సంఘటితమై బీజేపీ కుట్రలను త్రిప్పి కొడదాం
- వక్ఫ్ సవరణ చట్టం రాజ్యాంగ వ్యతిరేకం
- మరో విభజనకు కుట్ర చేస్తున్న బీజేపీ
- నేడు ముస్లింలు, రేపు క్రిస్టియన్లు టార్గెట్
వక్ఫ్ సవరణ చట్టం 2025 రాజ్యాంగ వ్యతిరేకమని, దేశంలో మరో విభజనకు బీజేపీ కుట్ర
పన్నుతోందని పలు పార్టీల, ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు.
వక్ఫ్ సవరణ చట్టం పేరుతో ముస్లింలను టార్గెట్ చేసిన బీజేపీ ప్రభుత్వం, రేపు క్రిస్టియన్లను
కూడా టార్గెట్ చేస్తుందని, సంఘటిత ఉద్యమాల ద్వారా బీజేపీ కుట్రలను త్రిప్పి కొట్టాలని
పిలుపు నిచ్చారు. ఆదివారం ఖమ్మంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆల్ ఇండియా ముస్లిం
పర్సనల్ లా ఖమ్మం యూనిట్ ఆధ్వర్యంలో మహమ్మద్ అసద్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ దుర్గాప్రసాద్
మాట్లాడుతూ గతంలో ముస్లిం మైనార్టీల లక్ష్యంగా తీసుకువచ్చిన సిఏఏ, ఎన్ఆర్సిలకు వ్యతిరేకంగా
కాంగ్రెస్ పార్టీ పోరాడిన విషయాన్ని గుర్తు చేశారు. మత స్వేచ్ఛను హరిస్తున్న వక్ఫ్సవరణ చట్టంతో మరోసారి బెజేపీ ప్రభుత్వం మత కలహాలను రెచ్చగొట్టాలని చూస్తోందని
ఆరోపించారు. సీపీఐ జాతీయ నాయకులు బాగా హేమంతరావు మాట్లాడుతూ ముస్లింల ప్రయోజనాలను
దెబ్బతీస్తూ వారి మత స్వేచ్ఛ, హక్కులను కాలరాసే ఈ వక్ఫ్ చట్టం ప్రమాదకర చట్టమని
అభివర్ణించారు. ప్రజాస్వామిక, లౌకిక, మేధావి వర్గాలు సంఘటితంగా దీనిని వ్యతిరేకిస్తూ
పోరాడాలని పిలుపు నిచ్చారు. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ గోపీనాథ్
మాట్లాడుతూ దేశ విభజనకు కారణం గాంధీ, నెహ్రూ అంటూ నిత్యం ఆరోపించే బీజేపీ, ఆర్ఎస్ఎస్ మరో సారి
దేశ విభజనకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఖమ్మం యూనిట్ బాధ్యులు మహమ్మద్ అసద్ మాట్లాడుతూ యూపీఏ హయాంలో ప్రతి పక్షంలో
కూర్చున్న నేటి బీజేపీ, ఆనాడు వక్ఫ్ బోర్డు బలోపేతం చేసే సవరణలకు మద్దతు
పలికిందని అన్నారు. నేడు రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వక్ఫ్ సవరణ చట్టం 2025 ను
రూపొందించడం వెనుక కుట్రలను నిషితంగా పరిశీలించాలని కోరారు. ఈ సమావేశంలో జమాతే
ఇస్లామీ హింద్ నాయకులు మహమ్మద్ సాదిక్ మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఐఎంఏ కార్యదర్శి
డాక్టర్ జగదీష్ , కాంగ్రెస్
నేత, మస్జిద్ ఏ ఆయేషా
(సదర్) ప్రెసిడెంట్ షేక్ అబ్ధుల్ రషీద్, ప్రజాపంథా మాస్ లైన్ కార్యదర్శి గోకినపల్లి
వెంకటేశ్వరరావు , సీపీఎం
రాష్ట్ర నాయకులు ఎం. సుబ్బారావు , తెలంగాణ ఉద్యమకారులు డాక్టర్ కెవి కృష్ణారావు, పి డి ఎస్ యు నాయకులు
ఆజాద్ ,
గ్రంధాలయ
మాజీ చైర్మన్ ఖమర్, ఆల్
ఇండియా పర్సనల్ లా బోర్డు సభ్యులు మౌలానా
మొహమ్మద్,
సయీద్ అహ్మద్ ఖాష్మీ, మహమ్మద్ ఇలియాస్ తదితరులు మాట్లాడారు.

Comments
Post a Comment