ఇక భద్రాద్రికి కొత్త శోభ
- దక్షిణ అయోధ్య భద్రాద్రి అభివృద్ధికి అడుగులు
- టెంపుల్ సిటీగా మారనున్న భద్రాద్రి రామాలయం
- భూ సేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్
- మంత్రి తుమ్మల ప్రత్యేక చొరవతో సీఎం అంగీకారం
- భూసేకరణకు 34 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
- సీఎం రేవంత్ కు మంత్రి తుమ్మల కృతజ్ఞతలు
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామయ్య ఆలయం కొత్త శోభను సంతరించుకోబోతోంది. శ్రీరామ నవమి నవమికి ముందు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో కాంగ్రెస్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. భద్రాద్రి రామాలయ అభివృద్ధికి భూ సేకరణ జరిపేందుకు సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రాద్రి ఆలయ భూ సేకరణ సమస్యను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి కి దృష్టికి తీసుకు వెళ్లగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యుద్ధ ప్రాతిపదికన భూసేకరణ చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రూ 34 కోట్లు నిధులను విరుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో భద్రాచలం టెంపుల్ సిటీకగామారాబోతోంది.
అడిగిందే తడవుగా
ఆదివారం ఆలయ ఈఓ, పండితులు ముఖ్య మంత్రిని కలిసి భద్రాచల సీతారామచంద్ర స్వామి శ్రీరామ నవమి వేడుకలకు ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల గతంలో భద్రాద్రి ఆలయ అభివృద్ధికి రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను సీఎంకు వివరించారు. అభివృద్ధి పనులకు భూసేకరణ అడ్డంకిగా మారిందని తుమ్మల సీఎంకు దృష్టికి తెచ్చారు. భూసేకరణ పనులు పూర్తి చేస్తే భద్రాద్రి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకం ఉండదని, భద్రాద్రి ఆలయం భక్తులతో మరింత శోభిల్లుతోందని తుమ్మల చెప్పారు. మంత్రి తుమ్మల చొరవతో సీఎం రేవంత్ రెడ్డి భూసేకరణకు కావలసిన నిధులను మరుసటి రోజు విడుదల చేసి ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పనులు ప్రారంభించండి
భూసేకరణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పటికే ఆగమ పండితులు రూపొందించిన నమూనాలు, సూచనల ప్రకారం అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. శర వేగంగా భూసేకరణ పనులు పూర్తి చేయాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన షాపులు, ఇల్లు షిఫ్టింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో శ్రీరామ నవమి వేడుకలు అనంతరం నమూనాల ప్రకారం అత్యద్భుతంగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి అడుగులు పడనున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చేతుల మీదుగా భద్రాద్రి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు.
Comments
Post a Comment