ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తాం
- క్రిటికల్ మినరల్స్ వెలికి తీస్తాం
- అవకాశాలపై అధ్యయనానికి కమిటీ వేశాం
- నివేదిక రాగానే కార్యాచరణ ప్రణాళిక
- రాష్ట్రంలో కొత్త బొగ్గు గనులు ప్రారంభిస్తాం
- కొత్త గనుల్లో 22 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
- తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
ప్రపంచ వ్యాప్తంగా సింగరేణిని విస్తరిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు
భట్టి విక్రమార్క చెప్పారు. శనివారం ఆయన సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంతో
పాటు వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ 100
సంవత్సరాల అనుభవం గల సింగరేణి, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన
కార్యకలాపాలను విస్తరించేందుకు ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బొగ్గుతో
పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రిటికల్ మినరల్స్ ను వెలికి తీసేందుకు వున్న అవకాశాలను
అధ్యయనం చేసేందుకు ఇప్పటికే ఒక కమిటీని నియమించామన్నారు. ఈ అధ్యయనం పూర్తైన తర్వాత, సింగరేణిని పూర్తి
స్థాయిలో విస్తరించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేస్తామని చెప్పారు. త్వరలో
రాష్ట్రంలో కొత్త బొగ్గు గనులను కూడా ప్రారంభిస్తామన్నారు. కొత్తగూడెం, ఇల్లెందుతో పాటు
కొత్తగా మరికొన్ని గనులను గుర్తించామని, వీటి ద్వారా రానున్న 30 సంవత్సరాల్లో 22 మిలియన్ టన్నుల
బొగ్గును ఉత్పత్తి చేస్తామన్నారు. అదే సందర్భంలో సింగరేణి కార్మికుల రక్షణే తమ
ప్రధాన ధ్యేయమన్నారు. కార్మికులు ప్రమాద వశాత్తు ప్రాణాలు కోల్పోతే, కోటి రూపాయల ప్రమాద
బీమాతో పాటు కారుణ్య నియామకాలు కూడా చేపడతామని చెప్పారు. దేశ చరిత్రలోనే ఇది ఒక
రికార్డని భట్టి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్కు షాపుకు ప్రారంభానికి ముందు భట్టి
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్
తో కలిసి జీఎం కార్యాలయంలో మొక్కలు నాటారు.


Comments
Post a Comment