ఇందిరమ్మ ఇండ్లలో అక్రమాలు జరిగితే శిక్ష తప్పదు

 

Etala Rajendar

  • కేంద్రం సహాయం చేస్తున్నా ఇందిరమ్మ పేరు పెట్టడం వారి విజ్ఞత
  • 3.04 లక్షల ఇండ్లు ఇచ్చినా బీఆర్ఎస్ ప్రభుత్వం కట్ట లేక పోయింది
  • రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి, తెలివీ బీజేపీకి మాత్రమే వున్నాయి
  • ఖమ్మం మీడియా సమావేశంలో బీజేపీ నేత ఈటల రాజేందర్  

ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇండ్లను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా, అమ్ముకున్నా పనిష్మెంట్ వుంటుందని రాష్ట్ర బీజేపీ నాయకులు, మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లబ్దిదారులకు ఏ ప్రాతిపదికన ఇండ్లు కేటాయిస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన వుందన్నారు. తన పర్యటనలో భాగంగా గురువారం ఖమ్మం వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో అమలవుతున్న ఈ పథకానికి ఇందిరమ్మ పేరు పెట్టడాన్ని పాలకుల విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. ఆ మాత్రం సంస్కారం రాష్ట్ర పాలకులకు లేక పోయినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం పేదల ఇండ్ల కోసం సహాయం అందిస్తూనే వుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజీపీ ప్రభుత్వం లేదని, కేంద్రం ఇక్కడి పేదలను విస్మరించే ప్రసక్తే లేదన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా కేంద్రం 3.04 లక్షల ఇండ్లు రాష్ట్రానికి మంజూరు చేస్తే, మాది ధనిక రాష్ట్రమనే ప్రగల్బాలకు పోయి కట్టుకో లేక పోయారన్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి, తెలివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు లేదని, అది బీజేపీతోనే సాధ్యమని చెప్పారు.

40 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ఎస్టీ, బీసీలను ముఖ్యమంత్రిని చేయ లేదేం ?

సామాజిక న్యాయం, బీసీ కులగణనపై పదే పదే మాట్లాడే కాంగ్రెస్ పార్టీ, రాష్ట్రాన్ని 40 ఏళ్ళు పాలించి ఎస్టీ, బీసీ, ఓబీసీలను ఎందుకు ముఖ్యమంత్రిని చేయలేదని ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. కొద్ది కాలం నీలం సంజీవయ్య ముఖ్యమంత్రిగా వున్నారు తప్ప, ఎస్సీలకు కూడా ఆ పదవి దక్కలేదన్నారు. అవకాశం వున్నప్పుడు పదవులు ఇవ్వకుండా, ఇప్పుడు రాహుల్ గాంధీ బీసీల గురించి మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. బీజేపీ చత్తీష్ ఘడ్లో ఎస్టీని, మధ్యప్రదేశ్లో ఓబీసీని ముఖ్యమంత్రిని చేసిందని చెప్పారు. అంతే కాకుండా, ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని, ఓబీసీని ప్రధాన మంత్రిని చేసిందన్నారు. దేశంలో 50 శాతానికి పైగా బీసీలు ఉన్నారని గుర్తించి, బీజేపీ ఆ వర్గానికి పెద్ద పీఠ వేస్తుందన్నారు. చట్ట సభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలన్న చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుందని, ఏం జరుగుతుందో చూడాలన్నారు. ఒక కులం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ కులాలుగా పరిగణింపబడుతున్నా, బీసీ కులగణన చేయాలని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దేశ ప్రజల ఆకాంక్షలకనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.

రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసిన వారే ... దాన్ని పట్టుకొని తిరుగుతున్నారు

రాజ్యాంగాన్ని ఉల్లంఘించి, దాన్ని సస్పెండ్ చేసిన ఇందిరమ్మ ( కాంగ్రెస్ ఐ ) వారసులే ఇప్పుడు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. బావ, పత్రికా స్వేచ్ఛను హరించి, ప్రజాస్వామ్యాన్ని చెర బట్టిన ఆ పార్టీ నేతలు, విదేశీ పర్యటనల్లో ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. ఆ నాడు దేశంలో ఎమర్జెన్సీని విధించి, ప్రశ్నించిన వాళ్ళను జైలు పాలు చేశారని విమర్శించారు. అనేక మందిని హింసించారని, ఎదిరించిన వాళ్ళు చాలా మంది కనిపించ కుండా పోయారన్నారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు, నాడు భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఎందుకు అర్ధం చేసుకో లేక పోయారో చెప్పే దమ్ముందా ? అని నిలదీశారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ను కేంద్ర మంత్రి వర్గం నుండి బయటకు పంపి, ఆ తర్వాత ఎన్నికల్లో ఓడించింది మీరు కాదా ? అని ప్రశ్నించారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఇప్పుడు అంబేడ్కర్ గురించి మాట్లాడడం ఏంటన్నారు. కాంగ్రెస్ దేశాన్ని సుధీర్ఘ కాలం పాలించడం వల్లే, అంతరాలు, అవమానాలు పెరిగాయన్నారు.

జర్నలిస్టులకు ఇంటి స్థలం, ఇండ్లు ఇవ్వాలి

దుర్భర జీవితాలు గడుపుతున్న జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంటి స్థలం కేటాయించి, ఇండ్లు మంజూరు చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 100 గజాల స్థలమైన ఫర్వాలేదు, డబుల్ బెడ్ రూం ఇళ్ళు ఇచ్చినా అభ్యంతరం లేదు, కానీ జర్నలిస్టులను మాత్రం ఆదుకోవాల్సిన అవసరం వుందన్నారు. అన్ని పత్రికలు, చానెళ్లు జీతాలు ఇవ్వడం లేదని, జర్నలిజంలో డిగ్రీ, పీజీలు చేసి ఈ రంగంలోకి వచ్చిన అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు చేస్తున్న సేవలను గుర్తించి వారికి తక్షణమే ఇండ్ల స్థలాలు ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చినా ఖమ్మంలో జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వక పోవడం సరైంది కాదన్నారు. వారికి కేటాయించిన 23 ఎకరాల స్థలాన్ని అప్పగించాలని ప్రభుత్వాన్ని కోరారు. మీడియా సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర రావు, తాండ్ర వినోద్ రావు, దేవకి వాసుదేవ రావు, విద్యాసాగర్, డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రదీప్, కార్పొరేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు