ఛలో పూసుగూడెం ... ఉద్రిక్తం
- బీఆర్ఎస్ నేతలు రేగా, వనమా, హరిప్రియ, మెచ్చ, రాకేశ్ రెడ్డి అరెస్ట్
- ‘సీతరామ’ నీళ్ళను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన
- ఆందోళనలో భాగంగా ప్రభుత్వానికి పిండ ప్రధానం చేసేందుకు ప్రయత్నం
- నేతల ప్రయత్నాలను అడ్డుకొని పోలీస్ స్టేషన్లకు తరలించిన పోలీసులు
- నీళ్లిచ్చే వరకు దశల వారీ ఆందోళనలు చేపడతామని నేతల హెచ్చరిక
‘సీతారామ’ ( గోదావరి ) నీళ్ళను భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాకు ఇచ్చిన తర్వాతే, ఖమ్మం జిల్లాకు తరలించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆ జిల్లా
బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ‘ ఛలో పూసుగూడెం ’ ఉద్రిక్తంగా మారింది. ఆందోళనలో
భాగంగా నేతలెవరూ ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెంలో వున్న ప్రాజెక్టు
వద్దకు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. బీఆర్ఎస్ జిల్లా
అధ్యక్షులు,
మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి వనమా వేంకటేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే
హరిప్రియ,
నాయకులు రాకేశ్ రెడ్డి, దిండిగల రాజేందర్, వనమా రాఘవేంద్రలను దారిలోనే
అదుపులోకి తీసుకొని పాల్వంచ పోలీసు స్టేషన్ కు తరలించారు. అలాగే, మరో మాజీ ఎమ్మెల్యే
మెచ్చ నాగేశ్వర రావును కూడా అరెస్టు చేసి ములకలపల్లి పోలీస్ స్టేషన్ లో వుంచారు. సీతారామ
ప్రాజెక్టు ద్వారా తరలించే గోదావరి జలాలను భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు
ఇవ్వకుండా, ముగ్గురు
మంత్రులు ఖమ్మం జిల్లాకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కొంత
కాలంగా ఆరోపిస్తున్నారు. ఈ ప్రయత్నాలను నిరసిస్తూ ‘ఛలో పూసుగూడెం’ ఆందోళనా
కార్యక్రమానికి పార్టీ జిల్లా కమిటీ పిలుపు నిచ్చింది. పిలుపులో భాగంగా, సోమవారం అక్కడ నిరసన తెలపడంతో
పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి పిండ ప్రధానం చేయాలన్న ఉద్దేశ్యంతో వందలాది మంది నాయకులు, కార్యకర్తలు జిల్లా
నలుమూలల నుండి పూసుగూడెం బయలు దేరారు. కానీ, పోలేసులు వారి ప్రయత్నాలను
అడ్డుకొని,
మధ్యలోనే అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, బీ ఆర్ ఎస్ శ్రేణులకు మధ్య
పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. నాయకులను అరెస్టు చేయకుండా కార్యకర్తలు పోలీసు
వాహనాలను అడ్డుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి
వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తీవ్ర ఉద్రిక్తతల మధ్య అరెస్టు చేసిన
నేతలను పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా నేతలు రేగా కాంతారావు, వనమా వేంకటేశ్వర రావు, రాకేశ్ రెడ్డి, హరిప్రియ మాట్లాడుతూ భద్రాద్రి
కొత్తగూడెం జిల్లాకు గోదావరి జలాలను ఇచ్చిన తర్వాతే, ఖమ్మ జిల్లాకు తరలించాలని
డిమాండ్ చేశారు. నీళ్ళు ఇచ్చే వరకూ దశల వారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. జిల్లాలోని
5 నియోజక వర్గాలకు నీళ్ళను ఇవ్వక పోతే ఊర్కొనే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మం జిల్లాకు
నీల్లివ్వడానికి తమకు అభ్యంతరం లేదని, కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి నీళ్ళను తరలిస్తూ
ఇక్కడ రైతులకు నీళ్ళు ఇవ్వక పోవడాన్ని ఏ మాత్రం సహించేది లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం
దాదాపు 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేసినా, మిగిలిన పనులు పూర్తి
చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నానా తంటాలు పడుతుందని విమర్శించారు. ఈ
ప్రభుత్వానికి ప్రాజెక్టును పూర్తి చేయాలన్న చిత్త శుద్ది లేదన్నారు. చంద్రుగొండ
వద్ద భూములిచ్చిన రైతులకు నష్ట పరిహారం ఇవ్వకుండానే టెండర్లు పిలిచారని, మళ్ళీ వాళ్ళే
కోర్టులకు వెళ్ళి పనులు ఆపుతారని ఆరోపించారు. ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయడంతో
పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Post a Comment