కాంగ్రెస్లో ‘ కొత్త ’ పంచాయితీ

Congress


  • జిల్లాలో నివురు గప్పిన నిప్పులా ఆధిపత్య పోరు
  • పాత, కొత్త నేతల మధ్య పొడ చూపుతున్న విబేధాలు
  • సర్పంచ్ అభ్యర్ధులుగా పలు గ్రామాల్లో సెల్ఫ్ డిక్లరేషన్లు  
  • గ్రామ పంచాయితీ ఎన్నికల్లో తల నొప్పిగా మారే అవకాశం

కాంగ్రెస్లో కొత్త పంచాయితీ మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాత, కొత్త కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత పోరు సాగుతోంది. కొంత కాలంగా ఈ పోరు చడీ చప్పుడు లేకుండా నడుస్తున్నప్పటికీ, తరచూ అక్కడక్కడ వర్గ విబేధాలు పొడ చూపుతూనే వున్నాయి. ఈ విభేధాలు కాస్త, గ్రామ పంచాయితీ ఎన్నికల నాటికి ఆదిపత్య పోరుగా మారే అవకాశ వుంది. పార్టీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకులు. ఎంపీ రేణుకా చౌదరి, మాజీ మంత్రి సంబాని చంద్ర శేఖర్ కూడా కొంత ప్రభావం చూపగలరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వీరికి అనుచరులున్నారు. అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఎవరి వర్గం వారి కుంది. పాలేరుకు మంత్రి పొంగులేటి ప్రాతినిధ్యం వహిస్తుండగా భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావు పేట అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఆయన ప్రధాన అనుచరులు తెల్లం వెంకట్రావు, పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆది నారాయణ ఎమ్మెల్యేలుగా వున్నారు. ఖమ్మానికి మంత్రి తుమ్మల, సత్తుపల్లికి మట్టా రాగమయి శాసన సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ఇక మధిరకు ఉప ముఖ్యమంత్రి బట్టి, వైరాకు ఆయన అనుచరుడు రాందాస్ నాయక్ ప్రాతినిధ్య వహిస్తున్నారు. అయితే, బట్టి, రాందాస్ నాయక్ మినహా మిగిలిన ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మేల్యేలు బీఆర్ఎస్ నుండి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన వారే. తెల్లం వెంకట్రావు మాత్రం ఎన్నికల తర్వాత చేరారు. వీరితో పాటు, ఆయా నియోజక వర్గాల్లో వారి అనుచరులు కూడా పార్టీలోకి వచ్చారు. అయితే, ఎన్నికల అనతరం, పాత కొత్త నాయకులు, కార్యకర్తల మధ్య విభేదాలు రాకూడదన్న ఉద్దేశ్యంతో ముందుగానే బట్టి, తుమ్మల, పొంగులేటి పార్టీ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు పెట్టి, పాత, కొత్త తేడా లేకుండా అందరూ కలసి పని చేయాలని హిత బోధ చేశారు. ఇంత వరకూ జరిగిన చేరికలు మినహా, భవిష్యత్తులో స్థానిక నాయకుల అంగీకారం లేకుండా ఇతర పార్టీల నుండి ఎవరినీ కాంగ్రెస్లో చేర్చుకోబోమని హామీ ఇచ్చారు. కానీ, ఆ తర్వాత కూడా చాలా చోట్ల చేరికలు జరిగాయి. కొత్తగా పార్టీలో చేరిన వారే, ఏ కార్యక్రమం జరిగినా నేతల వెంట దర్శనమిస్తున్నారు. పాత వారు హాజరైనా కొత్త వారే ముందు వరసలో వుంటున్నారు. వీరి చేరికలకు స్థానిక నేతలు, కార్యకర్తల అంగీకారం వుందో లేదో తెలియదు గానీ, కొత్త వారిని చేర్చుకోమని చెప్పిన నేతలు, ఎందుకు చేర్చుకుంటున్నారన్న  ప్రశ్న ఇప్పుడు పాత కాంగ్రెస్ కార్యకర్తల నుండి