మున్నేరులో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం
ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని చిన్న మండవ వద్ద మున్నేరులో చిక్కుకున్న ఐదుగురు
గ్రామస్తులను ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. గురువారం ఉదయం వరద
ఉధృతి లేక పోవడంతో చిన్న మండవ గ్రామానికి చెందిన గుండ్ల సాలయ్య, మొండితోక పుల్లయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, దరెల్లి శ్రీను, కుక్కల గోపి గేదెలు
మేపడానికి లంకలోకి వెళ్లారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో వరద ఉధృతి పెరగడంతో భయంతో
రాలేక లంకలోనే వున్నారు. సమాచారం అందుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర
రావు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆదేశించారు. వెంటనే
రంగంలోకి దిగిన కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో పాటి ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని
పంపారు. 25 మంది సభ్యుల ఎన్డిఆర్ఎఫ్ బృందం, మున్నేరులో చిక్కుకున్న
ఐదుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చింది. సహాయక చర్యల్లో వైరా ఏసీపీ రహమాన్, చింతకాని మండల
తహసీల్దార్ కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు
భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు
రావద్దని ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ విజ్ఞప్తి చేశారు. నీటి వనరుల వద్ద కు వెళ్ళ
వద్దని సూచించారు. అధికారులు వారి వారి హెడ్ క్వార్టర్స్ లో ఉంటూ నిరంతరం
అప్రమత్తంగా ఉండాలని, ఎన్డిఆర్ఎఫ్
బృందం జిల్లాలో అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Comments
Post a Comment