ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యల పరిష్కారానికే పరిమితం కావొద్దు
- సైద్ధాంతిక భావ జాలాన్ని పెంపొందించాలి
- తరగతి గదిని సమాజాన్ని అనుసంధానించాలి
- ఆచరణ కోసం అధ్యయనం చేయాలి
- సంపదకు బదులు మోడీ దారిద్ర్యం పెంపు
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో ప్రొఫెసర్ నాగేశ్వర్
ఎస్ఎఫ్ఐ విద్యార్థి సమస్యల పరిష్కారానికే పరిమితం కాలేదని, కాకూడదని ప్రముఖ
విశ్లేషకులు, ప్రొఫెసర్
నాగేశ్వర్ అన్నారు. వర్గ చైతన్యం ఇచ్చే సంఘం ఎస్ఎఫ్ఐ అని కొనియాడారు. విద్యాపరమైన
అసమానతలే ఆదాయ పరమైన అసమానతలకు దారి తీస్తాయని, ధనిక, పేద అంతరాలను దాటి విద్యార్థి
ఉద్యమాలను నిర్మించాలని పిలుపు నిచ్చారు. ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం ( సీతారాం
ఏచూరి నగర్) లో కొనసాగుతున్న ఐదవ రాష్ట్ర మహాసభల్లో నాగేశ్వర్ శనివారం
ప్రారంభోపన్యాసం చేశారు. ఏ సిద్ధాంతమైనా ఆచరణ నుంచి రావాలని, ఆచరణ కోసం అధ్యయనం
చేయాలని సూచించారు. ఆలోచనల పోరాటంలో
ఎస్ఎఫ్ఐ ముందుండాలన్నారు. విద్యార్థుల దైనందిన సమస్యలను ప్రాపంచిక దృక్పథంతో
అనుసంధానం చేయాలని చెప్పారు. ప్రజా ఉద్యమాలకు కీలక నాయకులను ఇచ్చింది ఎస్ఎఫ్ఐ అని పేర్కొన్నారు.
అనేక సంస్థలకు నిష్ణాతులను ఇచ్చిందీ ఈ సంఘమేనన్నారు. దేశ ఐక్యతకు వేలాది మంది
ప్రాణాలను పణంగా పెట్టింది కూడా ఇదే నాన్నారు. ప్రభుత్వ విద్యా రంగం నాడు బలంగా
ఉండేదని,
నాటి
భిన్నత్వమే సామాజిక చైతన్యానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయ పాడారు.
కార్పొరేట్ల లాభాలు 400 శాతం పెరిగాయి
దేశంలో కార్పొరేట్ల లాభాలు 400 శాతం పెరిగితే ఉద్యోగుల జీతాలు ఐదు శాతం మాత్రమే పెరుగుతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం 10 శాతంగా ఉన్న కార్పొరేట్లకు రూ.1.45 లక్షల కోట్ల రాయితీలు ఇస్తోందన్నారు. తద్వారా విద్యా, ఆరోగ్యం లాంటి సామాజిక రంగాల్లో ఖర్చు పెట్టలేకపోతోందని పేర్కొన్నారు. రూ. 2.2 లక్షల కోట్లు మాత్రమే సామాజిక రంగాలపై ఖర్చు చేస్తుందన్నారు. కార్పొరేట్ల నుంచి వచ్చే ఆదాయం నానాటికీ తరుగుతుందని. ఒకప్పుడు 32 శాతంగా కార్పొరేట్ల నుంచి ఆదాయం వస్తే, ప్రస్తుతం 26 శాతం మాత్రమే లభిస్తోందని తెలిపారు. దేశంలో 22 కోట్ల మంది ప్రజల రోజువారీ ఆదాయం రూ.300 కన్నా తక్కువగా ఉంటే, గౌతమ్ అదానికి రోజుకు రూ.1600 కోట్ల ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. స్వాన్ పెట్రోడ ప్రతిపాదన ప్రకారం సంపదపై పన్ను, వారసత్వ పన్ను ఎందుకు విధించకూడదన్నారు. ప్రధాని మోడీ సంపదను కాకుండా దారిద్ర్యాన్ని పంచుతానంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో 40 శాతం సంపద ఒక శాతం మంది చేతిలో ఉంటే, 50 శాతం జనాభాకు మూడు శాతం ఆదాయం మాత్రమే లభిస్తుందన్నారు. ఇలాంటి స్థితిలో ప్రజల కొనుగోలు శక్తి ఎలా పెరుగుతుందని ప్రశ్నించారు. ఎస్ఎఫ్ఐ సైతాంతిక భావాజాలాన్ని పెంపొందించాలని సూచించారు. దేశంలో రాజ్యాంగం మాత్రమే సుప్రీమని తెలిపారు. పార్లమెంటుకు కూడా రాజ్యాంగాన్ని మార్చే అర్హత లేదన్నారు. లౌకికత్వత్వం, సామ్యవాదం అనే పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతుండటం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యానికి మాత్రమే మతం లేదని లౌకికతత్వం చెబుతుందన్నారు. పహల్గాం ఉగ్ర దాడిని బీజేపీ సోషల్ మీడియా ముస్లిం దాడులుగా చిత్రీకరిస్తోందన్నారు. హార్స్ రైడర్ సయ్యద్ హుస్సేన్ షా పర్యాటకులను కాపాడిన విషయాన్ని గమనించాలని కోరారు. సభలో మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు, సీఐటీయూ జాతీయ కోశాధికారి ఎం.సాయిబాబు ఆహ్వాన సంఘం చైర్మన్ మువ్వా క్రాంతి శ్రీనివాసరావు, సీఐటీయూ జాతీయ నాయకులు ఎస్ వీరయ్య, ఏఐఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్టా లక్ష్మణ్, ఏఐడీఎస్ వో రాష్ట్ర నాయకులు మల్లేష్ సౌహార్థ సందేశం ఇవ్వగా, ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షులు వీపీ సాను, ఉపాధ్యక్షులు ఆధిత్య నారాయణ్, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ ఎల్ మూర్తి, టి. నాగరాజు, రిసెప్షన్ కమిటీ చైర్మన్ రవిమారుత్, ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు ఐవీ రమణారావు, కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొప్పిశెట్టి సురేష్, ఎస్ఎఫ్ఐ ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సుధాకర్, ప్రవీణ్, ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి సంఘ నాయకులు ఎం. సుబ్బారావు, కోట రమేష్, భూక్యా వీరభద్రం, మూఢ్ శోభన్ నాయక్, కళ్యాణం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా ఎస్ఎఫ్ఐ పూర్వ విద్యార్థి నాయకులు రూ.3.25 లక్షల చెక్కును అందజేశారు.
Comments
Post a Comment