అడవిలో అలజడి ... వణుకుతున్న ఏజన్సీ
- విరామం లేని కూంబింగ్, నిరంతర నిఘా
- బయ బ్రాంతులకు గురవుతున్న స్థానికులు
తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన చత్తీష్ ఘడ్ లో జరుగుతున్న వరుస ఎన్ కౌంటర్లతో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని
ఏజెన్సీ గ్రామాలు వణికి పోతున్నాయి. విరామం లేని కూంబింగులు, పోలీసుల నిరంతర నిఘా
మధ్య ప్రజలు బిక్కు బిక్కుమంటూ కాలం వెళ్ల దీస్తున్నారు. అడవిలో ఏమాత్రం అలజడైనా స్థానికులు
బయాందోళనలకు గురవుతున్నారు. జిల్లాలోని చర్ల మండల సరిహద్దు ప్రాంతమైన నార్త్ అబుజ్మడ్ లో శనివారం మావోయిస్టులు, పోలీసుల మధ్య మరో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. చత్తీష్ ఘడ్ లోని నారాయణ పూర్, కంకేర్ జిల్లాల మధ్య ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఘటనా
స్థలంలో ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఐదుగురు యూనిఫాం
ధరించిన మావోయిస్టుల మృత దేహాలు లభ్యమయ్యాయి. నక్సలైట్ల నుంచి ఇన్సాస్, ఎస్ ఎల్ ఆర్ రైఫిల్స్
తో పాటు పెద్ద ఎత్తున ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్ కౌంటర్లో గాయపడ్డ
ఇద్దరు సైనికులను మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్, బీఎస్ఎఫ్ సంయుక్త
పోలీసు బృందాలు రెండు రోజులుగా ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపడుతున్నాయి. శనివారం
ఉదయం మావోయిస్టులు తారస పడడంతో పోలీసుల మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. సంఘటన
జరిగిన ప్రాంతం జిల్లాలోని చర్ల మండలానికి దగ్గర కావడంతో స్థానిక పోలీసులు
అప్రమతమయ్యారు. కూంబింగును ముమ్మరం చేశారు. చెక్ పోస్టుల వద్ద నిఘా పెంచి వాహనాలను
తనికీ చేస్తున్నారు. అనుమానితుల కదిలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. కాగా, మహారాష్ట్ర, చత్తీష్ ఘడ్, తెలంగాణ, ఆంద్ర ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు
చెందిన డీజీపీలు ఈ మధ్యే అత్యవసరంగా భద్రాచలంలో సమావేశమయ్యారు. మావోయిస్టులను2026
మార్చి 31 నాటికి పూర్తిగా కట్టడి చేయడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
అత్యంత రహస్యంగా ఈ సమావేశం జరిగింది. ఇది జరిగిన వారం లోపే ఈ ఎన్ కౌంటర్ చోటు
చేసుకుంది. అయితే, ఇప్పటికే
జిల్లా పోలీసులు,
మావోయిస్టుల కార్యకలాపాలను అరికట్టేందుకు బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. మావోయిస్టు
ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడంతో పాటు విద్య, ఆరోగ్య సదుపాయాలను
ఆదివాసీలకు అందుబాటులోకి తెస్తున్నారు. మరో వైపు అజ్ఞాతంలో వున్న మావోయిస్టులను జన
జీవన స్రవంతిలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు మావోయిస్టుల కుటుంబ సభ్యులకు
కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్ల పరిధిలో కమ్యూనిటీ
పోలీసింగ్ ను ప్రోచ్చహిస్తున్నారు. గ్రామాల్లోని యువత అసాంఘిక కార్యకలాపాల వైపు
వెళ్ల కుండా, వారి
అభిరుచి మేరకు విద్య ఉపాధి మార్గాల వైపు నడిపించేందుకు చర్యలు చేపట్టారు. దీని
వల్ల మావోల రిక్రూట్మెంటును పూర్తిగా కట్టడి చేయొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆదేశాల మేరకు, పోలీసులు మావోయిస్టుల కార్యకలాపాలు అరికట్టేందుకు చర్యలు
చేపడుతూనే,
ఏజన్సీ గ్రామాలలో అభివృద్ది కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే, అటు మావోయిస్టుల
కదలికలు, ఇటు పోలీసుల
కూంబింగులతో స్థానిక ప్రజలు మాత్రం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
Comments
Post a Comment