అందుకే నేను రెండు సార్లు ఓడిపోయా ...
- అడవిని నరకటం దేశద్రోహం కంటే ఎక్కువ
- నరకొద్దన్నందుకే నన్ను రెండుసార్లు ఓడించారు
- అడవిని నరికితే ఫారెస్ట్ అధికార్లే బాధ్యత వహించాలి
- పర్యాటక ప్రాంతాలకు విస్తృత ప్రచారం కల్పించాలి
- టూరిజం ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయి
- పులి గుండాల అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల
అడవిని నరకటం దేశద్రోహం కంటే ఎక్కువని, ఆలాంటి వారిని ఉపేక్షించేది లేదని, అడవిని నరికితే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు హెచ్చరించారు. అడవిని నరకొద్దన్నందుకే గతంలో రెండు సార్లు తాను ఓడిపోయానని, ఓడి పోయినా ఫర్యాలేదు కానీ అడవిని నరకొద్దని, నరికితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికార్లను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలోని కనకగిరి అర్బన్ ఫారెస్ట్ పులి గుండాల ప్రాజెక్టు వద్ద ఏకో టూరిజం అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ లతో కలిసి పరిశీలించారు. పర్యాటకుల రవాణా కోసం నూతనంగా ఏర్పాటు చేసిన వన విహారి బస్సు ను మంత్రి ఈ సందర్భంగా ప్రారంభించారు. అనంతరం ఫోటో ఎగ్జిబిషన్ తో జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, పులి గుండాల ప్రాజెక్టు చరిత్ర, పర్యాటక అభివృద్ధి పనుల పురోగతి ని మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల క్రితం పులి గుండాల చుట్టు పక్కల గ్రామాలకు నీటి కరువు ఉండేదని, పులిగుండాల ప్రాజెక్టు నుండి ఇక్కడ ప్రజలు స్వయంగా కాలువ త్రవ్వుకొని చెరువులు నింపుకొని పంటలు పండించుకునే వారని, పులిగుండాల ప్రాజెక్టునే చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు జీవనాధారమని తెలిపారు. టూరిజం ఉంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయని, పులి గుండాల ప్రాజెక్టుకు పక్క రాష్ట్రాల నుండి ప్రజలు వచ్చేలా ఏకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. పులి గుండాల ప్రాజెక్టును సెంటర్ పాయింట్ చేసి అభివృద్ధి చేస్తే పల్లెలబాయి గుట్ట వరకు టూరిజం కోసం వచ్చిన ప్రజలు నేరుగా భద్రాచలం వెళ్ళి రాములోరిని దర్శించుకోవచ్చని అన్నారు. పకృతి అందాలు భవిష్యత్తు తరాలు చూసేలా అడవిని కాపాడుకోవాలని, ఫారెస్ట్ ను నరికారని తెలిస్తే సహించేది లేదని, అందుకు ఫారెస్ట్ అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని ఈ సందర్భంగా తుమ్మల హెచ్చరించారు. ఈ పర్యటనలో సిసిఎఫ్ డి భీమా నాయక్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, డిసిసిబి చైర్మన్ దొండపాటి వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.



Comments
Post a Comment