కారు స్పీడు పెరిగేనా ?

BRS Symbol


BRS News

అసెంబ్లీ ఎన్నికల తర్వాత, చతికల పడ్డ బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెల్లగా నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తోంది. వివిధ కేసుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు జైళ్ళకు వెళుతున్నా, జిల్లా నాయకత్వం మాత్రం కార్యకర్తలు అధైర్య పడకుండా అండగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు జిల్లాల్లో కలియదిరుగుతూ క్యాడర్లో జవ సత్వాలు నింపే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీఆర్ఎస్ భద్రాచలంలో మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత, అక్కడ గెలిచిన తెల్లం వెంకట్రావు కూడా కాంగ్రెస్ లో చేరారు. పలువురు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ నుండి వెళ్ళి పోయారు. పార్టీ నాయకుల నామినేటెడ్ పోస్టులు రద్దయ్యాయి. పైగా కార్యకర్తలపై కేసులు నమోదై పార్టీ క్యాడర్ డీలా పడింది. అయితే, ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత వెనుక పడటం, సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాల్లో లోటు పాట్లు, రైతు భరోసా క్రింది రైతులకు పెట్టుబడి సాయం ఇంకా అందక పోవడం, రైతు రుణ మాఫీలో ఎదురైన ఇబ్బందులు బీఆర్ఎస్ నేతలకు ఆయుధంగా మారాయి. దొరికిన ఏ అవకాశాన్నీ వదల కుండా రాష్ట్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. సమస్యలపై ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందిస్తూ, అవసరమైన చోట్ల ఆందోళనలు చేస్తున్నారు. మాజీ మంత్రి హారీష్ రావు తరచూ జిల్లాలో పర్యటిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన ఇటీవల ఖమ్మంలోని మున్నేరు ముపు ప్రాంతాల్లో పర్యటించి, బాధితులకు నిత్యావసరాలను పంపిణీ చేశారు. ప్రత్యేకంగా సిద్ది పేట నుండి కిట్లను లారీల్లో ఇక్కడకు తీసుకొచ్చి మరీ అంద జేశారు. బాధితులను హరీష్ రావు పరామర్శిస్తున్న సమయంలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై రాళ్ళ దాడి కూడా జరిగింది. అయినా, వెనక్కు తగ్గకుండా హరీష్ రావు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై మరింత ఫోకస్ పెట్టారు. జనవరిలో జరిగే పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే నేడు, రేపు జిల్లాలో హరీష్ రావు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఆయన ఖమ్మం మార్కెట్ యార్డును సందర్శించడంతో పాటు. వివిధ కేసుల్లో జైళ్ళకు వెళ్ళిన నాయకుల ఇళ్ళకు వెళ్ళి పరామర్శిస్తారు. హరీష్ రావు పర్యటన కార్యకర్తలు, నాయకుల్లో మరింత ధైర్యం నింపుతుందని జిల్లా నాయకత్వం భావిస్తోంది. మరో వైపు, పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతల మధ్య ఆధిపత్య పోరును అవకాశంగా మలుచు కోవాలని బీఆర్ఎస్ నాయకత్వం యోచిస్తోంది. కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ లోని కొత్త, పాత నేతల మధ్య విబేధాలు బగ్గుమంటున్నాయి. ఇరు వర్గాల నేతలు పంచాయితీ ఎన్నికల్లో పోటీకి సై అంటున్నారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ కు అక్కడక్కడ కొంత నష్టం జరిగిగే అవకాశముంది. దీన్ని అదునుగా భావించి బీఆర్ఎస్ పుంజు కోవాలని చూస్తోంది. ఇప్పటికే, పంచాయితీ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నియోజక వర్గ, మండల స్థాయి సమావేశాలు మొదలు పెట్టారు. పరామర్శలు, ఆందోళనలతో కార్యకర్తలు, ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మేల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కొండబాల కోటేశ్వర రావు, వనమా వేంకటేశ్వర రావు, మెచ్చా నాగేశ్వర రావు, రేగా కాంతారావు, బానోత్ హరి ప్రియ, మాజీ జడ్పీ ఛైర్మన్ లింగాల కమల్ రాజ్ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, మాజీ ఎంపీ నామ నాగేశ్వర రావు అవకాశం దొరికినప్పుడల్లా జిల్లాలో పర్యటిస్తున్నారు. అయితే, కేవలం పర్యటనలతోనే జిల్లాలో బలంగా వున్న కాంగ్రెస్ ను ఓడించడం సాధ్యం కాక పోవొచ్చు. అందుకు వ్యూహం ఎత్తు గడలు, పాలకుల వైఫల్యాలను ఎప్పటి కప్పుడు ఎండ గట్టే సమయ స్పూర్తి కావాలి. ముఖ్యంగా ఎప్పుడూ పార్టీ కార్యకర్తలకు అండగా వుంటామన్న  ధైర్యాన్ని ఇవ్వాలి. అప్పుడే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కారు స్పీడు పెరిగే అవకాశముంది.  

Janechcha


Comments

Popular posts from this blog

దాడి చేసింది వాళ్ళే ... మేం కాదు ... ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్

అది రాములోరి భూమి కాదు ... గ్రామ కంఠానిది

నేను కొత్తగూడెంలో పోటీ చేయాలని మీకూ వుంది ... నాకూ వుంది ... కానీ ... అంటూ పొంగులేటి సంచలన వ్యాఖ్యలు