శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగు లేదు ... సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ

CPM General Secretary MA Baby
  • అణచివేతకు వ్యతిరేక పోరాటానికి మతం రంగు
  • ముస్లిం వ్యతిరేక పోరాటంగా ఆర్ఎస్ఎస్, బీజేపీ చిత్రీకరణ
  • సాయుధ పోరాట స్ఫూర్తితోనే భూసంస్కరణల అమలు
  • ఏచూరి స్ఫూర్తితో శాస్త్రీయ సామ్యవాదం కోసం పురోగమిద్దాం

శాస్త్రీయ సామ్యవాదానికి తిరుగు లేదని సీపీఐ (ఎం) అఖిల భారత ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్నారు. మోడీ, షా, ఆర్ఎస్ఎస్ త్రిశూలంలా వ్యవహరిస్తూ మెజార్టీ ప్రజానీకాన్ని మత ప్రాతిపదికన విభజించాలని చూస్తున్నాయని విమర్శించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని సైతం వక్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో బుధవారం రాత్రి నిర్వహించిన ' తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల ముగింపు సభ'లో బేబీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సీపీఐ (ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వర రావు అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఆయన ముందుగా సీతారాం ఏచూరి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరులకు జోహార్లు అర్పిస్తూ ఎంఏ బేబీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దున్నే వానికి భూమి, భూసంస్కరణల అమలు సాయుధ పోరాట ఫలితమని చెప్పారు. భూమిని తీవ్రమైన సమస్యగా చూపింది ఈ పోరాటమేనని అన్నారు. సాయుధ పోరాట ఫలితంగానే కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల్లో తొలుత భూ సంస్కరణలు అమలయ్యాయని, ఆ తర్వాతే దేశ వ్యాప్తంగా విస్తరించారని తెలిపారు. ఆర్ఎస్ఎస్ ఎక్కడా స్వాతంత్ర్యం కోసం, నైజాం ప్రభువుకు వ్యతిరేకంగా పోరాడ లేదన్నారు. మోడీ, షాకు మాత్రమే రక్షణ మంత్రిగా వ్యవహరిస్తున్న రాజ్ నాథ్ సింగ్ వీర తెలంగాణ పోరాటానికి మతం రంగు పులుముతున్నారని ఆరోపించారు. ఎర్ర జెండా ఉద్యమం, శ్రమ జీవుల పోరాట ఫలితంగా తెలంగాణలోని నాటి ఫ్యూడల్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. ఎంతో గొప్ప చరిత్ర ఉన్న సాయుధ రైతాంగ పోరాటాన్ని వక్రీకరించటం ఎవరి తరం కాదన్నారు. నెహ్రూ ఏ మతాచారం ప్రకారం తనని ఖననం చేయొద్దని చెప్పారన్నారు. నారాయణ గురు కులం, మతం లేదంటే మహాత్మా గాంధీ వర్క్ ఈజ్ వర్షిప్ ( పని దైవంతో సమానం) అన్న విషయాన్ని బేబీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని మతాల ప్రజలు సహ జీవనం చేస్తున్న దేశంలో ఆర్ఎస్ఎస్ విద్వేషాలను రెచ్చగొట్టి ప్రయోజనం పొందాలని చూస్తుందన్నారు.  గోల్వాల్కర్ 'బంచ్ ఆఫ్ థాట్స్' పుస్తకంలో ముస్లిం, క్రిస్టియన్, కమ్యూనిస్టులను శత్రువులుగా పేర్కొన్న విషయాన్ని ప్రస్తావించారు. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో, పార్టీ 24వ జాతీయ మహాసభల్లో తీసుకున్న నిర్ణయం మేరకు విశాల ప్రాతి పదికన ఎర్రజెండా ఉనికిని విస్తరింప చేయాలని పిలుపునిచ్చారు. 

Thammineni Veerabhadram

సాయుధ పోరాట వక్రీకరణ సాధ్యం కాదు: తమ్మినేని

బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎంత ప్రయత్నించినా తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరించడం సాధ్యం కాదని సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం అన్నారు. సెప్టెంబర్ 17వ తేదీని ఆయా పార్టీలు విద్రోహ దినం, విలీన దినం, విమోచన దినంగా పేర్కొంటున్నాయని అన్నారు. ఎవరెలా చెప్పినా సాయుధ పోరాటం ఎర్ర జెండా పోరాటం తప్ప మరి ఏదీ కాదన్నారు. నెహ్రూ సైన్యం కమ్యూనిస్టులను బలిగొనేందుకు వచ్చింది తప్ప నిజామును లొంగ తీసుకునేందుకు కాదన్నారు. ఒకవేళ లొంగదీసుకునేందుకు వస్తే రాజ్ ప్రముఖ్  హోదా ఇచ్చేది కాదన్నారు. రూ. లక్షల విలువైన భరణాలు ప్రసాదించేది కాదని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల పోరాట ఫలితంగా 3,000 గ్రామాలకు విముక్తి లభించిందని తెలిపారు. నెహ్రూ సైన్యాలు 4000 మంది కమ్యూనిస్టులను పొట్టన పెట్టుకున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తున్న తీరును 'ఏనుగు - గుడ్డివాళ్ల' కథ ద్వారా వివరించారు.  తెలంగాణలో ఎర్రజెండా ఎగురుతుంది అనే ఉద్దేశంతోనే నెహ్రూ సైన్యాలను పంపించినట్లు తెలిపారు. అంతకు ముందు సీతారాం ఏచూరిపై  నవతెలంగాణ, ప్రజాశక్తి ప్రచురించిన ' ఓ సోషలిస్ట్ ఆచరణ పథం' పుస్తకాన్ని బేబీ ఆవిష్కరించారు. పార్టీ రాజకీయ విద్యా విభాగం సభ్యులు 'తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం' జ్ఞాపికను బేబీకి అందజేశారు. ఈ సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్, రాష్ట్ర కమిటీ సభ్యులు మాచర్ల భారతి, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, బుగ్గ వీటి సరళ, కళ్యాణం వెంకటేశ్వర రావు, బండి రమేష్, వై. విక్తమ్, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వర రావు, ఎం. సుబ్బారావు, చింతలచెరువు కోటేశ్వర రావు, పి. సోమయ్య, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పార్డీ నాయకులు మాదినేని రమేష్, బండి పద్మ, అన్నవరపు సత్యనారాయణ, లిక్కి బాలరాజు, మడుపల్లి గోపాల రావు, శీలం సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సభ ప్రారంభానికి ముందు సదానందం నేతృత్వంలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన 'సాయుధ రైతాంగ పోరాట గీతాలు' ఆకట్టుకున్నాయి.

CPM

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే