పథకాలు సరే ... వీళ్ళ సంగతేంటి ?
- ముగిసిన 4 పథకాలపై క్షేత్ర స్థాయి సర్యే
- లబ్దిదారుల ఎంపికపై పలు అనుమానాలు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత
కార్డులు, ఇందిరమ్మ
ఇళ్ళ పథకాల క్షేత్ర స్థాయి సర్యే దాదాపు పూర్తయింది. ఈ సర్యేలో నాలుగు పథకాలకు లబ్దిదారులను
గుర్తించడంతో పాటు ముసాయిదా లబ్దిదారుల జాబితాను కూడా తయారు చేశారు. ఈ నెల 21
నుండి 24 వరకు గ్రామ సభలు నిర్వహించి లబ్దిదారులను ఫైనల్ చేస్తారు. 25 లోగా డేటా
ఎంట్రీ పూర్తి చేసి, జాబితాను గ్రామ పంచాయతీ కార్యాలయాల
నోటీసు బోర్డులో పెడతారు. గ్రామంలో ప్లేక్షీలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ నెల 26
నుండి పథకాలు అమలవుతాయి. అయితే, లబ్దిదారుల ఎంపికపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ
నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపికకు ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనలు కొంత మంది అర్హులకు
అవరోధంగా మారుతున్నాయని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ శాసన సభ్యులే
అంటున్నారు. మంచి పథకాలంటూనే నిబంధనలను సడలించాలని కోరుతున్నారు. మొన్న ఉప
ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఐదుగురు మంత్రులు తుమ్మల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్
రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్
రెడ్డి ఖమ్మంలో నిర్వహించిన ఈ నాలుగు పథకాల రివ్యూ మీటింగులో కూడా వీటిపై ఏకరువు
పెట్టారు.
ఏజన్సీలో పట్టా లేని గిరిజనేతరుల భూములకు భరోసా రాదా ?
భూ భారతి (ధరణి) పోర్టల్లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూమికి మాత్రమే, ప్రభుత్వం రైతు భరోసా క్రింద ఏడాదికి రూ. 12 వేలు చెల్లిస్తుంది. అలాగే ఇళ్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ భూములు, లేఅవుట్ చేసిన భూములు, నాలా కన్వర్షన్ చేసిన భూములు, మైనింగ్ చేస్తున్న భూములు, గోదాములు నిర్మించిన భూములు, వివిధ ప్రభుత్వ ప్రాజెక్టుల కోసంసేకరించిన భూములు, రాళ్ళు, రప్పలు, గుట్టలతో నిండి, సాగుకు అనువుగా లేని భూములను గుర్తించి, రైతు భరోసా నుండి తొలగిస్తారు. అయితే, భూ భారతి (ధరణి) పోర్టల్లో నమోదు కానీ, పట్టా లేని భూములు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 శాతం వరకు వున్నాయంటున్నారు. 1/70 చట్టం అమలవుతున్న ఏజన్సీ ప్రాంతంలో పట్టా లేకుండా సాగు చేస్తున్న భూములు ఎక్కువగా వున్నాయి. గిరిజనేతరులు వీటిని సాగు చేస్తున్నారు. ఇక్కడ అమలవుతున్న గిరిజన చట్టాల వల్ల ఈ సాగు భూములకు పట్టాలు ఇవ్వలేదు. కాబట్టి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ భూములకు రైతు భరోసా రాదు. వీటికి పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి రైతు భరోసా వర్తింపజేయాలని స్థానిక శాసన సభ్యులతో పాటు, గిరిజనేతర రైతులు కోరుతున్నారు.
అర్భన్ పేదలకు ఇందిరమ్మ భరోసా ఇవ్వరా ?
