అదానీ, రేవంత్ అంతర్గత ఒప్పందంపై విచారణ జరపాలి
- బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్
- ఈ వ్యవహారంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి
- పోలీసులు అక్రమ కేసులు పెడితే చర్యలు తప్పవు
- 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ నేతలు క్షమాపణ చెప్పాలి
అదానితో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చేసుకున్న అంతర్గత ఒప్పందంపై విచారణ జరపాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అమెరికాలో ఆదానీపై కేసు నమోదైతే, అదానితో పాటు అతను లంచం ఇచ్చిన వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలన్న డిమాండ్ వినిపిస్తోందన్నారు. మరి, రేవంత రెడ్డికి అదానీ లోపల వేరే ఇచ్చి, బయట వేరే ఇచ్చిండని, దీనిపై కూడా విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అదానీని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ, అదానీ దగ్గర 100 కోట్ల రూపాయలు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలో చెప్పాలన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలలోని ప్రొద్దుటూరులో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అదానీ విషయంలో డిల్లీ నాయకులొకటీ, గల్లీ నాయకులు మరొకటి మాట్లాడడం విడ్డూరంగా వుందన్నారు. రాహుల్ గాంధీ అదానీని అరెస్టు చేయాలంటే, రేవంత్ రెడ్డి మాత్రం అదానీకి మంగళ హారతులు పడుతున్నారని. ఎదురెళ్ళి అంతర్గత ఒప్పందాలు చేసుకుంటున్నారని విమర్శించారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా వున్నంత కాలం అదానీని రాష్ట్రంలో అడుగు పెట్ట నియ్యలేదని, ఒక్క రూపాయి కూడా తీసుకో లేదని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదానీ పట్ల కేసీఆర్ కు క్లారిటీ వుండ బట్టే అతన్ని దూరం పెట్టిండని చెప్పారు. ఎవరి పరిపాలనా దక్షత ఏంటో, పాలేంటో నీళ్ళేంటో, ఇప్పుడు ప్రజలకు అర్ధమవుతోందన్నారు. ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్, ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయ లేదని విమర్శించారు. హామీలన్నీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి, 350 రోజులు గడచినా అమలు చేయనందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్పు, మార్పు అన్నారు, ఏం మార్పోచ్చిందని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. కాక పోతే, వచ్చిన మార్పల్లా ... రైతుల కొచ్చే రైతు బంధు రావట్లేదని, బతుకమ్మ చీరేలు ఇవ్వడం లేదని, కేసీఆర్, న్యూట్రీషన్ కిట్లు అందడం లేదని, దళిత, బీసీ బంధులు బంధయ్యాయని, గొల్ల కురుమలకు గొర్రె పిల్లలు కరువయ్యాయని, 24 గంటల కరెంట్ జాడే లేదని, ఫించన్లు పెంచ లేదని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల్లో మహిళలకు నెలకు రూ. 2, 500 ఇస్తామని చెప్పిన మొదటి హామీనే ఇంత వరకూ నెర వేర్చ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుండి ఇప్పటి వరకూ మహిళలకు రూ. 27, 500 చెల్లించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 6 లక్షల పెళ్ళిళ్ళు అయ్యాయని, పెళ్ళికి ఒక గ్రాము చొప్పున ప్రభుత్వం అడ పడుచులకు 6 లక్షల తులాల బంగారం బాకీ పడిందన్నారు. చదువు కొనే ఆడ పిల్లలకు స్కూటీలిస్తామని, ఇంత వరకూ ఇవ్వ లేదన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని, ట్రిప్పులు బస్సులు తగ్గించారని, ఇచ్చిన హామీలను అమలు చేసే పద్దతి ఇదేనా అని హరీష్ రావు ప్రశ్నించారు. బాండ్ పేపర్ల మీద హామీలిచ్చి, మహిళలను మోసం చేయడం కరెక్టెనా ? అని నిలదీశారు. దీనికి రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి రోజూ తిట్టడం, దేవుళ్ళ మీద ఓట్లు పెట్టు కోవడం తప్ప ప్రజలకు చేస్తున్నదని ఏమీ లేదన్నారు. కొందరు పోలీసు అధికారులు తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వడ్డీతో సహ చెల్లిస్తామని హెచ్చరించారు. అధికారులు చట్టానికి లోబడి, రాజ్యాంగ బద్దంగా నడుచు కోవాలి తప్ప, అక్రమ కేసులు బనాయించి, వేధింపులకు గురి చేస్తే చర్యలు తప్పవన్నారు. అంతకు ముందు హరీష్ రావు, చింతకాని మండలంలోని లచ్చ గూడెంలో ఇటీవల కరెంట్ షాక్ తో మృతి చెందిన రైతు గూని ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించారు. ప్రసాద్ చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రొద్దుటూరులో అరెస్ట్ అయి ఈ మధ్యే జైలు నుండి బయటకు వచ్చిన పార్టీ మండల అధ్యక్షులు పెంట్యాల పుల్లయ్యను పరామర్శించారు. ఈ పర్యటనలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తాతా మధు సూధన్, రాజ్య సభ సభ్యులు వద్ది రాజు రవి చంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వర రావు, నాయకులు రాకేశ్ రెడ్డి, మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్తదితరులు పాల్గొన్నారు.
Comments
Post a Comment