ఎల్ కటింగ్ ... మిర్చి మార్కెట్లో ఇదో మోసం

Dry Chilies


  • ఖమ్మంలో వ్యవసాయ మార్కెట్లో కొత్త రకం దోపిడీ
  • కటింగ్ చేసిన బస్తాలను తెగనమ్ముకోవాల్సిన దుస్థితి
  • మోసం జరగనీయమన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ హనుమంత రావు
  • సోమవారం ఒక్క రోజే మార్కెట్ కు వచ్చిన లక్ష బస్తాల మిర్చి  

ఎకరానికి లక్ష రూపాయల పెట్టుబడి ... ఆరుగాలం పడ్డ శ్రమ ... ఎన్నో కుటుంబ అవసరాలు ... అన్నీ వ్యాపారులు పెడుతున్న ఎల్’  కటింగులతో తుడుచు పెట్టుకు పోతున్నాయి. గంపేడాశతో వచ్చిన మిర్చి రైతు ఖమ్మంవ్యవసాయ మార్కెట్లో దళారుల సరికొత్త మోసానికి బలై పోతున్నాడు. కమీషన్ ఏజెంట్లు, కొనుగోలుదారులు చేస్తున్న ఈ నిలువు దోపిడీకి రైతు నోట మాట రావడం లేదు. సాధారణంగా తాలు, తేమ, మచ్చ వల్ల మార్కెట్లో మిర్చికి ఆశించిన ధర రాదు. ఇది అందరికీ తెలిసిందే. కానీ, బస్తాలపై కొనుగోలు దారులు పెడుతున్న ఎల్కటింగుల వల్ల ఇప్పుడు మిర్చి ధర పలకడం లేదు. మిర్చి బస్తాలపై వ్యాపారులు పెడుతున్న ఈ కోతలు రైతుల ఆశలను కత్తిరించేస్తున్నాయి. అసలే, ఈ ఏడాది మార్కెట్లో మిర్చికి ధర లేదు. గతేడు ఇదే సీజన్లో రూ. 20 వేలకు పైగా పలికిన మిర్చి ధర, ఇప్పుడు రూ.13 నుండు 14 వేల మధ్యే దోబూచులాడుతోంది. అది కూడా పూర్తిగా ఎండిన క్వాలిటీ మిర్చికే ఈ ధర పలుకుతుంది. మిర్చిలో ఏ మాత్రం తేడా వున్నా దాన్ని  రైతు తగనమ్ముకోవాల్సిందే. ఈ దారుణమైన పరిస్థితులు ఒక వైపు మిర్చి రైతును క్రుంగ దీస్తుంటే, మరో వైపు మార్కెట్లో వ్యాపారులు చేస్తున్న ఎల్ కటింగ్ మోసానికి తట్టుకో లేక పోతున్నాడు. సోమవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు దాదాపు లక్ష బస్తాల మిర్చి వచ్చింది. ఈ సీజన్లో ఇంత పెద్ద ఎత్తున మిర్చి ఎప్పుడూ రాలేదు. మార్కెట్ అంతా మిర్చి బస్తాలతో కిక్కిరిసి పోయింది. కొన్ని వాహనాలను మార్కెట్ బయట రోడ్డు పైనే ఆపారు. వాటి పైన ఉన్న మిర్చి బస్తాలను కూడా ఇంకా దింప లేదు. ఉమ్మడి నల్గొండ, కృష్ణ, ఖమ్మం జిల్లాల నుండి ఈ మిర్చి వచ్చింది. ఈ రోజు మిర్చి ఎక్కువగా వస్తుందన్న సమాచారంతో మార్కెట్ కమిటీ ఛైర్మన్ వై. హనుమంతరావు ఆదివారం అర్ధ రాత్రి వరకూ మార్కెట్లోనే వుండి అందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. మార్కెట్లో అడ్డుగా వున్న శిధిలాలను తొలగించి, మిర్చి దింపు కోవడానికి అనువుగా మార్కెట్ యార్డును శుబ్రం చేశారు. ఇంకా అధనంగా మిర్చిమార్కెట్ కు వచ్చినా పెట్టు కోవడానికి వీలుగా ప్రక్కనే వున్న ప్రత్తి మార్కెట్ ను కూడా సిద్దం చేశారు. ఇంత వరకు బాగానే వుంది. తెల్ల వారిన తర్వాతే, వ్యాపారుల అసలు మోసం వెలుగు చూసింది. కొనుగోళ్ళు ప్రారంభం కాగానే, రూ. 14 వేలకు జెండా పాట పాడారు. ఆ తర్వాత, తేమ లేని నాణ్యమైన క్వింటా మిర్చికి రూ. 13, 300 నుండి 13,700 వరకు ధర చెల్లించారు. క్వాలిటీ లేని మిర్చి రూ. 12, 000 వరకూ ధర పలికింది. ఒక రకంగా చూస్తే మంచి ధరే పలికిందనిపిస్తుంది. కానీ, ఒకే రైతు, ఒకే పొలం నుండి తెచ్చిన మొత్తం మిర్చిని ఇదే ధరకు కొనడం లేదు. ఒక రైతు నుండి కేవలం 30 నుండి 40 శాతం మిర్చినే కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు ముందు ఒక రైతుకు చెందిన మిర్చి మొత్తాన్ని బేరం చేస్తున్నారు. ఆ వెంటనే, కొన్ని మిర్చి బస్తాల పైన ఎల్ ఆకారంలో కట్ చేసి ఆ లాట్లో వున్న బస్తాలను వదిలేస్తున్నారు. అవి బాగ లేవన్న సాకుతో రిజెక్ట్ చేస్తున్నారు. ఈ ఎల్ ఆకారంలో కట్ చేసి వున్న మిర్చి బస్తాలను చూసిన మరి కొందరు వ్యాపారులు రూ. 10 వేల నుండి 12 వేలకు అడుగుతున్నారు. ముందు కొనుగోలు చేసిన వ్యాపారి ఎల్ మార్కు పెట్టి రిజెక్ట్ చేయడం వల్ల, ఆ తర్వాత వచ్చిన వ్యాపారులు తక్కువ ధరకు అడుగుతున్నారు. ఒకే రైతు, ఒకే పొలంలో పండించి తెచ్చిన మిర్చికి ఒకే ధర దక్కడం లేదు. అసలు ధరకు కొనేది కొంతైతే, రిజెక్ట్ చేసేది ఎక్కువైతుంది. ఈ పరిస్థితిలో ఏం చేయాలో రైతులకు పాలు పోవడం లేదు. కొంత మిర్చికి మంచి ధర వచ్చిందని ఆనంద పడాలో ? ఎక్కువ మిర్చిని తెగనమ్ముకోవాల్సి వచ్చిందని బాధ పాడాలో అర్ధం కావడం లేదు. చివరకు చేసేది లేక కొంత మంది రైతులు రిజెక్తైన మిర్చిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరికొంత మంది ధర వచ్చిన కాడికి అమ్ముకుంటున్నారు. వ్యాపారులు కుమ్మక్కై మార్కెట్లో ఈ కొత్త రకం మోసానికి తెర లేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు