్తుందని తెలిపారు. మారిన పరిస్థితిలకు అనుగుణంగా ఐటిఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అప్గ్రేడ్ చేస్తున్నామని, ఉపాధి కల్పన ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని చెప్పారు. పాలిటెక్నిక్ కళాశాలలకు అవసరమైన అన్ని వసతులు కల్పించి ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేట్ చేస్తున్నట్టు తెలిపారు.  ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ప్రతి మండలంలో మూడు ప్రభుత్వ పాఠశాలలను గుర్తించి అక్కడ అన్ని రకాల సౌకర్యాలు దశల వారీగా ఏర్పాటు చేయాలని నిర్ణయించి ముందుకు పోతున్నట్టు తెలిపారు. 

ప్రతి 10 గ్రామాలకు ఒక పాఠశాలను ఎంపిక చేస్తున్నామని వివరించారు. ఈ పాఠశాలల్లో తరగతి గదులు, మౌలిక వసతులు, టీచింగ్ నాన్ టీచింగ్ స్టాప్ కొరత లేకుండా దశలవారీగా పాఠశాలలను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. సీఎం ఆకాంక్షలకు అనుగుణంగా విద్యాశాఖ పై దృష్టి సారించి టాప్ ప్రయారిటీ కింద కావలసిన నిధులు మంజూరు చేస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ఇంటర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం సిఎస్ఆర్ నిధుల ద్వారా స్థానికంగా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటిపైన సోలార్ పవర్ ఉత్పత్తి కోసం సోలార్ రూఫ్ టాప్ లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్టు డిప్యూటీ సీఎం తెలిపారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారానా, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నికోలస్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సెక్రటరీ ఆదిత్య భాస్కర్, ఈ డబ్ల్యూ ఎస్ ఐ డి ఎండి గణపతి రెడ్డి, ఎన్ పీడీసీఎల్ సిఎండి వరుణ్ రెడ్డి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తదితరులు పాల్గొన్నారు.

Mallu Bhatti Vikramarka

3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగేందుకు ప్రణాళికలు

తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యసాధనకు అన్ని రంగాల అభివృద్ధికి విద్యుత్ శాఖ కీలకమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. ప్రెస్ మీటుకు ముందు భట్టి మధిర పట్టణంలో పర్యటించి 27.76 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యం నెర వేరాలంటే విద్యుత్ శాఖ చాలా కీలకమని అన్ని రంగాల అభివృద్ధికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవసరమన్నారు. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రం ఎదగాలని పాలసీలను రూపొందించుకొని ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా పని చేస్తుందని తెలిపారు. భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చిన సమయంలో కూడా పట్టణ ప్రజలకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా అందించాలనే లక్ష్యంతో భూగర్భ విద్యుత్ కేబుల్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టామన్నారు. మధిర పట్టణ పరిధిలో ముందస్తుగా రూ 27.76 కోట్ల వ్యయంతో 3.5 కిమీ 33 కేవి లైన్, 17.3 కిలో మీటర్ల 11కేవి లైన్, 15 కిలోమీటర్ల ఎల్.టీ. లైన్ భూగర్భంలో వేయడం జరుగుతుందన్నారు. మధిర సబ్ స్టేషన్ నుంచి ఆత్కూరు రింగ్ రోడ్డు, విజయవాడ రోడ్డు లోని హెచ్.పి. గ్యాస్ గోడౌన్ (రెండు వైపులా), వైయస్సార్ విగ్రహం నుండి అంబర్ పేట చెరువు వరకు ప్రస్తుత 11 కేవి ఓవర్ హెడ్ లైన్లను భూగర్భంలో మార్చుటకు ప్రతిపాదించామని, నందిగామ బైపాస్ రోడ్డు హెచ్.పి. పెట్రోల్ బంకు నుండి డంప్ యార్డ్ వరకు  భూ గర్భ విద్యుత్తు లైన్ పనులు ప్రతిపాదించామని అన్నారు.

భూగర్భ విద్యుత్ లైన్లు వేయడం వల్ల మధిర పట్టణంలో కాలుష్యం, విద్యుత్ ప్రమాదాలు తగ్గుతాయని, రోడ్ల పక్కన మంచి చెట్లు పెంచవచ్చన్నారు.   విద్యుత్ అంబులెన్స్ లను  ట్రాన్స్ ఫార్మర్ తో సహా అవసరమైన సామాగ్రి, టెక్నిషియన్స్ తో ఏర్పాటు చేశామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక విద్యుత్ అంబులెన్స్ అందుబాటులో ఉండాలని అన్నారు. ఇందిరా గిరి జల వికాసం క్రింద సోలార్ పంప్ సెట్ల ద్వారా సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గ్రీన్ ఎనర్జీ పెంపు లక్ష్యంగా ప్రత్యేక పాలసీ తీసుకొని వచ్చామని, మహిళా సంఘాలతో రూరల్ ప్రాంతాల్లో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఎన్పిడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాష్ట్ర హస్తకళల సంస్థ అభివృద్ధి చైర్మన్ నాయుడు సత్యనారాయణ, ఎన్పిడిసిఎల్ ఎస్ఇ శ్రీనివాసాచారి, ఆర్ అండ్ బి ఇఇ తానేశ్వర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే