ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్ రాజీనామాపై రాజకీయ దుమారం

Jagdeep Dhankhar

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ ఆకస్మిక రాజీనామా దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. అనారోగ్య కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపిన రాజీనామా లేఖలో ధన్‌ఖర్ పేర్కొన్నప్పటికీ, ప్రతి పక్షాలు మాత్రం మరో వాదనను తెరపైకి తెస్తున్నాయి. తన అధికార నివాసంలో భారీగా డబ్బు దొరికిన నేపధ్యంలో జస్టిస్ యశ్వంత్ వర్మను తొలగించాలని నిన్నటి పార్లమెంట్ సమావేశంలో ప్రతి పక్ష ఎంపీలు నోటీసు ఇచ్చారు. రాజ్యసభ ఛైర్మన్ గా వున్న ధన్ ఖర్, ఈ నోటీసును ఆమోదించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని సభ సెక్రటరీ జనరల్ ను ఆదేశించారు. ఈ నిర్ణయం కేంద్రానికి నచ్చలేదని అంటున్నారు. ఇది జరిగిన తర్వాత, నిన్న సాయంత్రం ఏర్పాటు చేసిన కీలక బిజినెస్ అడ్వైజరీ కమిటీ ( బీఏసీ) సమావేశానికి కీలక మంత్రులు, సభాపక్ష నేత జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు హాజరు కాలేదు.  బీఏసీ సమావేశానికి వారు హాజరు కాక పోవడంతో ధన్‌ఖర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇది ఉప రాష్ట్రపతి రాజీనామాకు దారి తీసిందని ప్రతి పక్షాలు అంటున్నాయి. అయితే, ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. సభాపక్ష నేత జేపీ నడ్డా దీనిపై స్పందిస్తూ ముఖ్యమైన పనుల్లో వుండడం వల్ల బీఏసీ సమావేశానికి రాలేదని, ఈ విషయాన్ని ఛైర్మన్‌కు ముందే చెప్పామని స్పష్టం చేశారు. గైర్హాజరు వెనుక ఎలాంటి ఉద్దేశ్యం లేదని, ఇవి పూర్తిగా నిరాధారమైన ఆరోపణలని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ పరిణామం రానున్న పార్లమెంటు సమావేశాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉపరాష్ట్రపతి రాజీనామాపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు