మున్నేరు రిటైనింగ్ వాల్ ... డైలీ షెడ్యూల్ ఎక్కడ మిస్సైంది ?

 

Munneru River, Khammam

  • డెడ్ లైన్ దగ్గర పడుతున్నా పూర్తి కాని పనులు
  • ఎర్త్ వర్క్ 41 శాతం, సిమెంట్ వర్క్ 32 శాతం పూర్తి
  • జులై 15 నాటికి పూర్తయ్యే అవకాశాలు మృగ్యం  
  • పనులకు అవరోధంగా మారిన భూ సేకరణ ప్రక్రియ
  • వరదోస్తే బాధితుల తరలింపుకు అధికారుల సమాయత్తం  

ఖమ్మం నగరాన్ని మున్నేరు వరద ముంపు నుండి రక్షించేందుకు నిర్మించ తల పెట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. భూసేకరణ వద్దే కునుకు పాట్లు పడుతోంది. ఇద్దరు మంత్రులు ఇటు తుమ్మల, అటు పొంగులేటి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎప్పటికప్పుడు సమీక్షలు జరిపి, సందర్శించి నిర్మాణ పనులను వేగవంతం చేసే ప్రయత్నం చేసినా, అంతగా పురోగతి కనిపించడం లేదు. ఇంతలో వానా కాలం రానే వచ్చింది. గత రెండేళ్లుగా వచ్చినట్లే ఈ ఏడాది కూడా మున్నేరుకు భారీ వరదొస్తే పరిస్థితి ఏంటన్న ఆలోచనలో ప్రస్తుతం అధికార్లు వున్నారు. ఇప్పటి నుండే ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. సహాయక చర్యలు ఎలా చేపట్టాలన్న దానిపై కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేసినా, ఈ సీజన్లో పూర్తైయ్యే అవకాశం లేదు. ప్రమాదకర స్థాయిలో మళ్ళీ వరదలు వస్తే, ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం తప్ప, మరో మార్గం లేదు. ఎందుకంటే, మున్నేరుకు ఇరు వైపులా ఖమ్మం, పాలేరు నియోజక వర్గాల్లో కలిపి 17 కిలోమీటర్ల మేర ఈ వాల్ నిర్మించాల్సి వుంది. పోలేపల్లి నుండి ప్రకాశ్ నగర్ బ్రిడ్జి వరకు దీనిని నిర్మిస్తారు. మున్నేరుకు 3.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకొనేలా ఈ వాల్ నిర్మాణం జరుగుతుంది. గత ఏడాది వచ్చిన 3.12 లక్షల క్యూసెక్కుల వరదను దృష్టిలో పెట్టుకొని అధికార్లు దీన్ని డిజైన్ చేశారు. అందుకు గాను ప్రభుత్వం రూ. 690 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టారు. కానీ, ఆశించిన స్థాయిలో పనులు జరగక పోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, యుద్ధ ప్రాతిపధికన పనులు చేపట్టి, జూలై 15 నాటికి పూర్తి చేయాలని 6 నెల్ల క్రితమే అధికార్లకు డెడ్ లైన్ పెట్టారు. భూ సేకరణ, పనుల పురోగతిని తనకు రోజూ తెలియ జేయాలని, చేపట్ట బోవు పనుల వివరాలతో రోజు వారీ షెడ్యూల్ తయారు చేసి జనవరి 16 నాటికి తనకు అందజేయాలని సమబంధిత అధికార్లను ఆదేశించారు. అధనపు బృందాలను పెట్టైనా గడువు లోగా పనులు పూర్తి చేయాలన్నారు. అయితే, ఆ షెడ్యూల్ ఎక్కడ మిస్సైందో తెలియదు, పనుల్లో మాత్రం వేగం తగ్గింది.

Khammam Collector Anudeep Durishetty


నదికి ఇరు వైపుల 8.5 కిలో మీటర్ల చొప్పున రిటైనింగ్ వాల్ నిర్మించాల్సి వుండగా, ఇప్పటి వరకు ఎర్త్ వర్క్ 41 శాతం, సిమెంట్ కాంక్రీట్ వర్క్ 32 శాతం మాత్రమే పూర్తయింది. జూలై 15 నాటికి వాల్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ఆమేరకు పనులు జరగ లేదు. దానికి ప్రధాన కారణం రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ జరగక పోవడం. ఈ వాల్ నిర్మాణానికి మొత్తం 245 ఎకరాల భూమి అవసరం కాగా, మున్నేరుకు అవతల వైపు ఖమ్మం రూరల్ మండలంలో 5.1 కిలో మీటర్ల మేర, ఇవతల వైపు ఖమ్మం అర్బన్ మండలంలో1.7 కిలో మీటర్ల మేర ప్రభుత్వ భూమి వుంది. అంత వరకూ ఏ ఇబ్బందీ లేదు. కానీ, ఈ వాల్ నిర్మాణానికి ఇంకా 138 ఎకరాల ప్రైవేటు భూమి అవసరం వుంది. అందులో అధికార్లు 70 ఎకరాల వరకు సంబంధిత భూ యజమానులతో మాట్లాడి భూములు ఇచ్చేందుకు ఒప్పించారు. మిగిలిన భూమికి సంబంధించిన భూ యజమానులు భూములు ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. దీంతో మున్నేరుకు ఇరు వైపుల వున్న ప్రభుత్వ భూమిలో 5 కిలో మీటర్ల మేర మాత్రమే ఇప్పటి వరకు రిటైనిగ్ వాల్ నిర్మాణ పనులు జరిగాయి. మిగిలిన 12 కిలో మీటర్ల పరిధిలో పనులు జరగ లేదు. దీంతో అనివార్యంగా ఈ ఏడాది కూడా ఖమ్మం ప్రజలు వరద ముంపును ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో జిల్లా అధికార్లు ఒక వైపు, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సమాయత్తమవుతూనే, మరో వైపు భూసేకరణను పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నిర్వాసితులు రిటైనింగ్ వాల్ నిర్మాణంలో కోల్పోతున్న భూమికి ప్రత్యామ్నాయంగా పోలేపల్లిలోని ప్రభుత్వ భూమిని కొంత ఇవ్వాలని నిర్ణయించారు. అక్కడ దాదాపు 300 ఎకరాల నాగార్జున సాగర్ మిగులు భూమి వుంది. దానిలో ప్రభుత్వమే 100 అడుగుల రోడ్డుతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి, ఒక లే అవుట్ వేసి, అభివృద్ధి చేసి నిర్వాసితులకు ఇచ్చేందుకు సిద్ధమైంది. అందుకు భూ నిర్వాసితులను ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ భూమి విలువ, అక్కడ భవిష్యత్ లో జరగ బోయే అభివృద్ధి, నేషనల్, గ్రీన్ ఫీల్డ్ హైవేల నిర్మాణాలపై వారికి అవగహన కల్పిస్తున్నారు. భూ నిర్వాసితులందరూ దీనికి అంగీకరిస్తారో లేదో తెలియదు కానీ, అధికార్లు మాత్రం వారిని ఒప్పించేందుకు మరో సారి ప్రయత్నాలు ప్రారంభించారు.ఈ ప్రయత్నాలు ఫలించి, భూసేకరణ జరిగితే, పనులు ముందుకు సాగుతాయి. లేదంటే, ఇంకొంత కాలం పాటు పనులు ఆగిపోయే అవకాశం వుంది. అందువల్ల, ఇద్దరు మంత్రులు తుమ్మల, పొంగులేటి ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం వుంది. ఇంతకు ముందులాగే ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తూ, పనులను వేగ వంతం చేయాలి. భూ సేకరణ ప్రక్రియ కూడా వేగంగా జరిగేలా చూడాలి. లేదంటే, ఒకరిద్దరి అధికార్ల నిర్లక్ష్యమే, పనుల పురోగతికి అవరోధంగా మారోచ్చు.


Khammam Munneru

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు