సారీ సార్ ... నేనొప్పుకొను
- మంత్రి తుమ్మల ప్రోగ్రాంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఫైర్
- తనకు తెలియకుండా ప్రోగ్రాం ఎలా పెడతారంటూ అధికార్లపై ఆగ్రహం
- తుమ్మల వారించినా ... సారీ సార్ ... నాకు అవసరం లేదంటూ తిరష్కరణ
- ఆగి పోయిన రూ. 15 కోట్ల విలువైన బీటీ రోడ్డు నిర్మాణ పనుల శంఖుస్థాపన
అధికార పార్టీకి చెందిన అశ్వరావు పేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అధికార్లపై
మండి పడ్డారు. నియోజక వర్గంలో తనకు తెలియ కుండా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి
తుమ్మల నాగేశ్వర రావు పర్యటన ఖరారు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుమ్మల
సమక్షంలోనే జిల్లా అధికార్లను నిలదీశారు. “ నాకు మీరు చెప్పాలి గదా ? నాకు చెప్పారా ? టూర్ షెడ్యూల్ ఏమైనా
చెప్పారా నాకు ? నేనొక
ఎమ్మెల్యేని మీరు నాకు చెప్పారా ? చెప్ప లేదు గదా? ఎందుకు చెప్ప లేదు ? ఎమ్మెల్యే
ఉన్నాడనుకున్నారా ? లేదా ? చచ్చాడనుకున్నారా ? ఎమ్మెల్యే పిచ్చోడిలా
కనిపిస్తున్నాడా ?
” అంటూ ఆగ్రహంతో ఊగి పోయారు. తుమ్మల వారించినా విన లేదు. సారీ సార్ ... నాకవసరం
లేదంటూ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరాకరించారు. అశ్వరావు పేట నియోజక వర్గంలోని
దమ్మపేట మండలంలో మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, స్థానిక ఎమ్మెల్యే జారెఆదినారాయణతో కలిసి పూసుకుంట, కట్కూరు గ్రామాల్లో పర్యటించాల్సి ఉంది. అనుకున్న
షెడ్యూల్ ప్రకారం మూడు హై లెవెల్ బ్రిడ్జిలను ప్రారంభించాలి. తర్వాత పూసుకుంటలో
ఆయిల్ ఫామ్ మొక్కలు, తేనె
టీగల పెంపకం పెట్టెలను అంద జేస్తారు. ఇది ఎమ్మెల్యే జారెకు తెలిసిన షెడ్యూల్. ఈ
మేరకు ఆయన క్యాంపు కార్యాలయం నుండి కూడా సోమవారం రాత్రి ప్రకటన వెలువడింది. అయితే, అనుకున్న షెడ్యూల్లో లేకుండా, వినాయక పురం ఆర్ అండ్
బి రోడ్ నుండి పూసుకుంట, కట్కూరు మీదుగా రాచన్న గూడెం వరకు రూ.15 కోట్ల వ్యయంతో
బిటి రోడ్డు నిర్మాణ పనులను శంఖుస్థాపన చేసేందుకు ఆర్ అండ్ బి అధికార్లు శిలా ఫలకం
ఏర్పాటు చేశారు. మంత్రి తుమ్మల సమక్షంలో పనులకు శంఖుస్థాపన చేయమని స్థానిక
ఎమ్మెల్యే జారె ఆదినారాయణను కోరారు. అయితే, దీనికి సంబంధించి ముందుగా జారేకు
ఎటువంటి సమాచారం ఇవ్వ లేదు. తనకు తెలియకుండానే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంతో ఆర్
అండ్ బి అధికారులపై జారె తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. నా నియోజకవర్గంలో నాకు
తెలియకుండానే అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారని అధికారుల తీరుని దుయ్య
బట్టారు. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అంటే తనకి గౌరవం ఉందని, కానీ అధికారుల తనని అవమానించేలా
వ్యవహరించడంతో తన మనో భావం దెబ్బతిందన్నారు. ఈ కార్యక్రమంలో తాను పాల్గొనేది లేదని, పర్యటన నుండి తిరిగి
వెళ్లి పోతానని ఎమ్మెల్యే జారె తెగేసి చెప్పారు. మంత్రి తుమ్మల కలుగ జేసుకొని, ఎమ్మెల్యేకి ఎందుకు
సమాచారం ఇవ్వ లేదు ?
చెప్పాలి కదా ?
అంటూ అధికార్లను మందలించారు. ఎమ్మెల్యేకి సమాచారం ఇవ్వక పోవడం తప్పేనన్నారు. దీనిపై
తర్వాత చర్చిద్దామని జారెను సముదాయించారు. కానీ జారె విన లేదు. నాకు అవసరం లేదు
సార్ అంటూ కార్యక్రమంలో పాల్గొనేందుకు నిరాకరించారు. దీంతో మంత్రి తుమ్మల, జారే ఆదినారాయణ
చెయ్యి పట్టుకొని తన కార్లో తీసుకు వెళ్లారు. ఫలితంగా రూ.15 కోట్ల రూపాయల రోడ్డు నిర్మాణ
పనుల శంఖుస్థాపన ఆగి పోయింది.
Comments
Post a Comment