సుప్రీం కోర్టు కీలక తీర్పు ... ఇక ఏపీ, తెలంగాణలో డీలిమిటేషన్ అప్పుడే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
రాష్ట్రాల్లో నియోజక వర్గాల పునర్విభజన కోరుతూ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు
చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈరోజు కొట్టి వేసింది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కోటేశ్వర్
సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించి, కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫెసర్
పురుషోత్తం రెడ్డి 2022లో దాఖలు చేసిన తన పిటిషన్లో, ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ
చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం నియోజక వర్గాల పెంపుకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
జమ్మూ కశ్మీర్‌లో పునర్విభజన జరిగినప్పుడు, ఏపీ విభజన చట్టాన్ని పక్కన
పెట్టేశారని, ఇది
రాజ్యాంగ విరుద్ధమని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
సుప్రీంకోర్టు తీర్పు, వ్యాఖ్యలు
సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించిన అనంతరం, రాజ్యాంగంలోని అధికరణ
170 (3) ప్రకారం ఏపీ విభజన చట్టంలోని సెక్షన్ 26 కి పరిమితి ఉందని స్పష్టం
చేసింది. 2026 తర్వాత జనాభా లెక్కలు పూర్తయిన తర్వాతే డీలిమిటేషన్ (నియోజక వర్గాల
పునర్విభజన) నిర్వహిస్తామని చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని ధర్మాసనం గుర్తు
చేసింది. ఇలాంటి వ్యాజ్యాలను అనుమతించడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా నియోజక వర్గాల
పునర్విభజనపై పిటిషన్లు వచ్చే అవకాశం ఉందని సుప్రీం కోర్టు ధర్మాసనం అభిప్రాయ పడింది.
కేంద్ర పాలిత ప్రాంతాలతో పోల్చినప్పుడు రాష్ట్రాలలో డీలిమిటేషన్‌కు సంబంధించిన
నిబంధనలు భిన్నంగా ఉంటాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. జమ్మూ కశ్మీర్‌పై
ప్రత్యేక దృష్టిసారించారన్న పిటిషనర్ వాదనను కూడా ధర్మాసనం తిరస్కరించింది. జమ్మూ
కశ్మీర్ కోసం జారీ చేసిన నియోజకవర్గాల పునర్విభజన నోటిఫికేషన్ నుంచి మినహాయించడం, ఏక పక్షం, విపక్షం కాదని
సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ కారణాలతో పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు
ధర్మాసనం ప్రకటించింది.
ముఖ్యమైన చట్టపరమైన అంశాలు
అధికరణ 170 (3): భారత రాజ్యాంగంలోని ఈ అధికరణం ప్రకారం, రాష్ట్రాలలోని
అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 2026 సంవత్సరం వరకు 2001 జనాభా లెక్కల ఆధారంగా
స్థిరంగా ఉంటుంది. డీలిమిటేషన్ అనేది తదుపరి జనాభా లెక్కల తర్వాతే జరుగుతుంది.
ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం, సెక్షన్ 26: ఈ సెక్షన్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ
సందర్భంలో నియోజకవర్గాల పునర్విభజన గురించి ప్రస్తావిస్తుంది. అయితే, ఇది రాజ్యాంగంలోని
అధికరణ 170 (3)కు లోబడే ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు
తాజా తీర్పుతో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో
నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభా లెక్కల తర్వాతే జరిగే అవకాశం ఉందని
స్పష్టమైంది.
Comments
Post a Comment