యూరియా కొరత లేదు ... ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు : ఖమ్మం కలెక్టర్ అనుదీప్

Khammam Collector Anudeep Durishetty

ఖమ్మం జిల్లాలో సమృద్ధిగా యూరియా అందుబాటులో ఉందని, ఎక్కడా రైతులు ధర్నా చేయాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. యూరియా అందుబాటులో ఉన్నా, కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేసి రైతులతో ధర్నా చేయించాలని చూస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో అవసరం ఉన్న చోట స్టాక్ కేటాయించి సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సోమవారం ఆయన ఖమ్మం కలెక్టరేట్లోనీ తన ఛాంబర్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలో యూరియా లభ్యత, సరఫరాపై సంబంధిత జిల్లా, మండల వ్యవసాయ అధికారులు, ఏఈఓలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, మార్క్ ఫెడ్ అధికారులు, పోలీస్ అధికార్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ గత ఏడాది కంటే, ఈ ఏడాది ఇప్పటి వరకు 3,250 మెట్రిక్ టన్నుల యూరియా ఆధనంగా రైతులకు సరఫరా చేసామని తెలిపారు. ప్రస్తుతం 2,700 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందని చెప్పారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని, రైతులు అనవసరంగా గందరగోళానికి గురి కావద్దన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు తన పరిధిలోని రైతులు ఒకే సారి రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులు చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితి  వస్తే, సంబంధిత సొసైటీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి రైతుల అవసరం మేరకు మాత్రమే యూరియాను అమ్మేలా చూడాలన్నారు. కల్లూరు, తల్లాడ ప్రాంతంలో మరింత మానిటరింగ్ అవసరమని చెప్పారు. ఏఈఓలతో సమన్వయం చేసుకుంటూ లైన్లు లేకుండా సజావుగా యూరియా అమ్మాలన్నారు. యూరియాను డైవర్ట్ చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. యూరియాను అధికంగా, తరచుగా కొంటున్న వారిని గుర్తించాలని, సన్న, చిన్న కారు రైతులకు యూరియా బ్యాగుల సరఫరాకు ప్రాధాన్యత నివ్వాలన్నారు. ప్రతి రోజు యూరియా స్టాక్ వివరాలు అందరికి తెలియ జేయాలని, జిల్లాలో ఎక్కడైనా ఒక  చోట అధిక సంఖ్యలో రైతులు యూరియా కోసం వస్తే, ఇతర ప్రాంతాల నుంచి స్టాక్ తీసుకుని వచ్చి పంపిణీ చేయాలన్నారు. రైతులు నిర్దేశించిన టైంలో వచ్చి10 నుంచి 15 నిమిషాలలో యూరియా తీసుకొని వెళ్లేలా చూడాలన్నారు. రైతులు ప్రస్తుత అవసరాలకు మాత్రమే యూరియా కొనుగోలు చేయాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఎకరం భూమికి బస్తా యూరియా వేయాల్సి వస్తే, ఒకేసారి వేయకుండా 15 రోజుల్లో 2 దఫాలుగా యూరియా చల్లడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయన్నారు. దీనిపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సంబంధిత అధికార్లను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి పుల్లయ్య, జిల్లా సహకార అధికారి గంగాధర్ తదితరులు పాల్గోన్నారు. 

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే