ఉగ్రదాడి భద్రతా వైఫల్యమే
- మోడీ, అమిత్ షాకు పదవుల్లో కొనసాగే అర్హత లేదు
- బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే విద్యార్థి నేతలపై వేటు
- హిందూ..హిందుస్థానీ అంటూ పాఠ్యపుస్తకాల్లో మార్పు
- నయా ఫాసిస్టు విధానాలపై పోరాటం
- ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడు వీపీ సాను
- ఖమ్మంలో ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 5వ మహాసభలు
- ఖమ్మం నగర వీధుల్లో విద్యార్ధుల భారీ ర్యాలీ
కాశ్మీర్లో పర్యాటకులపై దాడికి భద్రత వైఫల్యమే కారణమని ఎస్ఎఫ్ఐ జాతీయ
అధ్యక్షులు వీపీ సాను అన్నారు. పార్లమెంటు మొదలు పుల్వామా వరకు అనేక చోట్ల
ఉగ్రదాడులు జరుగుతున్నాయని, ప్రధానిగా మోడీ, హోం మినిస్టర్ గా అమిత్ షాకు
కొనసాగే అర్హత లేదన్నారు. ఖమ్మంలో మూడు రోజుల పాటు జరిగే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఐదవ
మహాసభలు స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రం ( సీతారాం ఏచూరి నగర్ )లో యూనియన్
రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్. మూర్తి అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమయ్యాయి. దీనికి
ముందు కళా క్షేత్రం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వీపీ సాను మాట్లాడుతూ పెహల్
గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి 28 మందిని హతమార్చారంటే, ఇది పూర్తిగా భద్రత
వైఫల్యమేనన్నారు. నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడారని యూనివర్సిటీ
విద్యార్థి నేతలపై వేటు వేస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తూ
హెచ్ సీయూ భూముల కాజేస్తున్నారన్నారు. విద్యార్థి సమస్యలపై ప్రశ్నించినందుకు
విద్యార్థి నేతలపై దేశద్రోహం కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. టీఐఎస్ఎస్
రీసెర్చ్ స్కాలర్ రాందాస్ పై రెండేళ్లు వేటు వేసిన విషయాన్ని ప్రస్తావించారు. నయా
ఉదార వాద విధానాలు పెట్రేగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కశ్మీరీ ప్రజలపై ఆర్ఎస్ఎస్, హిందుత్వ మతోన్మాద శక్తులు
దాడి చేస్తున్నాయన్నారు. హిందూ హిందుస్తానీ అంటూ కేంద్ర ప్రభుత్వం పాఠ్య
పుస్తకాల్లో మార్పులు తీసుకొస్తుందని విమర్శించారు. ఫాసిస్టు, మతోన్మాద విధానాలను
రూపు మాపాలని కోరారు. నయా ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా భారత విద్యార్థి
ఫెడరేషన్ అలుపెరుగని పోరాటం చేస్తుందనిస్పష్టం చేశారు.
ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి: టి. నాగరాజు
విద్యా రంగంతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు అన్నారు. విశ్వవిద్యాలయాల్లో పోస్టులు భర్తీ చేయాలని, రాష్ట్రంలో 1800 పాఠశాలలు ఏకోపాధ్యాయులతో కొనసాగుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 4 వేల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ క్లియర్ చేయాలన్నారు. రాష్ట్రంలో నూతన విద్యా విధానం అమలు కాకుండా అడ్డుకోవాలన్నారు. ఈ బహిరంగ సభలో ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఐవీ రమణారావు, రిసెప్షన్ కమిటీ గౌరవ అధ్యక్షులు రవిమారుత్, ఎస్ఎఫ్ఐ జాతీయ ఉపాధ్యక్షులు నితీష్ నారాయణ్, విద్యావేత్తలు మువ్వా శ్రీనివాసరావు, ఎస్ఎఫ్ఎఐ రాష్ట్ర గర్ల్స్ కన్వీనర్ ఎం.పూజ, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, తుడుం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
ముందుగా ఎస్ఎఫ్ఐ ఐదవ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఖమ్మం నగర వీధుల్లో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక జడ్పీ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ వైరా రోడ్ మీదుగా మహాసభల ప్రాంగణం భక్త రామదాసు కళాక్షేత్రం వరకు సాగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎస్ఎఫ్ఐ జెండాలు, భగత్ సింగ్, చే గువారా ప్లకార్డులు, కోలాటం, డప్పు నృత్యాలు, కోయ కళాకారుల రేల నృత్యాలతో ఆద్యంతం ఆకట్టుకునేలా ప్రదర్శన సాగింది.
Comments
Post a Comment