ఇది తప్పైతే నేను రాజీనామా చేస్తా ... లేదంటే మంత్రి తుమ్మల చేయాలి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు సవాల్

BJP State President Ramchandar Rao

తెలంగాణ రైతుల అవసరాలకు మించి కేంద్రం యూరియా, డీఏపీ అందిస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు నారప రాజు రాంచందర్ రావు అన్నారు. ఇది తప్పైతే, తన పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం అసత్య ప్రచారం చేస్తోందని మండి పడ్డారు. మంగళవారం ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన, ఖమ్మంలో జరిగిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. 2024–25 రబీ సీజన్లో అవసరమైన 9.80 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను కేంద్రం 12.47 మెట్రిక్ టన్నులు, అంటే 2.67 మెట్రిక్ టన్నులు అధనంగా పంపిందని తెలిపారు. అంతే కాకుండా, డీఏపీ1.50 మెట్రిక్ టన్నులు అవసరం కాగా,1.74 మెట్రిక్ టన్నులు అందించిందని చెప్పారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ కు (2025 ఏప్రిల్జూలై 22) అవసరమైన 6.14 మెట్రిక్ టన్నుల యూరియాకు గాను ఇప్పటికే 6.12 మెట్రిక్ టన్నులు పంపిందని, అందులో 4.36 మెట్రిక్ టన్నులు అమ్ముడు పోగా 1.96 మెట్రిక్ టన్నులు స్టాక్‌లో వుందన్నారు. ఇదే సమయంలో డీఏపీ కూడా1.85 మెట్రిక్ టన్నులు పంపిందని తెలిపారు. కేంద్ర సహాయం స్పష్టంగా కనిపిస్తున్నా, ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని విమర్శించారు. అసలు లోపం రాష్ట్ర  ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలోనే ఉందని, బ్లాక్ మార్కెట్‌ను అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీల లెక్కలను కూడా వివరించారు. యూరియా బస్తా ఖరీదు రూ.1690  కాగా, రైతు చెల్లించేది కేవలం రూ.266.50 మాత్రమేనని, మిగతా రూ.1423.50  కేంద్రం భరిస్తుందని చెప్పారు. డీఏపీ ధర రూ.2445.55 అయితే, రైతు గరిష్ఠ ధర రూ.1350 మాత్రమేనన్నారు. ఈ లెక్కలు తప్పయితే, తాను రాజీనామాకు సిద్ధమన్నారు. లేదంటే, మంత్రి తుమ్మల రాజీనామా చేయాలని సవాల్ డిమాండ్ చేశారు.  

BJP Telangana President Ramchandar Rao

బీసీ రిజర్వేషన్ ఒక్క శాతం తగ్గినా ఊరుకోం

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామన్న కాంగ్రెస్, దానిలో10 శాతం ముస్లింలను జోడించేందుకు కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఇది బీసీ రిజర్వేషన్ బిల్లు కాదు ముస్లింల రిజర్వేషన్ బిల్లుని ఆయన అభివర్ణించారు. ఈ విషయంలో బీజేపీ మాత్రం బీసీలకు పూర్తి మద్దతుగా ఉందని, రిజర్వేషన్ల బిల్లుకు బీజేపీ భేషరతుగా మద్దతిచ్చిందని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ ఒక్క శాతం తగ్గినా సహించేది లేదని హెచ్చరించారు. ఇప్పటికే ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారని, వారు ఈబీసీ కోటాలో కూడా రిజర్వేషన్లు పొందుతున్నారని అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే, ఆ నెపాన్ని కేంద్రంపై నేడుతోందని రాంచందర్ రావు ఆరోపించారు.

ఖమ్మం మేయర్ గెలుస్తాం ... కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలి  

ఈ సారి ఖమ్మం కార్పొరేషన్ మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంటుందని రామచందర్ రావు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని అన్నారు. ఇది కమ్యూనిస్టుల గడ్డ కాదు, బీజేపీ అడ్డా అని, ఇక కమ్యూనిస్టులు కూడా కలిసి పని చేసేందుకు బీజేపీలో చేరాలని పిలుపు నిచ్చారు. బెంగాల్లో కూడా కమ్యూనిస్టులు తమ పార్టీలో చేరుతున్నారని, కేరళలో కూడా బీజేపీ గెలుస్తుందన్నారు. వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకొని కమ్యూనిస్టులు ఒకటి రెండు సీట్లు గెలుస్తున్నారు తప్ప, సొంత బలం ఏమీ లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగానే కమ్యూనిజం తుడుచు పెట్టుకు పోయిందని అన్నారు. పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో నాయకులు తాండ్ర వినోద రావు, విద్యాసాగర్, ఈవి రమేష్, కొండపల్లి శ్రీధర్ రెడ్డి, దేవకీ వాసుదేవ రావు, సన్నే ఉదయ ప్రతాప్, గల్లా సత్యనారాయణ, గోంగూర వెంకటేశ్వర్లు , కొల్లిపాక శ్రీదేవి, నున్న రవి కుమార్, నంబూరి రామలింగేశ్వర రావు, విజయ రాజు, రవి రాథోడ్, పుల్లారావు యాదవ్, అల్లిక అంజయ్య, దొంగల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముందుగా రామంచదర్ రావుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నాయకన్ గూడెం వద్ద ఘన స్వాగతం పలికారు. అక్కడ నుండి ఆయన ర్యాలీగా బయలు దేరి, కూసుమంచి శివాలయంలో పూజలు చేశారు. అనంతరం ఖమ్మం చేరుకొని కార్యకర్తల సమ్మేళనం, మేదావుల సమావేశంలో పాల్గొన్నారు.

BJP Ramchandar Rao

Comments

Popular Posts

గిరిజన గురుకులాలకు రూ.10 కోట్ల కార్పస్ ఫండ్ ... టీఈఏ రాష్ట్ర అద్యక్షులు ఎస్.శ్యామ్ కుమార్ హర్షం

మడుపల్లి శివాలయంలో కార్తీక మాస అభిషేకాలు

మీడియాపై కేసులంటే భావ ప్రకటన స్వేచ్ఛ పై దాడే