రాజీవ్ స్వగృహ విక్రయానికి ప్రభుత్వం నిర్ణయం ... సెప్టెంబర్ 8న లాటరీ పద్దతిలో కేటాయింపు

Rajeev Swagruha, Khammam

ఖమ్మం మున్నేరు ఒడ్డున ఏదులా పురం మున్సిపాలిటీ పరిధిలో అసంపూర్తిగా ఉన్న రాజీవ్ స్వగృహ ప్రాజెక్టును( జలజ టౌన్ షిప్ ) ఉన్నది ఉన్నట్లుగా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ సంస్థల్లో పని చేసే ఉద్యోగుల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. అయితే, ఇప్పుడు నిర్మాణానికైన ఖర్చుతోనే బహుళ అంతస్తుల సముదాయంతో ఉన్న ఈ ప్రాజెక్టు మొత్తాన్ని లాటరీ ద్వారా విక్రయించనున్నారు. జూలై 22న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేశారు. సెప్టెంబరు 8న లాటరీ పద్దతిలో ఈ ప్రాజెక్టును కేటాయిస్తారు. వివిధ సహకార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, బిల్డర్లు, డెవలపర్లు, జాయింట్ వెంచర్లు ... ఇలా గ్రూప్ హౌసింగ్ పథకాలపై ఆసక్తి ఉన్న వారు ఎవరైనా ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Rajeev Swagruha, Khammam

9.22 ఎకరాల్లో నిర్మాణం ... చదరపు అడుగు రూ. 1150

సుమారు 9.22 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఎనిమిది బ్లాకులు, తొమ్మిది ఫ్లోర్లు ఉన్నాయి. ఒక్కో ఫ్లోర్లో 8 ఫ్లాట్లతో ప్రాజెక్టు మొత్తం మీద 576 ఫ్లాట్లు ఉన్నాయి. వీటి నిర్మాణ పనులు వివిధ దశల్లో అసంపూర్తిగా మిగిలి పోయాయి. ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా 60 అడుగుల అప్రోచ్ రోడ్డు మంజూరై పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణానికైన ఖర్చును మాత్రమే పరిగణనలోనికి తీసుకొని చదరపు అడుగు ధర రూ.1150 గా నిర్ణయించామని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరక్టర్ వి.పి. గౌతం తెలిపారు. ఖమ్మం నగరానికి పశ్చిమ వైపు ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, అంతే కాకుండా కొత్తగా ఏదులాపురం మున్సిపాలిటీగా మారడంతో అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. ఈ నేపధ్యంలో ఖమ్మంలోని వివిధ ఉద్యోగ సంఘాలు, సహకార సంఘాలు, ఇతరత్రా స్వచ్ఛంధ సంస్థలు ప్రభుత్వం నామ మాత్రపు ధరతోనే అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ టౌన్ షిప్లో మౌళిక వసతుల కల్పన కూడా జరుగుతుందని స్పష్టం చేశారు. ఇక్కడి భూములు, నిర్మించిన భవనాలపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అన్నారు. ఈ ప్రాజెక్టుల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తి పారదర్శకంగా లాటరీ ద్వారా కేటాయిస్తామని వి.పి. గౌతం ఈ సందర్భంగా తెలిపారు. 

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే