పులకించిన భద్రగిరి ...

Uttara Dwara Darshanam in Bhadrachalam


  • అత్యంత వైభవంగా వైకుంట రాముని ఉత్తర ద్వార దర్శనం
  • గరుడ వాహనంపై మహా విష్ణువు అవతారంలో సాక్షాత్కారం
  • అష్టోత్తర శత నామార్చనతో మారు మ్రోగిన భద్రాద్రి పుణ్య క్షేత్రం

దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రగిరి పులకించింది. పుష్య మాసపు చల్లని వీచికలు ఆధ్యాత్మిక సుగంధాలను మోసు కొచ్చాయి. ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శుక్రవారం తెల్లవారు జామున అష్టోత్తర శత నామార్చన ప్రతిధ్వనిస్తున్న వేళ, వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య భద్రాద్రి రామయ్య గరుడ వాహనంపై మహా విష్ణువు అవతారంలో దర్శనమిచ్చాడు. పసిడి వర్ణ సుందరాలంకృత తలుపులు తెరుచు కోవడంతో, హేమంత మేఘంలా అలుముకున్న ధూపంలో భక్త బాంధవుడు ఉత్తర ద్వారంలో సాక్షాత్కరించాడు.  భక్తుల రామ నామ స్మరణతో భద్రగిరి మారు మ్రోగింది. ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష ఆరాధన నిర్వహించారు. శ్రీరామ షడక్షరీ మంత్ర సంపుటిత అష్టోత్తర శత నామార్చనను అత్యంత వైభవంగా జరిపారు. చతుర్వేదాలు, ద్రవిడ, ప్రబంధాలు, ఇతిహాసాలు, శరణాగతి గర్వ గరుడ దండకం, భక్త రామదాసు రచించిన దాశరథి శతకం పఠించారు. వైకుంఠ రామునికి అష్టోత్తర శత హారతిని (108 వత్తుల హారతి) సమర్పించారు. స్థానాచార్యులు భక్తులకు ముక్కోటి ఏకాదశి విశిష్టతను వివరించారు. భక్తరామదాసు కాలం నుంచి వస్తున్న సంప్రదాయం ప్రకారం భద్రాచలం తహసీల్దార్ శ్రీని వాస్ మూల వరులకు స్నపనం నిర్వహించారు. ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిచ్చిన అనంతరం వైకుంఠ రాముడు తిరు వీధి సేవకు తరలివెళ్లారు. చలువ చప్పర వాహనంపై పెరియాళ్వార్, నమ్మాళ్వార్, మరో వాహనంపై అందా కమ్మ వారు, హనుమత్ వాహనంపై లక్ష్మణస్వామి, గజవాహనంపై సీతమ్మ వారు, గరుడ వాహనంపై శ్రీరామచంద్రమూర్తుల తిరువీధి సేవ సాగింది. మేళతాళాలు, భాజా భజంత్రీలు, వేదమం త్రోచ్చారణలతో మాడ వీధులు మారు మ్రోగి పోయాయి. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ముక్కోటి ఏకాదశి అత్యంత పవిత్రమైంది. ఈ సమయంలో శ్రీస్వామి వారిని ఉత్తర ద్వారంలో దర్శిస్తే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. ఉత్తర ద్వారంలో స్వామి వారి దర్శనం చేసుకోవడం వల్ల అంతా శుభం కలుగుతుందని కూడా విశ్వసిస్తారు. భద్రాచలం దేవస్థానం ఆధ్వర్యంలో సాగుతున్న అధ్యానోయనోత్సవాల్లో ఈ  వైకుంఠ ఏకాదశే అత్యంత కీలకమైన ఘట్టం. ఈ మహత్తర ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, చేనేత, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురి రెడ్డి, మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం, పినపాక, ఇల్లందు నియోజక వర్గాల శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లుకోరం కనకయ్య, డీసీఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వికారాబాద్ కలెక్టర్ ప్రతిక్ జైన్, ఐటిడిఎ పిఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ దంపతులు, ఎఎస్పీ విక్రాంత్ సింగ్, దేవస్థానం ఈ ఓ రమాదేవి తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.


Thummala Nagewsara Rao at Bhadrachalam


Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు