సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు క్యాబినేట్ ఆమోదం
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అభ్యర్థనకు నేడు క్యాబినేట్ ఆమోదం తెలిపింది. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు వ్యయాన్ని రూ.13,057 కోట్ల నుంచి రూ.19,325 కోట్ల వరకు పెంచుతూ ఈ అంచనాలను సవరించారు. వీటికి రేవంత్ రెడ్డి సర్కార్ ఆమోదం తెలపడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు మరో రెండు జిల్లాలకు గోదావరి జలాలు అందనున్నాయి. ప్రధాన పంట కాలువలన్నిటినీ ఆధునీకరించడంతో పాటు మరమ్మత్తులు చేపడతారు.
సీఎంకు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు రాష్ట్ర మంత్రి వర్గానికి వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావుఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల శ్రేయస్సుకు, రైతాంగ అభ్యున్నతికి, ప్రగతి కోసం కాంగ్రెస్ సర్కారు నిత్యం పనిచేస్తుందన్నారు. తనకు సమస్యల పరిష్కారంలో సీఎం రేవంత్ రెడ్డి అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు. రైతన్నల శ్రేయస్సుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ సవరించిన అంచనాలతో లక్షలాది ఎకరాల బీడు భూముల రూపు రేఖలు మారనున్నాయని తుమ్మల పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గోదావరి జలాలు పరవళ్ళు తొక్కుతాయని, ప్రతి ఎకరాకు సాగు నీరు అందుతుందన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తెలంగాణ చరిత్రలో అద్భుతాన్ని ఆవిష్కరిస్తుందన్నారు. పచ్చని పొలాలతో పరిడవిల్లే తెలంగాణకు సీతారామ సాక్ష్యంగా నిలుస్తుందని చెప్పారు.
పనుల పురోగతి ... ప్రయోజనాలు
- ఈ ప్రాజెక్టు వల్ల ఖమ్మం, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లోని ( 11 నియోజకవర్గాలు, 31 మండలాలు ) 3,29,000 ఎకరాల కొత్త ఆయకట్టు మరియు 3,45,000 ఎకరాల స్థిరీకరణ ఆయకట్టు సాగులోకి వస్తుంది.
- ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టు ప్రధాన కాలువను 104 కిలో మీటరు వరకు పూర్తి చేశారు. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పంట కాలువల ఆధునికరణ, మరమ్మత్తు పనులు చేపడతారు. ప్రతి ఎకరాకు సాగు నీరు, ఉమ్మడి జిల్లా కు త్రాగు నీరు అందుతుంది.
- ఇప్పటికే సత్తుపల్లి ట్రంకు (టన్నెల్), పాలేరు లింకు కాలువ 60 కిలో మీటర్ల వరకు పూర్తయింది. మిగిలిన 125 కిలోమీటర్ల కాలువ పనులు పురోగతిలో వున్నాయి. ఇది మరో ఏడాదిలో పూర్తి కానుంది.
- 8 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్లకు టెండర్స్ పిలిచారు. దీనికి సంబంధించిన భూసేకరణను సంబంధిత జిల్లా కలెక్టర్లు ( ఖమ్మం, కొత్తగూడెం) పూర్తి చేయనున్నారు. దీనికి సంబంధించి గ్రామ సభల నిర్వహణ, ఎంజాయ్మెంట్ సర్వే పురోగతిలో వున్నాయి.
- డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజ్ భూసేకరణ పనులు, ఆరు నెలలలోగా నోటిఫికేషన్ స్టేజ్కి వస్తాయి. వెంటనే కాలువల పనులు మొదలు పెట్టి త్వరిత గతిన పూర్తి చేయడం జరుగుతుంది. రెండేళ్లలో ఈ కాలువలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు.
- ఈ ప్రాజెక్టు సవరించిన అంచనాలను మంజురు చేయడంతో ప్యాకేజ్ 9లో యాతలకుంట టన్నెల్ పూర్తి చేసి, సుమారు 120 చెరువులకు డిసెంబర్లోగా నీళ్ళు ఇస్తారు.
- జూలూరుపాడు టన్నెల్ పూర్తి చేసి 2026 చివరి నాటికి పాలేరుకు నీటిని తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
- సీతారామ ప్రాజెక్టు మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు డీపీఆర్ కు సంబంధించి సెంట్రల్ వాటర్ కమిషన్ సాంకేతిక సలహా కమిటీ అన్ని డిజైన్లకు అనుమతించింది.
- ఫలితంగా పూర్తి స్థాయిలో సాగు నీటిని రైతాంగానికి అందించడం, పరిశ్రమలకు మరియు మిషన్ భగిరథ పథకము ద్వారా త్రాగు నీటిని అందించడం జరుగుతుంది.



Comments
Post a Comment