2023 -నుండి24 వరకు కనీసం20 రోజులు ఉపాధి హామీ పనులు చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఇందిరమ్మఆత్మీయ భరోసా క్రింద ప్రభుత్వం ఏడాదికి రూ.12,000 ఇస్తుంది. అయితే, అర్భన్ ఏరియాలో వున్న పేదలకు, కూలీలకు ఉపాధి హామీ పనులు చేసే అవకాశం లేదు. ఎందుకంటే, పట్టణ ప్రాంతంలో వున్న భూమి లేని పేదలకు కేంద్ర ప్రభుత్వం జాబ్ కార్డులు ఇవ్వ లేదు. ఫలితంగా వీరికి ఉపాధి పనులు చేసే అవకాశం లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా క్రింద లబ్ది పొందాలంటే, ఖచ్చితంగా 20 రోజులు ఉపాధి పనులు చేసి ఉండాలన్న నిబంధన పెట్టింది. అందువల్ల, జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు, కారోరేషన్ల పరిధిలో వున్న భూమి లేని పేదలు, కూలీలకు ఈ పథకం వర్తించదు. అదే సందర్భంలో అర్భన్ ఏరియాలో పట్టా వున్న వ్యవసాయ భూములకు ప్రభుత్వం రైతు భరోసా ఇస్తుంది. మరి అదే ప్రాంతంలో వున్న భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఎందుకివ్వరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అలాగే, గ్రామీణ ప్రాంతంలో కూడా జాబ్ కార్డు లేని వ్యయసాయ కూలీలున్నారు. వారికి భూమి లేక పోయినా, జాబ్ కార్డు లేక పోవడం వల్ల ప్రభుత్వం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వదు. 20 రోజుల ఉపాధి హామీ పని దినాలతో ఈ పథకాన్ని లింకు చేయడం వల్ల చాలా మంది భూమి లేని పేదలు లబ్ది పొందే అవకాశం లేదు.
ఇందిరమ్మ ఇళ్లకు వాళ్ళు అర్హులు కాదా ?
ఇందిరమ్మ ఇళ్ల పథకానికి జీఓ నంబర్ 7 ప్రకారం, దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న గృహాలు, ఇళ్లు లేని వారు, పూరిగుడిసెలు ఉన్నవారు, అద్దె ఇళ్లలో నివాసం ఉన్నవారు, నిర్మాణానికి స్థలం ఉన్నవారు అర్హులు. వారిలో మట్టి గోడలు, పైకప్పు లేని గృహాలు, వితంతువులకు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పారిశుద్ధ్య కార్మికులు, దివ్యాంగులకు మొదటి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తారు. అయితే, ఇక్కడ కూడా ప్రధానంగా సింగరేణి, ఏజన్సీ ప్రాంతంలోని గిరిజనేతర పేదలు అనర్హులయ్యే అవకాశముంది. అనేక సంత్సరాలుగా సింగరేణి, అటవీ భూముల్లో గుడిసెలు వేసుకొని వుంటున్న వారు అనేక మంది వున్నారు. ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులు లేవు. వారికి కూడా పొజిషన్ సర్టిఫికెట్స్ ఇచ్చి ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని ఆ ప్రాంత గిరిజనేతరులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే, ఇరవై ఏళ్ళ క్రితం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ళ స్థానంలో కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించాలని, నిర్మాణం చేపట్టి, ఆగి పోయిన ఇందిరమ్మ ఇళ్లకూ ఈ పథకాన్ని వర్తింప జేయాలని పలువురు కోరుతున్నారు.
సింగరేణి పెన్షన్ దారులకు రేషన్ కార్డులు రావా ?
దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారికి కొత్త ఆహార భద్రత కార్డుల(రేషన్ కార్డులు) పథకంలో భాగంగా కొత్త కార్డులను అందజేస్తారు. ఈ కార్డులు పొందాలంటే, పట్టణ ప్రాంతంలో రూ. 1.5 లక్షలు, గ్రామీణ ప్రాంతంలో రూ. 2 లక్షలకు మించి ఆదాయం ఉండ కూడదు. అంతే కాకుండా, పెన్షన్ దారులకు కూడా ఈ పథకం వర్తించాడు. చిన్నా, చితక ఉద్యోగాలు చేసి పదవీ విరమణ పొందిన వారుఉమ్మడి ఖమ్మం జిల్లాలో చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో పని చేసి రిటైరైన వారు ఎక్కువగా వున్నారు. వీరికి పెన్షన్ వచ్చినా, నెలకు 2, 3 వేల రూపాయలకు మించి రాదు. వీరంతా దారిద్ర్య రేఖకు దిగువనే ఉన్నారు. కానీ, నిబంధనల ప్రకారం, పెన్షన్ దారుడు కావడం వల్ల, తెల్ల రేషన్ కార్డు రాదు. ఆరోగ్య శ్రీ తో పాటు ఇతర ప్రభుత్వ పథకాలను కూడా పొంద లేరు. అందువల్ల, వీరికి కూడా కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఎమ్మేల్యేలు సైతం ఈ నాలుగు పథకాల లబ్దిదారుల ఎంపిక పై ఇప్పటికే ప్రభుత్వానికి పలు సూచనలు చేశారు. మరి ప్రభుత్వం పట్టించు కుంటుందా ? లేక పెడ చెవినపెడుతుందో ? ఈ నెల 26న తెలుస్తుంది.
Comments
Post a Comment