రాజీవ్ స్వగృహ ప్లాట్లు ప్రభుత్వ ఉద్యోగులకే .. రూ. 2 లక్షలు చెల్లిస్తే పేరు రిజిస్టర్... ప్లాట్ ధర రూ. 28 లక్షలే
ఖమ్మం మున్నేరు ఒడ్డున వున్న రాజీవ్ స్వగృహలో ( జలజ టౌన్ షిప్ ) ఫ్లాట్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి గల ప్రభుత్వ ఉద్యోగులు ఈ నెల 30 లోపు 2 లక్షల రూపాయలు చెల్లించి పేరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. సోమవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, రాజీవ్ స్వగృహ సీఈ భాస్కర్ రెడ్డిలతో కలిసి కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాజీవ్ స్వగృహపై సంబంధిత అధికార్లతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును 9 ఎకరాల 22 గుంటలలో నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాజెక్టులోని 8 టవర్లలో అసంపూర్తిగా ఉన్న 576 ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించాలని నిర్ణయించినట్లు చెప్పారు. వీటి ధర గజం 1150 రూపాయల చొప్పున నిర్ణయించామన్నారు. ఇక్కడ ఉన్న 8 టవర్లు ఉద్యోగులకు లాటరీ పద్ధతిన కేటాయిస్తామన్నారు. సొంత ఇళ్ళు కావాలని ఆసక్తి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఈ లాటరీలో పాల్గొని తమ కలను నెరవేర్చుకోవాలని సూచించారు. రివర్ వ్యూతో టవర్స్ బాగా ఉన్నాయని, త్వరగా అభివృద్ధి జరిగే ప్రాంతంలో ఈ టవర్లు ఉన్నాయని తెలిపారు. ఖమ్మం దేవరపల్లి జాతీయ రహదారి వల్ల రోడ్డు కనెక్టివిటీ పెరుగుతుందని, మున్నేరు నదిపై రిటైనింగ్ వాల్ నిర్మాణంతో వరద ముంపు ఇకపై ఉండదని అన్నారు. టౌన్ షిప్ కు 60 అడుగుల రోడ్డుతో పాటు, జలజ టౌన్ షిప్ కు అన్ని రకాల అనుమతులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఫ్లాట్ పొందవచ్చని పేర్కొన్నారు.



Comments
Post a Comment