రాములోరి భూముల వ్యవహారంలో ఘర్షణ ? ... స్పృహ కోల్పోయిన భద్రాచలం ఈఓ రమాదేవి
- వివాదాస్పద భూమిలో ఇంటి నిర్మాణాలు ?
- అడ్డుకున్న భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై దాడి ?
- స్పృహ తప్పి పోవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
- రమాదేవిని పరామర్శించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
- ఆంధ్ర ప్రదేశ్లోని పురుషోత్తం పట్నంలో ఘటన
- గ్రామంలో సుమారు 889.5 ఎకరాల ఆలయ భూమి
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయ భూముల్లోని అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవిపై కొందరు గ్రామస్థులు దాడికి దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమె స్పృహ తప్పి పడి పోవడంతో ఆలయ సిబ్బంది హుటాహుటిన భద్రాచలంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. భద్రాచలం పట్టణానికి అనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వున్న పురుషోత్తపట్నం గ్రామంలో భద్రాద్రి రామాలయానికి చెందిన సుమారు 889.5 ఎకరాల భూమి ఉంది. ఈ భూములను దేవస్థానానికి అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, కొందరు వ్యక్తులు ఆ భూముల్లో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని సమాచారం అందుకున్న ఆలయ ఈవో రమాదేవి, సిబ్బందితో కలిసి మంగళవారం ఆ ప్రాంతానికి వెళ్ళి నిర్మాణాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే నిర్మాణదారులకు, ఆలయ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. కొద్ది సేపటికి ఈ వాగ్వాదం కాస్త తీవ్రమై తోపులాటకు దారి తీసుంది. ఈ తోపులాటలో ఆక్రమణ దారులు ఈవో రమాదేవిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనను భద్రాచలం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు తీవ్రంగా ఖండించారు. కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఈవో రమాదేవిని పరామర్శించి ధైర్యం చెప్పారు. జరిగిన ఘటనపై ఆరా తేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికార్లను కోరారు.
నిన్న కూడా ఇదే తంతు ...
నిన్న కూడా ( సోమవారం) పురుషోత్తపట్నంలో ఉన్న దేవస్థానం భూముల్లో గ్రామస్తులు నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు అడ్డుకునేందుకు అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో స్థానికులు కొందరు అధికార్లపై తిరగ బడ్డారు. మా భూములు, మా రాష్ట్రంలోకి మీరు రావొద్దు, ఏదైనా ఉంటే కోర్టులోనే తేల్చుకోవాలని గొడవకు దిగడంతో అధికారులు స్థానిక యటపాక పోలీసులు, రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి గ్రామస్తులను సముదాయించినా వినక పోగా, దేవస్థానం అధికారులను ఇక్కడ నుండి వెళ్లి పోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో చేసేది లేక ఆలయ అధికార్లు అక్కడ నుండి వెనుదిరిగారు. తెలంగాణలో భాగంగా వున్న పురుషోత్తం పట్నం 7 మండలాలతో పాటు ఆంధ్రలో కలిసింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత, కేంద్రం ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణకు చెందిన ఈ మండలాలను ఆంధ్రాలో కలిపింది. ఇప్పుడు ఈ మండలాల్లోని భద్రాచలానికి అనుకొని వున్న 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. తెలంగాణ కోరుతున్న 5 గ్రామాల్లో పురుషోత్తం పట్నం కూడా వుంది. ఈ గ్రామాలు ఆంధ్రలో వుండడం వల్ల, గోదావరికి వరద వచ్చినప్పుడు భద్రాచలం పట్టణాన్ని ముంపు నుండి రక్షించడం కష్టమవుతోంది. వరదను నివారించాలంటే, కరకట్టను ఆంధ్రలో వున్న ఈ గ్రామాలకు కూడా విస్తరించాల్సిన అవసరం వుంది. అంతే కాకుండా భద్రాద్రి రామునికి సంబంధించిన 1399 ఎకరాల భూమీ ఈ గ్రామాల్లో వుంది. ఒక్క పురుషోత్తం పట్నంలోనే 889.5 ఎకరాల భూమి వుంది. ఈ భూములు ఇప్పుడు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్ళి పోతున్నాయి. అక్కడ ఏ కార్యక్రమం చేపట్టాలన్నా, ఆంధ్రలో వుండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే, ఆంధ్రలో విలీనం చేసిన ఈ 5 గ్రామాలనైనా తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రేవంత్ సర్కార్ కోరుతోంది.


Comments
Post a Comment