కాంగ్రెస్ అంటేనే కరెంటు ... కరెంటు అంటేనే కాంగ్రెస్
- పదేళ్లలో గత పాలకులు కొత్తగా కరెంటు ఉత్పత్తి చేసింది లేదు
- విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించడమే తప్ప ఏదీ పూర్తి చేయ లేదు
- రాబోయే 10 ఏళ్ల విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా ప్రణాళికలు
- ఉచిత విద్యుత్ పథకాలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 13,992 కోట్లు చెల్లిస్తుంది
- విద్యుత్ సమస్యల పరిష్కారానికి విద్యుత్
అంబులెన్స్ లు (1912 )
- విద్యుత్ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా
- ఖమ్మంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
కరెంటు అంటేనే కాంగ్రెస్... కాంగ్రెస్ అంటేనే కరెంటని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన ఖమ్మం జిల్లా కేంద్రంలో 1912 విద్యుత్ అంబులెన్స్ సేవలు, విద్యుత్ఉద్యోగుల వైద్య శిబిరాలను రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, టీ.జి. ఎన్.పి.డి. సి.ఎల్ సీఎండి కె. వరుణ్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి విద్యుత్ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభించి పూర్తి చేశామని చెప్పారు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లోని మొదటి దశ నుంచి ఏడవ దశ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చేపట్టి పూర్తి చేశామని తెలిపారు.10 సంవత్సరాల పాటు పరిపాలించిన బీఆర్ఎస్నేతలు నేతలు అధనంగా ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయ లేదన్నారు. విద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభించినా పూర్తి చేయలేదని అన్నారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల పరిపాలనలో ఎనర్జీ పాలసీ లేక రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని తెలిపారు. 2023 మార్చిలో15వేల మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ వుండగా అది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2025 మార్చి నాటికి 17,162 మెగావాట్లకు పెరిగిందన్నారు. గత ప్రభుత్వం హయాంలో వున్న విద్యుత్ డిమాండ్ తో పోలిస్తే 2000 మెగావాట్ల డిమాండ్ అధనంగా పెరిగిందన్నారు. రెప్పపాటు కూడా సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు.
2035 నాటికి 33,773 మెగావాట్ల విద్యుత్ డిమాండ్
రాష్ట్రంలో 2030 నాటికి 26, 299 మెగావాట్లు, 2035 నాటికి 33,773 మెగా వాట్ల విద్యుత్ డిమాండ్ ఏర్పడుతుందని కేంద్ర ప్రభుత్వ సంస్థ నివేదిక ఇచ్చిందన్నారు. భవిష్యత్తు డిమాండ్ అధిగమించేందుకు ఇప్పటి నుంచే విద్యుత్ ఉత్పత్తికి రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సిద్ధం చేస్తుందని తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యూ గ్రీన్ ఎనర్జీ పాలసీని (-2025 ) తీసుకొచ్చామని చెప్పారు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తి ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు.2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ముందుకు పోతున్నామని అన్నారు. రాష్ట్రంలోని 29 వేల పంపుసెట్లుకు 24 గంటల పాటు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఇందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షాన విద్యుత్ శాఖకు ప్రతి సంవత్సరం రూ.11,500 కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. 200 యూనిట్ల వరకు గృహ అవసరాల కోసం ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఈ పథకం కింద రాష్ట్రంలో 50.71 లక్షలకు పైబడి పేదలు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. ఈ పథకం క్రింద విద్యుత్ సంస్థలకు 2,293 కోట్ల రూపాయలు చెల్లింపు చేస్తున్నామని చెప్పారు. అలాగే రాష్ట్రంలోని 29,018 ప్రభుత్వ విద్యా సంస్థలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇందుకు విద్యుత్ సంస్థలకు రూ. 198 కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం ఉచిత విద్యుత్ పథకాలకు 13,992 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ ద్వారా విద్యుత్ సంస్థలకు చెల్లిస్తున్నామని అన్నారు.
విద్యుత్ శాఖలో 1912 సేవలు
వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు 108 మాదిరిగా విద్యుత్ శాఖలో 1912 సేవలను ప్రారంభించినట్లు భట్టి తెలిపారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు ఏర్పడితే వినియోగదారులు ఎక్కడి నుంచైనా 1912 కు కాల్ చేస్తే, ఒక ఇంజనీరు, రిపేరు చేసే వ్యక్తి, ట్రాన్స్ఫార్మర్, నిచ్చెన, విద్యుత్ వైర్లతో కూడిన అంబులెన్స్ కొద్ది నిమిషాల్లోనే మీ ప్రాంతంలో ఉంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు. ఈ విద్యుత్ అంబులెన్స్ సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. అర్థరాత్రి, అపరాత్రని తేడా లేకుండా విద్యుత్ సిబ్బంది మెరుగైన సేవలు అందిస్తున్నారని అభినందించారు. భారీ వరదలు, పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినప్పటికీ విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సేవలు అందిస్తున్నారని కొనియాడారు. ఉద్యోగులకు ఏ సమస్యలు ఉన్నా వినడానికి అధికారులు ఉన్నారు, ఆపైన విద్యుత్ శాఖ మంత్రిగా తాను ఎప్పుడు అడిగితే అప్పుడు సమయం కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విద్యుత్ సిబ్బంది విధి నిర్వహణలో భద్రతా చర్యలు తప్పకుండా పాటించాలన్నారు. విద్యుత్ సిబ్బంది భద్రతా చర్యలకు సంబంధించిన ప్రోటోకాల్స్ లైన్మెన్ స్థాయి వరకు చేరవేశామని తెలిపారు. విద్యుత్ సిబ్బందికి ప్రమాద వశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, కోటి రూపాయల ప్రమాద బీమా వస్తుందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఈ తరహా పథకం అమలులో లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్.ఈ. ఇనుగుర్తి శ్రీనివాసా చారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment