ఈ నెలాఖరు లోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్
- తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
- ఆ తర్వాతే సర్పంచ్, మున్సిపల్ సమరం
- కేబినెట్ సమావేశంలో చర్చించి డేట్ ఫైనల్
- పార్టీ నేతలు ఎన్నికలకు సిద్ధం కావాలి
- గెలిచే వారేనే పార్టీ అభ్యర్ధులుగా ఎంపిక
- నేటి నుండే రైతు భరోసా, సన్నాలకు బోనస్
- రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి
- కూసుమంచిలో ఎరువాక ప్రారంభం
ఈ నెలాఖరు లోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుందని తెలంగాణ రెవెన్యూ , గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు జరగబోవు కేబినెట్ సమావేశంలో చర్చించి, ఎన్నికల తేదీ పై స్పష్టతనిస్తామని చెప్పారు. ఆదివారం ఆయన కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో ఖమ్మం రూరల్, కూసుమంచి, తిరుమలాయ పాలెం, నేలకొండ పల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయని, అవి పూర్తయిన వెంటనే, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు వుంటాయని తెలిపారు. ఎన్నికలు జరగడానికి 15 రోజుల గడువు మాత్రమే వున్నందు వల్ల, గ్రామాల్లో ఏమైనా లోటు పాట్లు వుంటే, వాటిని సరిదిద్దుకొని ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. గ్రామాల్లో నాయకుల మధ్య సఖ్యత ఉండాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రిజర్వేషన్ల ఆధారంగా ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా వున్న అభ్యర్థులను మాత్రమే పార్టీ తరుపున ఎంపిక చేయడం జరుగుతుందని తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన అనంతరం మంత్రి పొంగులేటి, కూసుమంచి మండల కేంద్రంలో ఏరువాకను ప్రారంభించారు. ఉత్సాహంగా హలం పట్టి పొలం దున్నారు. రైతులకు కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చామని, ఈ నెల 16 నుండి ( సోమవారం ) మొదలు పెట్టి వారం రోజుల్లోనే అర్హులైన రైతు సోదరులందరికీ కుంట మొదలుకోని ఎన్ని ఎకరాలుంటే అన్ని ఎకరాలకు రైతు భరోసా క్రింద ఎకరానికి రూ. 12 వేల చొప్పున అందిస్తామని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సార్లు రైతు భరోసా ఇచ్చామని, ఇప్పుడు మూడో సారి ఇవ్వబోతున్నామని తెలిపారు. అలాగే సన్నాలకు బోనస్ ను కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమా చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గ్రామాల్లో ప్రజల వద్దకు తీసుకెళ్లాల్సిన బాధ్యత స్థానిక నాయకులదేనని, మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయించే బాధ్యతను కూడా పార్టీ నాయకులే తీసుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత, సంక్షేమ పథకాలను అమలు చేస్తూనే రైతును రాజును చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగ లేక పోయినా రైతులకు ప్రోత్సహిస్తుందన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పని చేస్తోందని చెప్పారు. రైతులు ఇబ్బంది పడకుండా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో సప్లై చేసేందుకు ప్రణాలికలు సిద్ధం చేసిందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో రైతులకు 17 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేస్తే, తాము 18 నెలల్లో నే 21 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసామని తెలిపారు. వరేస్తే ఉరని నాటి ప్రభుత్వం రైతులను ఇబ్బంది పేడితే, సన్నరకం ధాన్యానికి క్వింటాకు రూ. 500 బోనస్ ఇస్తూ ప్రోత్సహిస్తున్నామని అన్నారు. కాళేశ్వరం కూలి పోయినా రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యం పండించి దేశంలోనే మనం మొదటి స్థానంలో నిలిచామన్నారు. ప్రతి నీటిబొట్టును ఒడిసి పట్టుకుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుందని పేర్కొన్నారు. నాటి ప్రభుత్వ పెద్దలు వారి స్వార్థం కోసం ప్రాజెక్టులు మొదలు పెట్టి వదిలేస్తే, వాటిని కూడా పూర్తి చేస్తూ సాగు నీటిని అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.




Comments
Post a Comment