

ప్రస్తుతం ఖమ్మం మున్సిపల్కార్పోరేషన్ అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ నగర వాసులకు శాపంగా మారింది. దాదాపు 20 డివిజన్ల పరిధిలోని
ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నిర్మాణ అనుమతులకు, ఎల్‌ఆర్‌ఎస్ ధ్రువ పత్రాల జారీకి తీవ్ర ఇబ్బందులు
ఎదురవుతున్నాయి. ఎప్పుడో ప్రతిపాదించిన రహదారులు రద్దయినా, ప్రస్తుతం అమలు చేస్తున్న మాస్టర్ ప్లాన్ లో
వున్నాయి. వేలాది ఇళ్ళు, స్థలాల మీదుగా 80 అడుగులు, 180 అడుగుల రోడ్లు
పోతున్నట్టు మాస్టర్ ప్లాన్ సూచిస్తోంది. నిజానికీ ఆ రహదారులు లేవు. కానీ. అవి
మాస్టర్ ప్లాన్లో వుండడం వల్ల, మున్సిపల్ అధికారులు వాటి స్థానంలో నిర్మాణాలకు అనుమతి ఇవ్వడం లేదు. ఖమ్మం
నగరం ఇంతగా విస్తరించక ముందు, ఖమ్మం చుట్టూ 180 అడుగుల రింగు రోడ్డు నిర్మించాలని ప్రతి పాదించారు. కానీ ఆ తర్వాత, ఆ రింగు రోడ్డు
రద్దయింది. అయినా, ఆ రోడ్డు ప్రస్తుతం అమలవుతున్న మాస్టర్ ప్లాన్ లో వుంది. ఇప్పుడు నగరం
విస్తరించి, ఆ ప్రతిపాదిత రింగు రోడ్డు నగరం మధ్యలోకి వచ్చింది. వాస్తవానికి ఆ రింగు
రోడ్డు లేనే లేదు. అది కేవలం ప్రతిపాదనలకే పరిమితమై, ఎప్పుడో రద్దయింది. కానీ, మాస్టర్ ప్లాన్లో చూపించడం వల్ల, ఆ రోడ్డు ప్రతి పాదన
వున్న చోట మున్సిపల్ అధికార్లు పర్మీషన్లు ఇవ్వడం లేదు. ఈ రోడ్డు పరిధిలో ఇప్పుడు
సుమారు 10 వేల ప్లాట్లు, ఇళ్ళు, బహుళ అంతస్తుల భవనాలు
వున్నాయి. వీటికి సంబంధించి దాదాపు 4 వేలకు పైగా దరఖాస్తులు పెండింగులో వున్నాయంటున్నారు. దీంతో పాటు పలు
డివిజన్లలో లేని రోడ్లు మాస్టర్ ప్లాన్ లో కనిపిస్తున్నాయి. మున్నేరు బఫర్ జోన్
ఎక్కడ వరకు వుందనే విషయంలో స్పష్టత లేదు. ఖానాపురం చెరువుకు సంబంధించిన బఫర్ జోన్
ప్రాంతాలు గందర గోళంగా వున్నాయి. చెరువు దగ్గర నిర్మాణాలకు అనుమతులు ఇస్తూ, చెరువుకు దూరంగా ఉన్న
ప్రాంతాన్ని బఫర్ జోన్‌గా గుర్తించి అనుమతులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అంతే
కాకుండా ప్రస్తుత మాస్టర్ ప్లాన్ లో కొన్ని నివాస ప్రాంతాలు, వాణిజ్య ప్రాంతాలుగా
నమోదయ్యాయి. మరి కొన్ని చోట్ల సాగర్ కాలువలు వున్నాయంటున్నారు. ఇలా అనేక రకాల
ఇబ్బందులతో పర్మీషన్లు రాక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్
అధికారులు ఫీల్డ్ విజిట్ చేయకుండా నాలుగు గోడల మధ్య కూర్చొని ప్లాన్ తయారు చేయడం
వల్లే ఇలా అస్థవ్యస్థంగా మారిందన్న ఆరోపణలున్నాయి. ప్రజల ఒత్తిడి మేరకు ఈ మాస్టర్
ప్లాన్ను రద్దు చేయాలని గతంలో మున్సిపల్ పాలక వర్గం ఒక తీర్మానం కూడా చేసింది.
అయినా, ఇంకా అదే మాస్టర్
ప్లాన్ అమలవుతోంది.
ఆమోదం పొందని సుడా కొత్త మాస్టర్ ప్లాన్
2017 అక్టోబర్ 24న ఖమ్మం కార్పోరేషన్ తో పాటు 7 మండలాల్లోని 46 గ్రామ పంచాయతీలను కలిపి స్థంభాద్రి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీని (
సుడా ) ఏర్పాటు చేశారు. అనంతరం, సుడా పరిధిలోని ఖమ్మం కార్పోరేషన్ తో పాటు, వైరా, ఖమ్మం రూరల్, కూసుమంచి, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథ పాలెం మండలాల్లోని 46 గ్రామ పంచాయతీలకు ఒక మాస్టర్‌ప్లాన్ రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు
చేస్తున్న అమృత్ పథకంలో భాగంగా స్టెమ్ అనే సంస్థ దీన్ని తయారు చేసింది. ఆయా
ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ ప్లాన్ ను సిద్ధం చేశారు. రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రీయల్, రిక్రియేషన్, పబ్లిక్, సెమి పబ్లిక్ జోన్లు, రోడ్లు, వాటి వెడల్పు, చెరువులు, కాలువలు, వాగుల వివరాలను
మాస్టర్ ప్లాన్‌లో పొందు పర్చారు. జీఐఎస్ బేస్‌తో గూగుల్ మ్యాప్ ఆధారంగా వివిధ
శాఖల నుంచి సేకరించిన సమాచారంతో ముసాయిదా మాస్టర్‌ప్లాన్ తయారైంది. ప్రస్తుతం
సుడా పరిధిలో 7,18,054 జనాభా ఉండగా, రాబోయే 20 ఏళ్లలో ఈ జనాభా 13,70,145 కు పెరుగుతుందన్న అంచనాతో దీనిని రూపొందించారు. . ప్రస్తుతం ఖమ్మం నగర
పాలక సంస్థ ఉపయోగిస్తున్న మాస్టర్ ప్లాన్ 33 చదరపు కిలోమీటర్ల వైశాల్యానికి మాత్రమే
పరిమితమైంది. ఇది కార్పోరేషన్ గా మారక ముందు ఖమ్మంమున్సిపాలిటీ పరిధి. కార్పోరేషన్
గా మారిన తరువాత, విలీన గ్రామాలతో కలుపుకొని దీని విస్తీర్ణం 126.45 చదరపు కిలో మీటర్లు. ఇప్పుడు అమలవుతున్న మాస్టర్ ప్లాన్ కనీసం ఖమ్మం
కార్పోరేషన్ మొత్తాన్ని కూడా కవర్ చేయడం లేదు. పైగా, ఈ మాస్టర్ ప్లాన్ లో కొన్ని రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్ జోన్లు, రోడ్ల వివరాలు
సక్రమంగా లేవనే ఆరోపణలు ఉన్నాయి. అయితే, వాటన్నింటిని పరిష్కరించేలా కొత్త మాస్టర్ ప్లాన్ తయారైంది. స్టేక్
హోల్డర్ల మీటింగ్ పెట్టి ఈ మాస్టర్ ప్లాన్ పై అందరి అభిప్రాయాలు కూడా
తీసుకున్నారు. ఇక ప్రభుత్వం అనుమతివ్వడమే ఆలస్యం, కొత్త మాస్టర్ అమలవుతుందన్నారు. ఇదిగో అదిగో
అన్నారు. ఇంత వరకు అతీ లేదు, గతీ లేదు. ఎప్పుడో ఐదారేళ్ళ క్రితంమే ఈ మాస్టర్ ప్లాన్ అమలు కావాలి. కరోనా
పేరు చెప్పి కొంత కాలం వాయిదా వేశారు. ఆ తర్వాత కూడా పనులు వేగంగా జరగ లేదు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారి పోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపు 11 నెల్లయింది. కానీ, ఈ మాస్టర్ ప్లాన్
గురించి ఎవరూ సీరియస్ గా పట్టించుకోవడం లేదు. ప్రజులు మాత్రం పాత మాస్టర్ ప్లాన్
తో ఇబ్బందులు పడుతూనే వున్నారు.
మంత్రులు దృష్టి పెడితేనే సమస్యకు పరిష్కారం
ఇదిలా వుండగా సుడాను విస్తరిస్తూ
ప్రభుత్వంఇటీవల ఒక జీవోను జారీ చేసింది. దీని ద్వారా మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలతో పాటు 18 మండలాల్లోని 279 గ్రామ పంచాయితీలను
కొత్తగా సుడాలో కలిపారు. ఇప్పుడు వీటిని కలుపుతూ కూడా సుడా మరో మాస్టర్ ప్లాన్
తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే, అప్పటి వరకు ఖమ్మం కార్పోరేషన్ మాస్టర్ ప్లాన్ పరిస్థితి ఏంటి ? తయారైన మాస్టర్
ప్లాన్ను ఆమోదించి అమలు చేస్తారా ? లేక, మరో కొత్త మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తారా ? అన్న అనుమానం నగర వాసులను వేధిస్తోంది. ఒక వేళ మరో
మాస్టర్ ప్లాన్ తయారు చేస్తే, ఇప్పుడున్న పాత మాస్టర్ ప్లాన్ తోనే మరి కొంత కాలం సరిపెట్టుకోవాల్సి
వస్తుంది. అప్పటి వరకూ ప్రజలకు ఇబ్బందులుకూడా తప్పవు. రాష్ట్ర మంత్రులు జ్యోక్యం
చేసుకొని కొత్త మాస్టర్ ప్లాన్ కు ఆమోద ముద్ర వేస్తే తప్ప, ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ముఖ్యంగా మంత్రి
తుమ్మల నాగేశ్వర రావు కొత్త మాస్టర్ ప్లాన్ ఆమోదంపై దృష్టి సారించాలని స్థానికులు
కోరుతున్నారు.
Comments
Post a Comment