సీసీ కెమెరాలతో ఆకేరు, మున్నేరు వరద ఉధృతిపై నిఘా
గత ఏడాది ఆకస్మికంగా వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకొని ఈ సారి ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు అధికార్లు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆకేరు వాగుపై తిరుమలాయ పాలెం మండలంలోని తిప్పారెడ్డి గూడెం, మున్నేరుపై డోర్నకల్, ఖమ్మంలోని కాల్వ ఒడ్డు వద్ద సోలార్ డే అండ్ నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటిని కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్, కలెక్టర్ ఛాంబర్ కు అనుసంధానం చేసి, 24 గంటల పాటు నీటి ప్రవాహ ఉధృతిని అంచనా వేస్తున్నారు. ప్రమాదకర పరిస్థితులను ముందుగా అంచనా వేసి, అవసరమైతే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ప్రణాళికను సిద్దం చేశారు. అందులో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తన ఛాంబర్ నుండి కెమెరాలతో వరద ఉధృతిని అంచనా వేశారు. అధికారులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇప్పటికే మున్నేరు, ఆకేరు నదుల పరివాహక ప్రాంతాల అధికారుల నుండి వర్షం, వరద పరిస్థితిపై సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో అధికారులు, లష్కర్ తదితర సిబ్బంది క్షేత్ర స్థాయిలో ఉంటూ, ప్రమాద పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదన్నారు.


Comments
Post a Comment