వినిపిస్తోంది. గతంలో ఇతర పార్టీల్లో వున్న ప్రత్యర్ధులు, ఇప్పుడు కాంగ్రెస్లో చేరడం పలు గ్రామాల పాత కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. కొత్తగా పార్టీలో చేరిన వారు ప్రధానంగా బీఆర్ఎస్ నుండే వచ్చారు. వీరి వల్ల గత ప్రభుత్వ హయాంలో కాంగ్రెస్ నేతలు ఇబ్బందులు పడ్డారు. అనేక కేసులను ఎదుర్కొన్నారు. ఇబ్బందులు పెట్టిన వారే, ఇప్పుడు కాంగ్రెస్లో వుండడం, వారితో కలసి పని చేయాల్సి రావడం, పాత క్యాడర్ జీర్ణించుకో లేక పోతోంది. ఈ పాత, కొత్త పంచాయితీ అక్కడక్కడ వీధికెక్కుతున్నా, చాలా గ్రామాల్లో నివురుగప్పిన నిప్పుల వుంది. రెండు నెలల్లో జరిగే గ్రామ పంచాయితీ ఎన్నికల్లో వీరి మధ్య విభేదాలు స్పష్టంగా బయట పడే అవకాశం వుంది. ఎందుకంటే, గత పంచాయితీ ఎన్నికల్లో ప్రత్యర్ధులుగా తలపడ్డ వారంతా ఇప్పుడు చాలా చోట్ల కాంగ్రెస్లోనే వున్నారు. ఒకే వరలో రెండు కత్తులన్న చందంగా పరిస్థితి మారింది. వీరిలో ఎవరి అభ్యర్ధిత్వాన్ని  పార్టీ బల పరుస్తుంది, ఏ వర్గం వారికి పెద్ద పీట వేస్తారన్న చర్చ గ్రామాల్లో మొదలైంది. కొన్ని గ్రామాల్లో పార్టీ అంగీకారం వున్నా లేక పోయినా తామే సర్పంచ్ అభ్యర్ధులమంటూ ముందుకొస్తున్నారు. బూర్గంపాడు మండలంలోని సారపాకలో ఒకరు ప్రచారం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్ధిగా సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెడుతున్నారు. ఇక భద్రాచలం అసెంబ్లీ నియోజక వర్గంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ అభివృద్ది సంస్థ ఛైర్మన్ పొదెం వీరయ్య, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మధ్య కొంత కాలంగా ఆదిపత్య పోరు నడుస్తోంది. పొదెం వీరయ్య బట్టి విక్రమార్కకు, తెల్లం వెంకట్రావు పొంగులేటికి ప్రధాన అనుచరులు. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు సందర్భంగా వీరి మధ్య విబేధాలు బయట పడ్డాయి. తెల్లం వెంకట్రావు ఏక పక్షంగా ఇందిరమ్మ  కమిటీలు వేస్తున్నారని, కొత్తగా పార్టీలో చేరిన వారికే కమిటీల్లో అవకాశం కల్పిస్తున్నారని ఆరోపిస్తూ దుమ్ముగూడెం మండలంలోని ములక పాడు సెంటర్, నర్సాపురం, లక్ష్మీ నగరంలో ప్లెక్షీలు పెట్టారు. పార్టీలో చేర్చు కోవడం కుదరదని కాంగ్రెస్ పెద్దలు చెప్పినా దుమ్ముగూడెం, భద్రాచలం మండలాలకు చెందిన ఇద్దర్ని  తెల్లం వెంటేసుకొని తిరుగుతున్నారని పొదెం వర్గం ఆరోపిస్తుంది. ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అనేక గ్రామాల్లో ఈ పాత, కొత్త పంచాయితీ అంతర్గతంగా నడుస్తూనే వుంది. పంచాయితీ ఎన్నికల నాటికి ఈ వర్గ పోరు ముదిరి పాకాన పడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడే మంత్రులు, ముఖ్య నేతలు సర్ధి చెప్పి గ్రామాల్లో ఈ అంతర్గత పోరుకు చరమ గీతం పాడక పోతే పార్టీ నష్ట పోయే ప్రమాదం వుంది.  

Janechcha

Comments

Popular Posts

జర్నలిస్టుల రైల్యే పాసులు పునరుద్ధరించేలా కృషి చేయండి

కడు రమ్యం ... రాములోరి కళ్యాణం

అక్రిడేషన్లు పొందడంలో జర్నలిస్టుల ఇబ్బందులను తొలగించండి