అమ్ముకున్న దళిత బంధు యూనిట్ల వెరిఫికేషన్ ... తిరిగి లబ్ధిదారులకు అప్పగింత : డిప్యూటీ సీఎం భట్టి
దళిత బంధు మొదటి విడత డబ్బులతో ఏర్పాటు చేసిన యూనిట్లను, లబ్ధిదారులు ఇతరులకు అమ్ముకొంటే
వాటిని తిరిగి లబ్దిదారులకు అప్పగిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
అన్నారు. సోమావారం ఆయన చింతకాని మండల కేంద్రంలో 214 మంది దళిత బంధు లబ్దిదారులకు రెండవ
విడత నిధులకు సంబంధిచిన చెక్కులను అందజేశారు. అలాగే బోనకల్లు మండల కేంద్రంలో లబ్దిదారులకు
కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో భట్టి మాట్లాడుతూ
దళిత బంధు లబ్దిదారుల నుండి ఎవరైనాతెలిసీ, తెలియక కొనుగోలు చేసినా, వాటిని తిరిగి లబ్దిదారులకు
అప్పగించడంలో సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఎన్ని యూనిట్లు ప్రక్క దారి పట్టాయన్న
దానిపై వెరిఫికేషన్ జరుగుతోందని, పూర్తి కాగానే వాటిని అసలు లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు.
అంతే కాకుండా, తిరిగి
అప్పగించిన లబ్ధిదారులకు రెండో విడత నిధులను కూడా మంజూరు చేస్తామని చెప్పారు.
93 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం దేశంలోనే రికార్డు
రాష్ట్రంలో 1.15 లక్షల కుటుంబాలు ఉండగా 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, సన్న బియ్యం కూడా
పంపిణీ చేస్తున్నామని భట్టి ఈ సందర్భంగా చెప్పారు. కుటుంబంలోని ఒక్కొక్కరికి
నెలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వడం భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డన్నారు.
లబ్ధిదారుల సంఖ్య రీత్యా చూసినా, సన్న బియ్యం వారీగా చూసిన ఈ దేశంలో ఆహార భద్రత
కల్పించడంలో తెలంగాణ రాష్ట్రం ఒక రోల్ మోడల్ గా నిలిచిందన్నా రు. రేషన్ కార్డు
అంటేనే ఆహార భద్రతని, అత్యంత
పేదలతో పాటు, ఆర్థికంగా
వెనుక బడిన మధ్యతరగతి వర్గాలకు కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో రేషన్ కార్డుల పంపిణీ
జరుగుతుందన్నా రు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు రాక, కుటుంబ సభ్యుల పేర్లు చేర్పులు, మార్పులు జరగక ఇబ్బందులు పడ్డారని అన్నారు. కళ్ళు కాయలు
కాసేలా ఎదురు చూసిన ఫలితం కనిపించలేదని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి
రాగానే కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు. ఇప్పుడు ఒక్క
మధిర నియోజకవర్గంలోనే కొత్తగా 13,767 మంది లబ్ధిదారులకు ఒకే రోజు కొత్త రేషన్ కార్డులు
పంపిణీ చేయడం సంతోషంగా వుందన్నారు.
జోడెడ్లలా అభివృద్ధి, సంక్షేమం
రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జోడేట్ల మాదిరిగా పరుగులు పెడుతున్నాయని ఈ సందర్భంగా భట్టి పేర్కొన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుండగా, ఈ పథకం కింద రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని తెలిపారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం రాష్ట్రంలోని 93 లక్షల కుటుంబాలకు అందుబాటులోకి వచ్చిందన్నారు. ఇటీ వలే తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయాలు రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం కింద వారి ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే రెండు లక్షల రూపాయల వరకు రైతు రుణ మాఫీ కింద 21 వేల కోట్లు రైతుల పక్షాన బ్యాంకులకు చెల్లించామని వెల్లడించారు. కేవలం సంక్షేమ కార్యక్రమాలే కాకుండా, పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి రూ. 20 వేల కోట్లతో పనులు చేపట్టామని తెలిపారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యనందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ అందుబాటులోకి తీసుకువస్తున్నామని బట్టి విక్రమార్క ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment