చినుకు పడితే చిత్తడే
- మధిర లడక్ బజార్ అయ్యప్ప నగర్లో రోడ్ల దుస్థితి
- అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తవ్వకాలతో గుంతల మయమైన రోడ్లు
( తాళ్లూరి అప్పారావు - మధిర )
మధిర ( Madhira ) పట్టణంలోని లడక బజారు అయ్యప్ప నగర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైపులు
వేసేందుకు రోడ్లను తవ్వి అలాగే వదిలి వేయడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వర్షాలకు రోడ్లపై గుంతలు బురద మయంగా మారడంతో నడిచి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ( Mallu Bhatti Vikramarka ) మధిర అభివృద్ధిలో భాగంగా రూ. 128
కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మంజూరు చేశారు. ఆ పనులను చేపట్టిన సబ్
కాంట్రాక్టర్ రోడ్లను తవ్వి, అర కొరగా పనులు చేసి వదిలేశారు. ఆ తర్వాత పనులు చేపట్టిన
మరో సబ్ కాంట్రాక్టర్ కూడా అసంపూర్తిగా పనులు చేసి రోడ్లకు మరమ్మతులు చేయ లేదు. దీంతో
వర్షం పడితే ఆ రోడ్లన్నీ బురద మయంగా మారి నడిచేందుకు కూడా వీలు లేకుండా పోయింది. రోడ్లు
మాగాణి భూముల్లా మారడంతో ఆ ప్రాంత విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళడం కూడా కష్టమవుతోంది.
అంతే కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పైపులు వేసేందుకు రోడ్లు తవ్విన సమయంలో
త్రాగు నీటి పైపులు పగిలి పోయాయి. వాటికి మరమ్మతులు చేసేందుకు తీసిన గుంటను కూడా పూడ్చక
పోవడంతో ప్రజలు దారి లేక ఖాళీ ప్లాట్లో నుంచే నడక సాగిస్తున్నారు. ఇక కార్తీక మాసం
సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అన్నదానం ప్రారంభం కానుంది. సాయి బాబా గుడి వైపు నుండి వెళ్లే మాలదారులు కూడా ఈ రోడ్ల
గుండానే వెళతారు. ఈ రోడ్డు గుండా ప్రతి రోజు వ్యవసాయం కూలీలు, రైతులు, శ్రీ స్వామి అయ్యప్ప
దేవాలయానికి వెళ్ళు భక్తులు , మహిళలు, పిల్లలు రాక పోకలు
సాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ రోడ్డులో ద్విచక్ర వాహనాలే కాదు, కాలి నడకన కూడా వెళ్లే
పరిస్థితి లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దీనిపై దృష్టి సారించి పైపు లైనుకు
తీసిన గుంటను పూడ్చడంతో పాటు రోడ్డుకు మరమ్మత్తులు చేయించి, ఇబ్బందులు తొలగించాలని
ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.


Comments
Post a Comment