తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలుపై ఉత్కంఠ... స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలయ్యేనా ?

BC Reservation

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలకు సంబంధించిన అంశం తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఇంకా కార్యరూపం దాల్చక పోవడంతో, సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాలుగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం రెండు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. మొదటిది, ఇటీవల 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఒక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అయితే, ఈ ఆర్డినెన్స్‌కు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఇంకా ఆమోదం తెలప లేదు. ఆయన దాన్ని న్యాయ సలహా నిమిత్తం కేంద్ర హోంశాఖకు పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్డినెన్స్‌ను ఆమోదం కోసం గవర్నర్‌కు పంపించగా, తాజాగా ఆయన దాన్నికేంద్ర హోంశాఖకు పంపించారు. దీంతో బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. మరో వైపు, ఆర్డినెన్స్‌కు ముందే తెలంగాణ ప్రభుత్వం ఇదే 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపింది. ఈ బిల్లుకు కూడా ఇప్పటి వరకు ఆమోదం లభించ లేదు.

కేంద్రంపై ఒత్తిడికి ఢిల్లీకి సీఎం బృందం 

ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లింది. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, పార్టీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేను కలిసి రిజర్వేషన్ల అంశంపై చర్చించింది. కేవలం ఈ భేటీలకే పరిమితం కాకుండా, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లుపై అధికార పక్షం (బీజేపీ)పై ఒత్తిడి తెచ్చేందుకు అన్ని రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ఎంపీలను రేవంత్ రెడ్డి బృందం సమాయత్తం చేస్తోంది. లోక్‌ సభ, రాజ్య సభల్లో ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్రం ఆమోదాన్ని త్వరితగతిన పొందాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. అంతే కాకుండా, కేంద్రం చేపట్ట బోయే జాతీయ జన గణనలో కుల గణన కూడా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. 

ముంచుకొస్తున్న హై కోర్టు గడువు 

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే ఆలస్యమయ్యాయి. ఈ నేపథ్యంలో, సెప్టెంబర్ 30 లోగా ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రతి పక్షాలు గట్టిగా పట్టుబడుతున్నాయి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద తల నొప్పిగా మారింది. రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు వెళ్తే ప్రతి పక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో, బీసీల నుండి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఈ వ్యవహారం ముందు ముందు రేవంత్ రెడ్డి సర్కారుకు మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉంది. కేంద్రం, గవర్నర్, హైకోర్టు, ప్రతి పక్షాల వైఖరులన్నీ తెలంగాణ ప్రభుత్వానికి సవాళ్లను విసురుతున్నాయి. సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతుండటంతో, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలవుతాయా లేదా అనేది ప్రస్తుతానికి చెప్ప లేము. ఢిల్లీ పర్యటన ఫలితం, గవర్నర్ నిర్ణయం, పార్లమెంట్‌లో చర్చలు, కేంద్రం నుంచి వచ్చే స్పందన వంటి అంశాలపైనే ఇది ఆధారపడి ఉంటుంది. మొత్తానికి, తెలంగాణ బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో కీలకం కానుంది.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు