ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం హెల్త్ మార్కెట్ ఏర్పాటు
- రైతులు నేరుగా వినియోగదారులకు అమ్ముకొనే అవకాశం
- ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సమీకృత మార్కెట్ ఆకస్మిక తనిఖీ
వారం, పది
రోజుల్లో ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఖమ్మంలో హెల్త్ మార్కెట్ ఏర్పాటు చేస్తామని, రైతులు నేరుగా
వినియోగదారులకు అమ్ముకోవచ్చని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. వెంటనే
హెల్త్ మార్కెట్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబాధిత అధికార్లను ఆదేశించారు.
సోమవారం ఆయన ఖమ్మం ఎన్ఎస్పీ రోడ్, వీడియోస్ కాలనీలోని సమీకృత మార్కెట్ ను ఆకస్మికంగా తనిఖీ
చేశారు. నిరుపయోగంగా వున్న నాన్ వెజ్ మార్కెట్ను ఆర్గానిక్ ఉత్పత్తుల మార్కెట్గా
ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను అధికారులతో కలిసి పరిశీలించారు. సహజ సిద్దంగా
పండించే పండ్లు, బియ్యం, పలు రకాలైన ఉత్పత్తులను
విక్రయించేందుకు మార్కెట్లో కనీస సౌకర్యాలు కల్పించాలని, మార్కెట్ కు రంగులు వేయాలని, రైతులకు స్టాల్స్
కేటాయించాలనిసూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ సేంద్రీయ
పద్దతుల్లో సాగు చేసిన ఆర్గానిక్ ఉత్పత్తుల వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన ఆరోగ్యం
లభిస్తుందన్నారు. రసాయనాలు వాడిన ఉత్పత్తుల వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, దళారులు లేకుండా
రైతులు నేరుగా అమ్ముకునేలా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మన పూర్వీకులు
చాలా ఆరోగ్యంగా ఉన్నారని, ఇప్పుడు మాత్రం మన ఆరోగ్యం తగ్గి పోతుందని అన్నారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని సేంద్రీయ వ్యవసాయం ప్రస్తుతం చాలా అవసరమన్నారు.
ఎరువులు,
మందులు
వాడకుండా పండించిన వ్యవసాయ పంటలు ఆరోగ్యంగా ఉంటాయన్నారు. రైతులకు లాభం పెరగాలనే
లక్ష్యంతో ప్రభుత్వం వివిధ కార్యక్రమాలను చేపడుతుందని చెప్పారు. కలెక్టర్ వెంట మున్సిపల్
ఇఇ కృష్ణలాల్, జిల్లా
ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీమ్, నగరపాలక సంస్థ
అసిస్టెంట్ కమీషనర్ షఫీయుల్లా, మార్కెట్ కార్యదర్శి శ్వేత తదితరులు వున్నారు.

Comments
Post a Comment