ఈ నెల14 నుండి రేషన్ కార్డుల జారీ ... మంత్రి పొంగులేటి
ఈ14 నుండి నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస
రెడ్డి చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.29 లక్షల కుటుంబాలకు ఈ తెల్ల రేషన్
కార్డులు జారీ చేస్తామన్నారు. ఆదివారం ఆయన జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో
కలిసి నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
చేసారు. సుర్దేపల్లి నుండి బోదుల బండ వరకు రూ. 2 .50 కోట్ల అంచనా వ్యయంతో
నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు, కోనాయి గూడెం ఎస్సీ కాలనీలో
రూ. 21 లక్షలతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, మంగాపురం తండా నుండి బాణాపురం
రోడ్డు వరకు రూ. 4.50 కోట్లతో నిర్మించనున్న బి.టి. రోడ్డు నిర్మాణ పనులకు
శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని
సమాంతరంగా కొనసాగిస్తుందన్నారు. గత పాలకులు అమలు చేసిన మంచి పథకాలను కొనసాగిస్తూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన
హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. పేద ప్రజలకు 200 యూనిట్లు ఉచిత
విద్యుత్, 500
రూపాయలకే గ్యాస్ సిలిండర్, రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా, ఆరోగ్య శ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు, మహిళలకు ఆర్టీసీ బస్సులో
ఉచిత ప్రయాణం వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. రూ.
22, 500 కోట్లతో ప్రభుత్వం
పేదల సొంతింటి కల కోసం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను మొదటి విడతలో మంజూరు చేసిందన్నారు.
ఇలా ప్రతి సంవత్సరం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు
క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ అందించిందని పేర్కొన్నారు. రైతు భరోసా పథకం క్రింద
పెట్టుబడి సహాయం ఎకరానికి 10 వేల నుంచి 12 వేల రూపాయలకు పెంచి, 9 రోజులలో 9 వేల
కోట్లను జమ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల
నాగేశ్వరరావు, నేలకొండపల్లి
మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల సీతారాములు, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, పాలేరు నియోజకవర్గ
ప్రత్యేక అధికారి రమేష్, నేలకొండపల్లి మండల తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపిడివో ఎర్రయ్య, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు
పాల్గొన్నారు.
పంట పొలాలు పరిశీలించిన పొంగులేటి
అనంతరం మంత్రి పొంగులేటి మండలంలోని పంట పొలాలను సందర్శించారు. పెసర పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. పంటల పెంపకం, సాగు పద్దతులు, సాగు నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరి నాటు వేస్తున్న కూలీలను కలసి, వారు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యలు, వేతనాలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశ్నలు సంధించారు.



Comments
Post a Comment