జూన్ లోగా మున్నేరు రిటైనింగ్ వాల్ పూర్తి చేయాలి ... మంత్రి తుమ్మల
అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) అధికార్లను ఆదేశించారు. సోమవారం ఆయన ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలసి మున్నేరు రిటైనింగ్ వాల్, కేబుల్ బ్రిడ్జి, ఖిల్లా రోప్ వే పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూమున్నేరు వరదల నుండి నగరవాసులకు ఇబ్బందులు కలగకుండా మున్నేరు ( Munneru ) కు ఇరు వైపులా రూ. 690 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టామన్నారు. 17 కిలో మీటర్ల రిటైనింగ్ వాల్ నిర్మాణానికి గాను ఇప్పటి వరకు 6.4 కిలో మీటర్ల పనులు పూర్తయినట్లు తెలిపారు. మిగులు భూ సేకరణ ప్రక్రియను కూడా వెంటనే పూర్తి చేయాలన్నారు. నదికి ఇరు వైపులా పనులు సమాంతరంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. గత వరదల్లో జరిగిన నష్టం మళ్ళీ జరగొద్దని, వచ్చే జూన్ లోపే నిర్మాణం పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
53 శాతం పూర్తైన కేబుల్ బ్రిడ్జి
అలాగే కేబుల్ బ్రిడ్జి ( Cable Bridge ) నిర్మాణ పనులు నిర్ణీత సమయంలో పూర్తి అయ్యేలా చర్యలు
చేపట్టాలన్నారు. రూ. 180 కోట్లతో చేపడుతున్న పనులు ఇప్పటి వరకు 53 శాతం
పూర్తయినట్లు చెప్పారు. అగ్రిమెంట్ ప్రకారం మార్చి లోపల పూర్తి అవ్వాల్సి వుండగా, వర్షాల వల్ల వచ్చే మే
నెలాఖరుకు పూర్తి అవుతాయని తెలిపారు.
రూ. 29 కోట్లతో ఖిల్లా రోప్ వే
పర్యాటకుల సౌకర్యార్థం ఖమ్మం ఖిలా ( Khammam Khilla )పై నిర్మిస్తున్న రోప్ వే కు భూ సేకరణ
పూర్తయినట్లు పేర్కొన్నారు. రూ. 29 కోట్లతో చేపడుతున్న రోప్ వే సివిల్ పనులు
నెలాఖరుకు ప్రారంభించి, వచ్చే జూలై నాటికి అగ్రిమెంట్ ప్రకారం మొత్తం పూర్తి
చేయాలన్నారు. ఖిలా కు రోడ్ కనెక్టివిటీ విస్తరణకు చర్యలు చేపట్టాలన్నారు.

Comments
Post a Comment