నాయనానందకరంగా రాములోరి నదీ విహారం

Sri Sitaramachandraswami Theppothsavam in Bhadrachalam


  • గోదారి మురిసేలా భద్రాద్రి రాముని తెప్పోత్సవం
  • పోటెత్తిన భక్తులతో జన సంద్రంగా మారిన నదీ తీరం
  • నేడు కన్నుల పండువలా వైకుంఠ ద్వార దర్శనం  

జై జై రామ్... సీతారామ్ అంటూ భక్తుల చేసిన జయ జయ ద్వానాల మధ్య భద్రాద్రిలో సీతా లక్ష్మణ సమేత శ్రీ సీతారామచంద్ర స్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి అంగ రంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోఛ్చారణలు పవిత్ర గోదావరి నదీ తీరంలో మార్మోగుతుండగా రామయ్య హంస వాహనంపై వేం చేసి భక్తులను పరవశింప జేశారు. ముక్కోటి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇప్పటి వరకు పలు అవతారాల్లో దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించిన శ్రీ సీతారామచద్ర స్వామి, గోదావరి నదీ తీరంలో సీతమ్మ వారితో కలిసి జల విహారం చేశారు. ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంలో ఐదు సార్లు నదిలో విహరించారు. గోదారమ్మ మురిసి పోయేలా వృత్తాకారంలో రామయ్య నదీ విహారం సాగింది. విద్యుత్‌ దీపాల అలంకరణతో కన్నుల పండువగా సాగిన ఈ రామయ్య తెప్పోత్సవాన్ని చూసి భక్తులు తరించి పోయారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, పూజారుల ప్రత్యేక పూజలతో భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణా సంచా కాల్చి ఆనందంతో ఉప్పొంగి పోయారు. అంబరాన్నంటిన తారాజువ్వలు చూపరులకు కను విందు చేశాయి. రామయ్య నదీ విహారాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో నదీ తీరం జన సంద్రంగా మారింది. తెప్పోత్సవానికి ముందు స్వామి వారికి ప్రత్యేక తిరుమంజనం నిర్వహించి, అనంతరం తిరుమంగయ్ ఆల్వార్ పరమ పదోత్సవం గావించారు. ఆ తర్వాత, ప్రధాన ఆలయం నుండి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల జయ జయ ద్వానాల మధ్య రాములోరు పల్లకిలో నదీ తీరానికి బయలు దేరారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన హంస వాహనంపై శ్రీ స్వామి వారు వేం చేయగా, ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, గోదావరికి హారతులిచ్చారు. ఐదు సార్లు వృత్తాకారంలో నదీ విహారం చేసిన తర్వాత, తిరిగి రామయ్య ప్రధాన ఆలయానికి చేరుకున్నారు. ఈ తెప్పోత్సవ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, భద్రాచలం ఐటీడీఏ పీఓబి. రాహుల్, ఏఎస్పీ విక్రాంత్ కుమార్సింగ్, భద్రాచలం రామాలయ ఈఓ రమాదేవి, ఆర్డీఓ దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

Janechcha

Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు