టీఏసీ ముందుకు 'సీతారామ’ దస్త్రం

 

Thummala Nageswara Rao

  • అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి తుమ్మల
  • అవసరమైన దస్త్రాలతో ఢిల్లీకి అధికారులు
  • సవరించిన అంచనాలను అనుమతించాలని సీఎంకు లేఖ

ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ఎత్తి పోతలు, సీతమ్మ సాగర్ బహుళార్థ సాధక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. దాదాపు10 లక్షల ఎకరాలకు  సాగునీరు, త్రాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. మంత్రి తుమ్మల కృషి ఫలితంగా సీతారామ సీతమ్మ సాగర్ సమగ్ర ప్రాజెక్టు నివేదికకు (డీపీఆర్) సంబంధించిన సాంకేతిక అనుమతుల దస్త్రం ఎట్టకేలకు సాంకేతిక సలహా కమిటీ (టీఏసీ) ముందుకు చేరింది. దీంతో మంగళవారం ఢిల్లీలో ఈ ప్రాజెక్టుకు సంబధించిన కీలక అనుమతులపై టీఏసీ చర్చించింది. ఈ నేపధ్యంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు నీటి పారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వాపురం మండలంలో గోదావరిపై సీతమ్మ సాగర్ బ్యారేజీ నిర్మాణానికి, బ్యారేజీ బ్యాక్ వాటర్ ఆధారంగా ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే సీతారామ ఎత్తి పోతల పథకానికి టిఏసీ అనుమతులు ఇచ్చేందుకు అవసరమైన దస్త్రాలతో సంబంధిత అధికార్లను డిల్లీకి పంపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఇతర అనుమతులు లభించాయి. టీఏసీ అనుమతి కూడా లభిస్తే ఈ ప్రాజెక్టులో నిర్మాణానికి మార్గం సుగమం అవుతుంది.

సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి తుమ్మల లేఖ

మరో వైపు సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్ట్ కోసంతయారు చేసిన సవరించిన అంచనాలు పరిపాలనా ఆమోదం కోసం ఆర్థిక శాఖ వద్ద పరిశీలనలో వున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు.  తక్షణమే సవరించిన  ఎస్టిమేట్ పనులకు అనుమతులు ఇవ్వాలని కోరారు. పరిపాలన పరమైన అనుమతులతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టేందుకు అవకాశం వుంటుందని తెలిపారు. ఈ ఏడాదిలో పనులు పూర్తి చేసి సాగునీరు ఇచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డిని తుమ్మల ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. 

Janechcha

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు